IISER Admissions: ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్టు 2024 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎపుడంటే?
IISER Admissions: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఆప్టిట్యూడ్ టెస్టు 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.
IISER Aptitude Test 2024: దేశంలోని ప్రసిద్ధ సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్టు 2024 ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. ప్రవేశాలు పొందినవారికి ప్రతి నెలా స్టైపెండ్ ఇస్తారు. దేశంలో తిరుపతి, బరంపురం, భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురంలో ఐఐఎస్‌ఈఆర్ విద్యాసంస్థులు ఉన్నాయి. అభ్యర్థులు మే 13 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్టు 2024
1) బీఎస్ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ: బయలాజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్సెస్/ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, జియలాజికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్.
2) బీఎస్ డిగ్రీ కోర్సులు (భోపాల్‌లోనే): ఇంజినీరింగ్ సైన్సెస్ (కెమికల్ ఇంజినీరింగ్, డేటా సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్), ఎకనామిక్స్ సైన్సెస్. వ్యవధి నాలుగేళ్లు. బీఎస్ కోర్సులకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు. ఎకనామిక్స్ కోర్సులో చేరినవారు బీఎస్ తర్వాత మరో ఏడాది చదువు పూర్తిచేసుకుంటే ఎంఎస్ డిగ్రీని ప్రదానం చేస్తారు.
బీఎస్-ఎంఎస్ సీట్ల వివరాలు: ఐఐఎస్‌ఈఆర్: బరంపురం - 200, భోపాల్ - 240, కోల్‌కతా - 250, మొహాలీ - 250, పుణె - 288, తిరువనంతపురం - 320, తిరుపతి - 200. ఏడు సంస్థల్లోనూ కలిపి 1748 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు భోపాల్‌లో బీఎస్: ఇంజినీరింగ్ సైన్సెస్‌లో 60, ఎకనామిక్ సైన్సెస్‌లో 30 సీట్లు ఉన్నాయి.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ/బైపీసీ) ఉత్తీర్ఱులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000. విదేశీ అభ్యర్థులు రూ.8500 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రవేశ విధానం: మొత్తం 3 విధానాల్లో ప్రవేశాలు ఉంటాయి. వీటిలో కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్‌డ్, ఆప్టిట్యూడ్ టెస్టు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ చూపినవారితో, కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజనకు ఎంపికైనవారితో 25 శాతం సీట్లు భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను ఆప్టిట్యూడ్ టెస్టు ద్వారా నింపుతారు. ఐఐటీ-జేఈఈ, కేవీపీవై విభాగాలకు కేటాయించిన సీట్లు మిగిలిపోతే ఆప్టిట్యూడ్‌లో ప్రతిభ చూపినవారితో వాటినీ భర్తీ చేస్తారు. కోరుకున్న విధానంలో ప్రవేశం పొందడానికి విడిగా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష విధానం: మొత్తం 240 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ ఒక్కో సబ్జెక్టు నుంచి 15 చొప్పున 60 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. ఇంటర్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్/ హిందీ మాధ్యమాల్లో అడుగుతారు.
కోర్సు స్వరూపం..
ఐదేళ్ల వ్యవధి ఉండే బీఎస్-ఎంఎస్ కోర్సుల్లో చేరినవారికి మొదటి రెండేళ్లు సైన్స్‌లో ప్రాథమికాంశాలు బోధిస్తారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఐదో సంవత్సరం ఆర్ అండ్ డీ.. సంస్థలు, సైన్స్ అంశాలతో ముడిపడిఉన్న పరిశ్రమలను సందర్శిస్తారు. విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ మొదటి రెండేళ్లు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలతోపాటు కొన్ని హ్యుమానిటీస్ కోర్సులు, ఎర్త్‌సైన్స్‌లు అభ్యసిస్తారు.ఆరు నెలలకు ఒకటి చొప్పున కోర్సు మొత్తం పది సెమిస్టర్లు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.05.2024.
➥ దరఖాస్తు సవరణ తేదీలు: 16,17.05.2024.
➥ ఆప్టిట్యూడ్ పరీక్ష హాల్‌టికెట్ల వెల్లడి: 01.06.2024.
➥ ఆప్టిట్యూడ్ పరీక్ష తేది: 09.06.2024.