Disha Patani: కరణ్ జోహార్ ను ఉద్దేశిస్తూ నెపోటిజంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన 'లోఫర్' బ్యూటీ!
Disha Patani: ‘లోఫర్’తో సినీరంగంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ.. కరణ్ జోహార్ ను ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాను ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం ఆయనే అని చెప్పింది.
Disha Patani: సినీ ఇండస్ట్రీలో నెపోటిజం, ఫేవరిజంపై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచే వచ్చే నటీ నటులకు ప్రాధాన్యత ఇస్తారని, టాలెంట్ ఉన్న అవుట్ సైడర్స్ ను తొక్కేస్తారనే విమర్శలు వస్తుంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ లోని నెపోటిజంపై కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్లు బాహాటంగానే ఆరోపణలు చేస్తుంటారు. ఈ విషయంలో ఛాన్స్ దొరికినప్పుడల్లా బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారికి అవకాశాలు దూరం చేస్తాడని, టాలెంట్ లేని స్టార్ కిడ్స్ ని ఎంకరేజ్ చేస్తాడని మండిపడుతుంటారు. అయితే కరణ్ జోహార్‌ను సమర్థిస్తూ తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ ప్రస్తుతం ‘యోధ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. దిశా పటానీ, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ అంబ్రే, పుష్కుర్ ఓజా సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 15న విడుదల కానున్న నేపథ్యంలో లేటెస్టుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దిశా మాట్లాడుతూ తనలోని నటిని గుర్తించింది కరణ్ జోహార్ అని చెప్పింది. నెపోటిజం అనే పదాన్ని ఉపయోగించనప్పటికీ, తనను తాను అవుట్ సైడర్ గా పేర్కొంటూ కరణ్ ను కొనియాడాటాన్ని బట్టి చూస్తే ఆమె ఉద్దేశ్యం ఏంటననేది అర్థంనవుతుంది.
"ఈరోజు నేను నటినయ్యానంటే, అది కేవలం కరణ్ జోహార్ వల్లనే. ఎందుకంటే నేను మోడలింగ్ చేస్తున్నప్పుడు నాలోని నటిని గుర్తించింది ఆయనే. నాకు అప్పుడు 18 ఏళ్లు. ఆ సమయంలో ఆయన నన్ను ఒక నటిగా గుర్తించకపోయుంటే, నేను ఇక్కడ అలా ఉండేదాన్ని కాదని భావిస్తున్నాను. ప్రజలు ఆయన గురించి ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ నేనొక బయటి వ్యక్తినే. నటిగా నిరూపించుకునేందుకు నాకు ఆయన ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను." అని దిశా పటానీ చెప్పుకొచ్చింది. దీనికి కరణ్ జోహార్ స్పందిస్తూ.. 'ఐ లవ్ యూ' అని అన్నారు.
'లోఫర్' తో ఎంట్రీ...
హాట్ బ్యూటీ దిశా పటానీ 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘ఎంఎస్ ధోని - అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రంతో మంచి క్రేజ్‌ని అందుకుంది. అయితే తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టిన దిశా.. అక్కడ అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. 'కుంఫు యోగా' 'భారత్' 'భాగీ 2' 'మలంగ్' 'ఏక్ విలన్ రిటర్న్స్' వంటి సినిమాలతో అలరించింది. ప్రస్తుతం 'యోధ' చిత్రంతో పాటుగా అక్షయ్ కుమార్ తో కలిసి 'వెల్‌కమ్ టు ది జంగిల్' మూవీలో నటిస్తోంది.
దిశా పటాని చాలా గ్యాప్ తర్వాత 'కల్కి 2898 AD' సినిమాతో మళ్లీ సౌత్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. అలానే 'కంగువ' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతోంది. శివ డైరెక్టర్ లో రూపొందుతున్న ఈ పీరియాడిక్ సినిమాలో హీరో సూర్యకు జోడీగా నటిస్తోంది.
Also Read: ‘గామి’ కంటే ముందు హిమాలయాల్లో చిత్రీకరించిన తెలుగు సినిమాలివే!