Mediclaim News: హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి సూపర్ గుడ్ న్యూస్ - గంటలో మెడిక్లెయిమ్ అప్రూవల్ - మూడు గంటల్లో క్లెయిమ్ !
Health Insurance : ఆరోగ్య భీమా ఉన్నప్పటికి ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడం సవాల్ గా మారుతోంది. ఇలాంటి పరిస్థితిని మార్చడానికి ఐఆర్డీఏఐ కీలక మార్పులు తెచ్చింది.

Cashless approval within hours: భారత దేశంలో మెడికల్ ఇన్సూరెన్స్ చాలా క్లిష్టతతో కూడుకున్నది. ఎందుకంటే.. జాయిన్ చేసుకోవాలంటే ఎంత కష్టపడాలో.. డిశ్చార్జ్ కు కూడా అంతే కష్టపడాలి. ఆస్పత్రిలో చేరడానికి మెడిక్లెయిమ్ ను ఎంత త్వరగా యాక్సెప్ట్ చేయరో.. అంతే వేగంగా డిశ్చార్జ్ కూడా చేయరు. ఇప్పుడీ సమస్యను పరిష్కరించేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ముందుకు వచ్చింది. కీలక నిర్ణయాలను తీసుకుంది.
ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను వేగవంతం చేయడానికి కొత్త నిబంధనలను జారీ చేసింది. IRDAI మాస్టర్ సర్కులర్ ప్రకారం, క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ కోసం ఒక గంటలోపు ప్రీ-ఆథరైజేషన్ నిర్ణయం తీసుకోవాలి. డిశ్చార్జ్ సమయంలో మూడు గంటల్లోపు చివరి క్లెయిమ్ సెటిల్మెంట్ పూర్తి చేయాలని బీమా కంపెనీలకు ఆదేశించింది.
ఈ విధానం రోగులకు వేగవంతమైన, ఒత్తిడి లేని క్లెయిమ్ ప్రక్రియను అందించడానికి ఉపయోగపడుతుంది. ఆసుపత్రి డిశ్చార్జ్‌లలో ఆలస్యాన్ని తగ్గించడానికి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనల అమలు ఆసుపత్రులు, బీమా కంపెనీలు , థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్ల (TPAs) మధ్య సమన్వయంపై ఆధారపడి ఉంటుంది. ఆసుపత్రి బిల్లింగ్ వ్యవస్థలు , డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆస్పత్రులు మెరుగుపడాల్సి ఉంది. నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజ్ (NHCX) వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఉపయోగపడతాయి.
బీమా కంపెనీలు క్యాష్‌లెస్ అథరైజేషన్ అభ్యర్థనపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి, గరిష్టంగా ఒక గంటలోపు నిర్ణయం పూర్తి చేయాలి. ఈ నిబంధన ఎమర్జెన్సీ కేసులలో మరింత వేగంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బీమా కంపెనీలు 100 శాతం క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్‌ను సాధించే దిశగా పనిచేయాలని IRDAI ఆదేశించింది. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు కేవలం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఉండాలని .. క్యాష్ లెస్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది.
చికిత్స సమయంలో పాలసీదారుడు మరణిస్తే బీమా కంపెనీ వెంటనే క్లెయిమ్ సెటిల్మెంట్‌ను ప్రాసెస్ చేయాలి. మృతదేహాన్ని తక్షణమే బందువులకు అప్పగించాలి. ఏ క్లెయిమ్‌ను తిరస్కరించాలన్నా, పాలసీ హోల్డర్స్ మేనేజ్‌మెంట్ కమిటీ లేదా దాని సబ్-గ్రూప్ అయిన క్లెయిమ్స్ రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరిని అని ఐఆర్డీఏఐ తెలిపింది. - ఆసుపత్రులలో క్యాష్‌లెస్ అభ్యర్థనలను నిర్వహించడానికి బీమా కంపెనీలు ఫిజికల్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. - పాలసీదారులకు డిజిటల్ మోడ్ ద్వారా ప్రీ-అథరైజేషన్ అందించాలి, ఇది ప్రారంభ ఆమోదం , ఆసుపత్రి ఫైనల్ ఇన్‌వాయిస్ ఆధారంగా క్లెయిమ్ చెల్లింపును నిర్ధారిస్తుందని ఐఆర్డీఏఐ తెలిపింది.
నిజానికి ఈ నిబంధనలను IRDAI జులై 31, 2024 నాటికి అమల్లోకి రావాలని ఆదేశించింది. కానీ ఇంకా పూర్తి గా అందుబాటులోకి రాలేదు. వచ్చే నెలలోపు అమలు చేయాలని ప్రస్తుతం డెడ్డ లైన్ పెట్టింది. చాలా ఆస్పత్రులు డిజిటల్ మోడ్‌లోకి పూర్తి స్థాయిలో మారాల్సి ఉంది కాబట్టి ఆలస్యమయింది. ఇప్పుడు ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చిన కొత్త విధానం వల్ల దాదాపుగా పాలసీహోల్డర్లందరికీ మెలు జరుగుతుంది. సమర్థంగా అమలయ్యేలా చూస్తే... హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేవారి సంఖ్య కూడా పెరుగుతుంది.





















