Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
SC Classification G.O | ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను తెలంగాణలో విడుదల చేయనున్నారు. దేశంలో ఈ పని చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.

SC Classification In Telangana | హైదరాబాద్ తెలంగాణలో సోమవారం నాడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీఓను విడుదల చేయనుంది. దాంతో దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జీఓ విడుదల చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపగా, ఆ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదం తెలిపారు.
సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ తాజాగా సమావేశం అయింది. ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ సోమవారం (ఏప్రిల్ 14న) ఉదయం 11 గంటలకు మరోసారి బేటీ కానుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం ఎస్సీ వర్గీకరణ జి.ఓ విడుదల చేస్తామని తెలిపారు. జీవో మొదటి కాపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తామని చెప్పారు.
తాజాగా జరిగిన సమావేశంలో సబ్ కమిటీ వైస్ చైర్మన్, మంత్రి దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏక సభ్య కమిషన్ చైర్మన్ శమీమ్ అక్తర్, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, న్యాయ శాఖ కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
గత మార్చి నెలలో బిల్లు ఆమోదం
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఈ మార్చి నెలలో ఆమోదం తెలిపింది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశ పెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఇది గొప్ప విజయం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా ఉంటోంది. మరోవైపు దశాబ్ధాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం కొనసాగుతోంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు రేవంత్ రెడ్డి కృతజ్ణతలు తెలిపారు.
6 దశాబ్దాల కిందటే దళితుడు సీఎం
1960 లోనే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ నియమించింది. పంజాబ్ కేసు సుప్రీం కోర్టులో సుదీర్ఘ కాలం కొనసాగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ శాసనసభలో తీర్మానం చేశాం. అందుకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. వన్ మెన్ కమిషన్ ను ఏర్పాటు చేసి.. కమిషన్ ఇచ్చిన నివేదికను ఆమోదించాం.
59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి న్యాయం జరిగేలా పంచాం. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. 2026 జనగణన పూర్తి కాగానే ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని’ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.






















