Housing Prices: ఈ నగరాల్లో ఇంటి రేట్లు కూడా అడగలేం, టాప్-5లో రెండు ఇండియన్ సిటీస్
Real Estate News: దేశ రాజకీయ రాజధాని, ఆర్థిక రాజధానిలో ఇల్లు కొనాలంటే కోటీశ్వరులకు కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. రేట్లు ఆ రేంజ్‌లో పెరుగుతున్నాయి.

Raise In Housing Prices: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి అందమైన కల. అయితే, భారత్‌లోనే కాదు, ప్రపంచంలోని ఎక్కువ దేశాల్లో సామాన్యుల విషయంలో ఈ కల నిజం కావడం లేదు. ఇళ్ల ధరలు కామన్ మ్యాన్‌కు అందుబాటులో లేవన్నది నిజం. అంతేకాదు, నివాస గృహాల ధరలు ఏటికేడు పెరుగుతూ, సొంతింటి కలను మరింత దూరం చేస్తున్నాయి.
తాజాగా, ప్రపంచంలో ఇళ్ల ధరలు అత్యంత వేగంగా పెరుగుతున్న నగరాల జాబితా వెల్లడైంది. ఈ లిస్ట్‌లో... భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై, రాజకీయ రాజధాని దిల్లీ టాప్-5లో ఉన్నాయి. మన దేశంలోని మెట్రో నగరాల్లో ఇల్లు కొనడం ఎంత ఖరీదైన వ్యవహారమో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
నైట్ ఫ్రాంక్ రిపోర్ట్
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ నైట్ ఫ్రాంక్ (Knight Frank), ఈ ఏడాది తొలి త్రైమాసికానికి (2024 జనవరి-మార్చి కాలం) సంబంధించి, 44 ప్రపంచ నగరాల డేటాతో ఒక రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరలు అధికంగా పెరుగుతున్న టాప్ 44 నగరాల్లో ముంబై మూడో స్థానంలో, దిల్లీ ఐదో స్థానంలో నిలిచాయి. అంటే, ప్రపంచంలోని మొదటి 5 నగరాల్లో రెండు నగరాలు భారత్‌కు చెందినవే. గత ఏడాది ఇదే కాలంలో, ఇదే విషయంపై నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన నివేదికలో ముంబై ఆరో స్థానంలో, దిల్లీ 17వ స్థానంలో నిలిచాయి.
నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం, ఇళ్ల ధరల పెరుగుదల పరంగా దిల్లీ చాలా స్పీడ్‌గా ఉంది. ఎందుకంటే, ఈ జాబితాలో దిల్లీ గత సంవత్సరం 17వ స్థానంలో ఉండగా, ఈ సంవత్సరం ఏకంగా 12 స్థానాలు మెరుగుపడి ఐదో ప్లేస్‌లోకి వచ్చింది. అదే సమయంలో, ఆర్థిక రాజధాని ముంబై గతేడాదిలోని ఆరో స్థానం నుంచి ఇప్పుడు మూడో స్థానానికి ఎగబాకింది. ఏడాది కాలంలో 3 నగరాలను వెనక్కు నెట్టింది. దిల్లీ, ముంబై మహా నగరాల్లో ఒక్క ఏడాదిలోనే హౌసింగ్ ప్రైజెస్ ఏ రేంజ్‌లో పెరిగాయో ఈ చిన్న వివరణను బట్టి అర్ధం చేసుకోవచ్చు.
ఈ నగరాలకు ప్రపంచంలో టాప్ ర్యాంక్‌లు
ఇళ్ల ధరల్లో పెరుగుదల పరంగా, 2024 మార్చి త్రైమాసికంలో, ఫిలిప్పైన్స్ రాజధాని నగరం మనీలా (Manila) 26.2 శాతం వార్షిక పెరుగుదలతో మొదటి స్థానంలో ఉంది. జపాన్ రాజధాని నగరం టోక్యో (Tokyo) 12.5 శాతం జంప్‌తో రెండో స్థానంలో ఉంది. నైట్ ఫ్రాంక్ నివేదిక 'ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ Q1, 2024' ప్రకారం, ముంబైలోని ప్రైమ్ రెసిడెన్షియల్ సెగ్మెంట్ ధరలు గత ఏడాది కంటే 11.5 శాతం పెరిగాయి.
ఒక స్థానం తగ్గిన బెంగళూరు
2024 మొదటి త్రైమాసికంలో, భారతదేశ ఐటీ రాజధాని నగరం బెంగళూరు ర్యాంకింగ్ క్షీణించి 17వ స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే సమయంలో ఈ సిటీ 16వ స్థానంలో ఉంది. జనవరి-మార్చి కాలంలో బెంగళూరులో ఇళ్ల ధరలు 4.8 శాతం పెరిగాయి.
ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ (PGCI) అనేది విలువ ఆధారిత సూచీ. దీని గ్లోబల్ రీసెర్చ్ నెట్‌వర్క్ నుంచి అందుబాటులో ఉన్న డేటాను ఉపయోగించి ప్రపంచంలోని 44 నగరాల్లో ఖరీదైన ఇళ్ల ధరల్లో కదలికను ట్రాక్ చేస్తుంది. ప్రపంచంలోని టాప్-44 నగరాల్లో ఇళ్ల ధరలు గత ఏడాదితో పోలిస్తే సగటున 4.1 శాతం పెరిగాయని నైట్ ఫ్రాంక్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీకి బలమైన డిమాండ్ కనిపించడం మంచి విషయమని అన్నారు. ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్‌లో ముంబై, దిల్లీకి మెరుగైన ర్యాంక్‌లు రావడానికి అమ్మకాల్లో వృద్ధి బలంగా మద్దతునిచ్చిందని కూడా శిశిర్ బైజాల్ వెల్లడించారు. మరికొన్ని త్రైమాసికాల వరకు అమ్మకాల వేగం స్థిరంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
మరో ఆసక్తికర కథనం: నేల చూపులు చూస్తున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

