Stock Market: ఉగాది రోజున స్టాక్ మార్కెట్‌కు సెలవు ఇచ్చారా, పని చేస్తుందా?
స్టాక్ మార్కెట్‌కు సాధారణ సెలవు రోజులైన శని, ఆదివారాలు కాకుండా... మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఒక్కో రోజు చొప్పున హాలిడేస్ ఉన్నాయి.
Ugadi 2024 Holiday: సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన భారత్‌లో పండుగలకు కొదవ లేదు. సగటున, ప్రతి నెలా కనీసం ఒక పర్వదినం ఉంటుంది. మంగళవారం రోజున (09 ఏప్రిల్ 2024) ఉగాది పండుగ ఉంది. ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది, అదే ఉగాది. వచ్చే సంవత్సరాన్ని శ్రీ క్రోధి నామ సంవత్సరంగా పిలుస్తారు. తెలుగు వాళ్లకు ఇది పెద్ద పండుగ. ఉగాది నుంచి ఆహ్లాదకరమైన వసంత బుుతువు కూడా ప్రారంభం అవుతుంది.
ఉగాది రోజున స్టాక్ మార్కెట్‌కు సెలవు ఇచ్చారా?
స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే.. ఉగాది నాడు స్టాక్ మార్కెట్లకు సెలవు లేదు. బాంబే స్టాక్ ఎక్సేంజ్ BSE, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ NSE యథావిధిగా, సాధారణ సమయాల ప్రకారం పని చేస్తాయి. అయితే.. ఈ వారంలో రంజాన్ సందర్భంగా గురువారం (11 ఏప్రిల్ 2024) నాడు, శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 17న స్టాక్ మార్కెట్లకు సెలవు ఇచ్చారు.
స్టాక్ మార్కెట్‌కు సాధారణ సెలవు రోజులైన శని, ఆదివారాలు కాకుండా... మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఒక్కో రోజు చొప్పున హాలిడేస్ ఉన్నాయి. సెప్టెంబర్‌లో సెలవులు లేవు. అక్టోబర్‌లో ఒక రోజు, నవంబర్‌లో 2 రోజులు, డిసెంబర్‌లో ఒక రోజు స్టాక్ మార్కెట్లు పని చేయవు.
2024లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా (Stock market holidays list for 2024):
ఏప్రిల్ 11, 2024 (గురువారం) - ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్ ఈద్)
ఏప్రిల్ 17, 2024 (బుధవారం) - శ్రీరామ నవమి
మే 01, 2024 (బుధవారం) - మహారాష్ట్ర దినోత్సవం
జూన్ 17, 2024 (సోమవారం) - బక్రీద్
జులై 17, 2024 (బుధవారం) - మొహర్రం
ఆగస్టు 15, 2024 (గురువారం) - స్వాతంత్ర్య దినోత్సవం
అక్టోబర్ 02, 2024 (బుధవారం) - మహాత్మాగాంధీ జయంతి
నవంబర్ 01, 2024 (శుక్రవారం) - దీపావళి లక్ష్మి పూజ
నవంబర్ 15, 2024 (శుక్రవారం) - గురునానక్ జయంతి
డిసెంబర్ 25, 2024 (బుధవారం) - క్రిస్మస్
ఈ ఏడాది దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ (Muhurat Trading 2024 Timings) నవంబర్ 1వ తేదీ, శుక్రవారం రోజున ఉంటుంది. ఆ రోజున, ఏ సమయంలో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ జరుగుతుందన్న విషయాన్ని స్టాక్ మార్కెట్లు ఆ సమయానికి ప్రకటిస్తాయి.
పైన చెప్పిన 14 రోజుల హాలిడేస్‌తో పాటు, శని & ఆదివారాల్లో మరో ఐదు సెలవులు వచ్చాయి. అవి:
1. ఏప్రిల్ 14, 2024 (ఆదివారం) - డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి
2. ఏప్రిల్ 21, 2024 (ఆదివారం) - మహావీరుడి జయంతి
3. సెప్టెంబర్ 07, 2024 (శనివారం) - వినాయక చవితి
4. అక్టోబర్ 12, 2024 (శనివారం) - దసరా
5. నవంబర్ 02, 2024 (శనివారం) - దీపావళి
చారిత్రక స్థాయిలో స్టాక్ మార్కెట్లు (Stock markets at record levels)
స్టాక్ మార్కెట్ ఈ రోజు (సోమవారం, 08 ఏప్రిల్ 2024) రికార్డు స్థాయిలో ప్రారంభమైంది, మధ్యాహ్న సమయానికి అదే జోరులో ఉంది. BSE యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా రూ. 400 లక్షల కోట్లను దాటి రూ. 400.88 లక్షల కోట్లకు చేరుకుంది.
ఈ రోజు BSE సెన్సెక్స్ 307.22 పాయింట్లు లేదా 0.41 శాతం పెరుగుదలతో రికార్డ్ స్థాయిలో 74,555.44 వద్ద; NSE నిఫ్టీ 64.65 పాయింట్లు లేదా 0.29 శాతం లాభంతో 22,578.35 వద్ద ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కూడా స్పీడ్ కొనసాగిస్తూ 74,765.10 స్థాయి దగ్గర సెన్సెక్స్ (Sensex at fresh all-time high) కొత్త రికార్డ్ సృష్టించగా, 22,663.15 దగ్గర నిఫ్టీ (Nifty at fresh all-time high) జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి సెన్సెక్స్ 518 పాయింట్లు పెరిగి 74,766.24 దగ్గర, నిఫ్టీ 147 పాయింట్లు పెరిగి 22,661.45 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు సూపర్ పెర్ఫార్మ్ చేస్తోంది, ఆల్ టైమ్ హై లెవెల్ వైపు కదులుతోంది. బ్యాంక్ నిఫ్టీ గరిష్ట స్థాయి 48,636.45 కాగా, ఇంట్రాడేలో 48,632.80 గరిష్ట స్థాయిని నమోదు చేసింది, చారిత్రక శిఖరానికి కేవలం 4 పాయింట్ల దూరంలో మాత్రమే ఉంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి ఈ ఇండెక్స్ 48,618.55 దగ్గర కదులుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పసిడిలో పెట్టుబడి పెడతారా?, బోలెడు మార్గాలు, ఆన్‌లైన్‌లోనే పని పూర్తి