IPL 2025 DC VS RR Update: మ్యాచ్ ను ములుపుతిప్పిన స్టార్క్.. రెండు రనౌట్లు, ఒక వికెట్ తో సత్తా.. కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఢిల్లికి ఒంటిచేత్తో విజయం
2021 తర్వాత మెగాటోర్నీలో తొలిసారి సూపర్ ఓవర్ జరిగింది.ఈ మ్యాచ్ లో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది. ఇక నాలుగేళ్ల కిందట కూడా ఢిల్లీ జట్టే ఆఖరి సూపర్ ఓవర్ ఆడింది. అప్పుడు కూడా ఢిల్లీనే గెలిచింది.

Mitchell Starc 'Super' Bowling: నరాలు తెగే ఉత్కంఠ మధ్య బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ను మలుపు తిప్పిన బౌలర్ గా మిషెల్ స్టార్క్ ను అభివర్ణించవచ్చు. మ్యాచ్ ఆఖరి ఓవర్ బౌల్ చేసిన స్టార్క్.. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశాడు. విజయానికి చివరి ఓవర్లో కేవలం 9 పరుగులు కావాల్సి ఉండగా, ఎక్కువ భాగం యార్కర్లు, టైట్ బౌలింగ్ తో 8 పరుగులే ఇచ్చాడు. దీంతో నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్లో ఒక మ్యాచ్ టై అయ్యి, సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ కేవలం 11 పరుగులే చేసింది. అనంతరం సెకండ్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాటర్లు నాలుగు బంతుల్లోనే టార్గెట్ ను ఫినిష్ చేశారు. దీంతో ఈ మ్యాచ్ ను ఢిల్లీ కైవసం చేసుకుంది. ఈక్రమంలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని దక్కించుకుంది.
𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉
— IndianPremierLeague (@IPL) April 17, 2025
A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk
మలుపు తిప్పిన రనౌట్లు..
ఇక చివరి ఓవర్, తర్వాత సూపర్ ఓవర్లో కలిపి మూడు రనౌట్లు రాయల్స్ కొంపముంచాయి. ముందుగా 20వ ఓవర్ ఐదో బంతికి రెండు పరుగులకు అవకాశమున్నా, ధ్రువ్ జురెల్ దాన్ని తిరస్కరించాడు. ఆ తర్వాత బంతిని స్టార్క్ యార్కర్ వేయగా, కేవలం ఒక్క పరుగుకే అవకాశముంది. రెండో పరుగు కోసం ప్రయత్నించిన జురెల్ రనౌటయ్యాడు. ఇక సూపర్ ఓవర్ లో తొలి మూడు బంతులకు 9 పరుగులు సాధించిన రాయాల్స్ కు నోబాల్ రూపంలో అనుకోని వరం వచ్చింది. తర్వాతి బంతి ఫ్రీ హిట్ కాగా, స్టార్క్ దాన్ని వైడ్ గా వేశాడు. ఈ బంతికి లేని పరుగుకు ప్రయత్నించి రియాన్ పరాగ్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి స్ట్రైక్ కి వచ్చిన హిట్ మెయర్ .. బంతిని బౌండరీ లైన్ వద్దకు పంపి, రెండు పరుగులకు ప్రయత్నించాడు. అయితే కాస్త ఉదాసీనంగా పరిగెత్తిన యశస్వి జైస్వాల్ రనౌటయ్యాడు. ఇక పరాగ్, జైస్వాల్ రనౌట్లను చేసి మరోసారి మ్యాచ్ ను స్టార్క్ మలుపు తిప్పాడు.
జట్టు సమతూకంగా ఉంది...
ఈ మ్యాచ్ లో కేవలం ఒక్క వికెట్ తీసిన స్టార్క్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్లు కలిపి దాదాపు మూడు అర్థ సెంచరీల వరకు నమోదైనా స్టార్క్ నే ఈ అవార్డు వరించింది. 20 వ ఓవర్ తోపాటు సూపర్ ఓవర్ ను అద్భుతంగా బౌలింగ్ చేయడం, రెండు రనౌట్లలో పాలు పంచుకోవడంతో మిషెల్ నే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక చేశారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తమ జట్టు యంగ్, అనుభవజ్ఞులతో నిండి ఉందని, జట్టులో మంచి వాతావరణం ఉందని స్టార్క్ ఆనందం వ్యక్తం చేశాడు. కెప్టెన్ గా అక్షర్ పటేల్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడని, కుల్దీప్ యాదవ్ సూపర్ గా బౌలింగ్ చేస్తున్నాడని, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్ ల అనుభవం చాలా ఉపయోగ పడుతోందని ప్రశంసించాడు. ఇక ఈ మ్యాచ్ లో విజయం ద్వారా ఈ సీజన్ లో ఐదో గెలుపును నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో టాప్ లేపింది.




















