Telangana Group 1: తెలంగాణ గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
TGPSC Group 1: గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు అంతరాయం ఏర్పడింది. కేసుల విచారణ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Telangana Group 1: తెలంగాణలో చేపట్టిన గ్రూప్1 నియామకాలు తాత్కాలింగా ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తి అయ్యే వరకు నియామకపత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. ఇంతలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చని సూచించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియం పేపర్య వాల్యూయేషన్‌లో కూడా తేడా ఉందని చాలా మందికి ఒకే రకమైన మార్కులు రావడంపై కొందరు అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై హైకోర్టులో పిటిషన్‌లు వేశారు.
ఈ పిటిషన్లు విచారించిన హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు నియామకాలకు బ్రేక్ వేసింది. అప్పటి వరకు నియామకపత్రాలు ఇవ్వొద్దని సూచించింది. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోందని కోర్టు దృష్టికి టీజీపీఎస్సీ అధికారులు తీసుకొచ్చారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎలాంటి అడ్డంకి లేదని స్పష్టం చేసింది. ఆ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ నియామకపత్రాలు మాత్రం ఇవ్వొద్దని స్పష్టం చేసింది.
ఈసారి గ్రూప్ 1 పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తెలుగు మీడియం రాసిన వారికి అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమ అనుమానాలు నివృత్తి చేసే వరకు ఫలితాలు నిలుపుదల చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. రీ వాల్యూయేషన్ చేపట్టాలని అభ్యర్థించారు. మొత్తం 18 రకాల సబ్జెక్టులు పేపర్లను 12 సబ్జెక్ట్ నిపుణులతోనే వాల్యుయేషన్ చేయించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మూడు భాషల్లో జవాబు పత్రాలు ఉంటే కేవలం ఒకే మీడియం నిపుణులతో మూల్యాంకనం చేయించారని అనుమానం వ్యక్తం చేశారు.
మూల్యాంకనంలో సరైన మార్గదర్శకాలు పాటించకపోవడంతో తెలుగు మీడియం వాళ్లకు తీవ్ర అన్యాయం జరిగిందని అభ్యర్థు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2024 ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షలను 4,03,645 మంది అప్లై చేసుకున్నారు. జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు 31,382 మందిని ఎంపిక చేసింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్ పరీక్షలు టీజీపీఎస్సీ నిర్వహించింది. 21,093 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు.





















