Russian Crude Oil: రష్యా చమురుకు ఇండియన్ కంపెనీలు రెడీ! పెట్రోల్ ధర తగ్గిస్తారా మరి?
Russia Ukrain war: రష్యా క్రూడాయిల్ దిగుమతికి ఇండియన్ కంపెనీలు రెడీ అంటున్నాయి. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఎంఆర్‌పీఎల్ రష్యా క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నాయి.
Indian Oil, BPCL, HPCL to buy discounted Russian crude: రష్యా నుంచి అతి తక్కువ ధరకే ముడి చమురు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఎంఆర్‌పీఎల్ రష్యా క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నాయి. పెరిగిపోయిన చమురు ధరలు, వస్తున్న నష్టాలను ఆపాలంటే ఇదే మంచి మార్గమని భావిస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంతో దానిపై వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు విధించాయి. అక్కడి నుంచి ముడిచమురు, సహజ వాయువును ఎక్కువగా ఐరోపా దేశాలు కొనుగోలు చేస్తాయి. మనం మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకుంటాం. యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా లేకపోవడంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర గతవారం 120 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం 100 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
భారత ఆయిల్ కంపెనీలు అధిక ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్‌ను అమ్ముతున్నాయి. దీంతో ఆ కంపెనీల లాభదాయకతపై ప్రభావం పడింది. ధరలు పెంచుదామంటే ప్రజలు ఇబ్బంది పడతారు. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అందుకే తక్కువ ధరకు రష్యా ఇస్తామంటున్న ముడి చమురు కొనేందుకు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ఆయిల్ దిగుమతి అయితే పెట్రోలు ధర పెరిగే అవకాశం ఉండదు.
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం అంత తేలికకాదు. మొదట వాటి రవాణాకు నౌకలు, కంటెయినర్లు దొరకాలి. రెండోది డాలర్లలో డబ్బు చెల్లింపులు ఉండవు. కాబట్టి రూపాయి-రూబుల్ మార్పిడి వ్యవస్థను సిద్ధం చేసుకోవాలి. ఇందుకు ఆర్‌బీఐ ఇప్పటికే ప్రణాళికలు వేస్తోంది. గతంలో ఇరాన్‌తో రూపాయి మార్పిడి విధానంలో ఆయిల్‌ను కొనుగోలు చేసింది. ఇక ఇన్సూరెన్స్, రవాణా పరంగా అడ్డంకులను అధిగమించాలి. యుద్ధం కారణంగా రష్యా నుంచి సరఫరా చేయడానికి అన్ని కంపెనీలు ముందుకు రావడం లేదు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో ఈ విషయంలో స్పష్టత రానుంది.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసుకొంటే ఆంక్షల ఉల్లంఘన కిందకు రాదని అమెరికా చెబుతోంది. అయితే ఇలాంటి చారిత్రక సందర్భంలో ఇండియా ఎటువైపు ఉంటుందో తేల్చుకోవాలని అంటోంది. " ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యాపై చాలా ఆంక్షలు అమలవుతున్నాయి. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్‌ను భారత దేశం కొనడం ఆ ఆంక్షలను ఉల్లంఘించినట్లు అవుతుందని భావించడం లేదు. అయితే భారత్ అటువంటి నిర్ణయం తీసుకుంటే చరిత్రలో ఆ దేశానికి అపఖ్యాతి వస్తుంది. ప్రస్తుతం రాసే చరిత్ర పుస్తకాల్లో ఏ వైపు ఉండాలనుకుంటున్నదీ భారత్ నిర్ణయించుకోవాలి. రష్యా నాయకత్వానికి మద్దతివ్వడమంటే దండయాత్రకు మద్దతివ్వడమే. మేం విధించిన, సిఫారసు చేసిన ఆంక్షలను పాటించాలని ప్రతి దేశాన్నీ కోరుతున్నాం" అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ వ్యాఖ్యానించారు.