SLBC tunnel: ఒక్క అడుగు ముందుకేసినా రెస్య్కూ సిబ్బందికే డేంజర్- SLBC టన్నెల్ ఆపరేషన్‌లో కన్వేయర్ బెల్టే కీలకం
SLBC tunnel: SLBC వద్ద గత 6 రోజులుగా రెస్క్యూ సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేదు. కేవలం కొద్ది అడుగుల దూరంలో 8 మంది కార్మికులు ఉన్నా. రక్షించలేని దుస్దితి.

Telangana Latest News: తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో SLBC టన్నెలో గత ఆరు రోజులుగా విపరీతంగా రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. టన్నెల్ లోపల 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ప్రమాదంతో లోపల చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎప్, నేవీ సిబ్బందితోపాటు సాంకేతిక నిపుణులు శక్తి వంచనలేకుండా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నా చిక్కుకున్న 8 మందిని బయటకు ఎప్పుడు తీసుకువస్తారో ఇంకా ఎన్నిరోజుల సమయం పడుతుందో ఎవరికీ అంతుచిక్కడంలేదు. దీనికి ప్రధాన కారణం టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన తీవ్రత ఆ స్థాయిలో ఉంది.
మొదటి రోజు టెన్నెల్ లోపలకి వెళ్లే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత లోకో ట్రైన్ సహాయంతో 12వ కిలోమీటరు వరకూ వెళ్లగలిగారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల, నిపుణులు ఇలా టన్నెల్ లోపలికి వెళ్లేవారు, కేవలం 12వ కిలోమీటరు వరకూ అదీ లోకోట్రైన్‌లో మాత్రమే వెళ్లి వస్తున్నారు. అది దాటి మరో కిలోమీటరున్నర దూరం రెస్క్యూ సిబ్బంది మాత్రమే బురదలో ఆగిపోయిన కన్వేయర్ బెల్టుపై నడుచుకుంటూ వెళ్లగలుగుతున్నారు. అలా మొత్తంగా 13 కిలోమీటర్లు దాటి ఓ అరకిలోమీటరు మాత్రమే టెన్నెల్‌లో వెళ్లగలుగుతున్నారు. ఈ ఆరు రోజులపాటు సాగిన రెస్య్కూ ఆపరేషన్ సాధించింది ఇదే. ఇక్కడ నుంచి ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా ఎవరికీ సాధ్యం కావడంలేదు. అలా వెళ్లడమంటే ఏకంగా రెస్య్కూ సిబ్బంది ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వెళ్లాల్సిందే.
ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా టన్నెల్ లోపల బురదతో దాదాపు తొంభైశాతం నిండిపోయింది. పది అడుగుల ఎత్తులో ఉండే టన్నెల్‌లో ఏకంగా తొమ్మిది అడుగుల వరకూ బురద నిండిపోయింది. అది సుమారుగా అరకిలోమీటరు వరకూ విస్తరించి ఉంది. మరోవైపు ఉబికి వస్తున్న వేలలీటర్ల ఊట నీరు కూడా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే టన్నెల్ బోరింగ్ మిషన్ ముక్కలు ముక్కలుగా విరిగిపడి, ఆ శకలాలు బురదలో కూరుకుపోయి ఉన్నాయి. విరిగిన శకలాల ప్రభావంతో టెన్నెల్ సీలింగ్ ఎంతవరకూ దెబ్బతిందో ఎవరికీ అర్థం కావడం లేదు. టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలు తొలిస్తే, ఒకవేళ ఒక్కసారిగా పైకప్పు భాగం, సీలింగ్ విరిగిపడే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బంది ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని , ఆచితూచి అడుగువేస్తున్నారు. ఇప్పటికే టెన్నెల్ పైభాగం కూలే ప్రమాదం ఎంతవరకూ ఉందో తెలుసుకునేందుకు సాయల్ టెస్ట్‌కు మట్టి, కూలిన శకలాలను పంపారు.
ఇదిలా ఉంటే రెస్క్యూ టీమ్ ముందున్న అవకాశాల్లో ప్రధానమైనది కన్వేయర్ బెల్టును సాధ్యమైనంత వేగంగా పునరుద్దరించడం. కానీ ఆరు రోజులుగా అది సాధ్యం కావడంలేదు. ఎక్కువ భాగం బురదలో నిండిపోవడం దీనికి ప్రధాన కారణం. ఒకవేళ కన్వేయర్ బెల్టు పని చేయడం ప్రారంభిస్తే లోపల బురద, ఊటనీరు, శకలాలు ఒక్కొక్కటిగా బయటకు తీసుకురావడంతోపాటు,లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించడం సులభతరమవుతుంది. ఒక వేళ అలా సాధ్యం కాకపోతే డీ వాటరింగ్, డీ సీల్డింగ్, డిబిఎం శకలాలు ఒక్కొక్కటిగా తొలగించి, లోపలికి వెళ్లి చిక్కుకున్న వారిని రక్షించడం.ఇది కాస్త రిస్క్‌తో కూడుకున్న పని.
టన్నెల్‌కు సమాంతరంగా సొరంగం మార్గం తవ్వి లోపలికి వెళ్లాలని మొదట భావించినా, అది సాధ్యంకాదు సరికదా సమస్య తీవ్రతరం అవుతుందని విరమించుకున్నారు. ఇలా SLBC రెస్యూ ఆపరేషన్‌లో ఇప్పుడున్న ఏకైక ఆధారం ఒక్కటే కన్వేయర్ బెల్టు. అది తప్ప టన్నెల్ లోపలికి వెళ్లాలంటే మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశాలు.





















