KTR : ఒకే తప్పును మళ్లీ చేయవద్దు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Telangana News: తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మి తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్రం ఇప్పుడు చిప్ప చేతికి తీసుకున్నట్లుగా తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

Revanth Reddy : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి వంటి మోసగాడిని నమ్మి తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్రం ఇప్పుడు చిప్ప చేతికి తీసుకున్నట్లుగా తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అబద్ధపు హామీలతో ప్రజల జీవితాలు ఛిద్రం
రేవంత్ రెడ్డి ఇచ్చిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఒక్కసారి మోసపోతే మోసగాడి తప్పు, కానీ మళ్లీ మళ్లీ మోసపోతే అది మన తప్పే. ఈసారి ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను ఓడించాలి" అని ప్రజలను హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు కష్టాల్లో కూరుకుపోయారని, హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు.
జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
"ఒకే తప్పును మళ్లీ చేయకండి. జీహెచ్‌ఎంసీతో పాటు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తరిమికొట్టండి" అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం చీకటిలోకి వెళ్తున్నా, రేవంత్ రెడ్డి మాత్రం ఆనందంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. "రేవంత్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వారి వైఫల్య పాలన" అని ఆయన నిప్పులు చెరిగారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
రాజశేఖర్ రెడ్డి కృషిని కొనియాడిన కేటీఆర్
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు. "డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే మార్పు సాధ్యమని ఆయన నిరూపించారు" అని కేటీఆర్ పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరించడానికి శ్రమిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఇదే
"ఏ ఎన్నికైనా, ఏ సందర్భమైనా, ఈసారి కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే" అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును కాపాడాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు ఘనంగా పిలుపు
పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. "ఈ నెల 27న పార్టీ 25 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా జరుపుకుందాం. ఇది తెలుగు రాష్ట్రాల్లో రెండో ఘనత సాధించిన పార్టీగా మన గర్వం" అని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ సభకు ముందు భారీ ర్యాలీ జరిగింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.





















