Kohli Vs Dhoni: కోహ్లీ స్పందన నిజమే.. నాపై ఆ ఫిర్యాదులు ఉన్నాయని మాజీ కెప్టెన్ ధోనీ వ్యాఖ్య
2022లో కెప్టెన్సీ నుంచి దిగిపోయాక, కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక్క ధోనీ మాత్రమే మెసేజీ చేశాడని చెప్పుకొచ్చాడు.తన నెంబర్ చాలామంది దగ్గర ఉందని, ఏ ఒక్కరూ కూడా తనను సంప్రదించలేదని వాపోయాడు.

MS Dhoni Comments: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో జరిగిన సంఘటనను తాజాగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గుర్తు చేసుకున్నాడు. తను ఇతరులతో అంత కలివిడిగా ఉండలేనని, క్రికెట్ మైదానం నుంచి బయటకు వచ్చాక తన లోకంలో తను ఉంటానని చెప్పుకొచ్చాడు. అయితే తన సహచరులకు సహాయం అవసరమైనప్పుడు మాత్రం తను టచ్ లోకి వస్తానని వెల్లడించాడు. నిజానికి ధోనీపై కొన్ని విమర్శలు ఉన్నాయి. తను క్రికెట్ ఆడే కాలం నుంచి కూడా, ఒక్కసారి మైదనాం నుంచి దూరమయ్యాక, సహచరులలకు, మాజీ ప్లేయర్లుకు కూడా ధోనీ అందుబాటులో ఉండేవాడు కాదని చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ధోనీ పై విధంగా సమాధానమిచ్చాడు. ఇక 2022లో టెస్టు కెప్టెన్ గా కోహ్లీ దిగిపోయాక, ధోనీ ఒక్కడు మాత్రమే తనకు మెసేజీ చేశాడని కోహ్లీ గతంలో చెప్పుకొచ్చాడు.
The bond between MS Dhoni and Virat Kohli is one for the ages 🫂 pic.twitter.com/cYOFxWyViV
— OneCricket (@OneCricketApp) February 27, 2025
ముఖాముఖిగా..
అప్పటి విషయాన్ని గురించి కోహ్లీ మాట్లాడుతూ.. 2022 కెప్టెన్సీ నుంచి దిగిపోయాక, కాస్త కష్టకాలంలో తాను ఉన్నట్లు భావించానని ఆ సమయంలో ఒక్క ధోనీ మాత్రమే మెసేజీ చేశాడని చెప్పుకొచ్చాడు. తన నెంబర్ చాలామంది దగ్గర ఉందని, అయితే టీవీల్లో, ఇంటర్వ్యూల్లో చాలా బాగా చెప్పే ఏ ఒక్కరూ కూడా తనను సంప్రదించలేదని వాపోయాడు. సలహాలు, సూచనలు అనేవి ముఖాముఖిగా కలిసి చేబితే బాగుంటుందని, అందరి ముందే చెబితే దానికి వ్యాల్యూ ఉండబోదని పేర్కొన్నాడు. తనకు సంబంధించిన ఏ విషయమైనా, సలహాలు సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని కోహ్లీ తెలిపాడు.
నిజాయతీగా ఉంటాను..
తాను ఆట విషయంలోనే కాకుండా, జీవితంలోనూ నిజాయితీగా ఉంటానని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ధోనీ, తన మధ్య స్నేహం చాలా స్వచ్ఛమైనదని, ఒకరి నుంచి మరొకరికి ఏదో ఆశించి చేసే స్నేహం కాదని, తోడు అవసరమైన సమయంలో ముందుంటామని పేర్కొన్నాడు. తన స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తొలిగా స్పందించి, వారికి చేతనైనంత సాయం చేస్తానని వెల్లడించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ, కోహ్లీ స్నేహం చాలా ప్రసిద్ధి చెందింది. ధోనీ ఆడుతున్న సమయంలో కెప్టెన్ గా కోహ్లీ ఉన్నప్పటికీ, ధోనీపైనే ఎక్కువగా నమ్మకం ఉంచి , అతని సలహాలు సూచనలు పాటించేవాడని నిపుణులు పేర్కొంటారు. భారత్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో కోహ్లీ ఒకడు. సౌరవ్ గంగూలీ తర్వాత జట్టుకు దూకుడు నేర్పి, మూడు ఫార్మాట్లలోనూ నెం.1 గా నిలిపిన ఘనత అతని సొంతం. ఇక వచ్చేనెల 22 నుంచి ప్రారంభం కాబోయే, ఐపీఎల్ 2025కి ధోనీ సిద్దమవుతున్నాడు. తను చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగబోతున్నాడు. ప్రస్తుతం కోహ్లీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ లో ఉన్నాడు. తను వచ్చే ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగనున్నాడు.
Read Also: AFG Vs ENG : ఆఫ్ఘనిస్తాన్ కూడా అదరగొడుతోంది.. మీరు ఎప్పుడు ఆడతారురా అయ్యా..!




















