Tax on Petrol, Diesel: పెట్రోల్, డీజిల్‌పై మరో పన్ను పెంచిన కేంద్రం! సామాన్యుడి పరిస్థితి ఏంటి?
Export Tax on Petrol, Diesel: కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోలు, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF)పై కొన్ని పన్నులు పెంచింది.
Centre Imposes Export Tax On Petrol, Diesel; Windfall Tax On Domestic Crude Oil : కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోలు, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF)పై ఎగుమతి పన్నులు పెంచింది. దాంతోపాటు దేశీయంగా ముడి చమురును ఉత్పత్తి చేస్తున్న రిఫైనరీల రాబడిపై అదనపు పన్నులు వేసింది. ఈ నిర్ణయాలతో సామాన్యుడిపై ఎలాంటి భారం పడదు.
కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోలు, ఏటీఎఫ్‌పై రూ.6, లీటర్ డీజిల్‌పై రూ.13ను ఎగుమతి పన్ను వడ్డించింది. స్థానికంగా ముడి చమురు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై ఒక టన్ను క్రూడాయిల్‌కు రూ.23,230 అదనపు పన్ను విధించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఒక బ్యారెల్ ధర 120 డాలర్ల వరకు ఉంది. దీనిని అనుకూలంగా ఉపయోగించుకొని భారత ఆయిల్ రిఫైనరీలు అధిక లాభాలు పొందుతున్నాయి. ఓఎన్‌జీసీ, వేదాంత లిమిటెడ్ వంటి కంపెనీలు లబ్ధి పొందాయి. ప్రస్తుత పన్నుల పెంపుతో ఏటా ప్రభుత్వానికి అదనంగా రూ.67,425 కోట్ల ఆదాయం రానుంది. ప్రతి సంవత్సరం వీరు 28 మిలియన్ టన్నుల వరకు క్రూడ్‌ను ఉత్పత్తి చేస్తారు.
'ఈ మధ్య కాలంలో ధరలు అనూహ్యంగా పెరిగాయి. దేశవాళీ ఉత్పత్తి సంస్థలు అంతర్జాతీయ ధరలకే స్థానిక రిఫైనరీలకు క్రూడాయిల్‌ను అమ్ముతున్నాయి. ఫలితంగా వారికి విపరీతమైన లబ్ధి చేకూరుతోంది. ఇప్పుడు మేం విధించే సుంకాల ద్వారా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. దేశంలో పెట్రోలు ధరలూ పెరగవు' అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: బంగారం భగ భగ! దిగుమతి పన్ను రెట్టింపు చేసిన కేంద్రం!
కొందరికి మాత్రం పన్నుల భారం నుంచి మినహాయింపు ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. వారు 30 శాతం డీజిల్‌ను మొదట స్థానికులకే కేటాయించాలని షరతు విధించింది. గతేడాది ఉత్పత్తితో పోలిస్తే 2 మిలియన్ బ్యారెళ్ల కన్నా తక్కువ క్రూడ్‌ను ఉత్పత్తి చేస్తున్న చిన్న కంపెనీలకూ మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది. గతేడాది కన్నా ఎక్కువ ముడి చమురును ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంది.
దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్ పంపులకు సరఫరా తగ్గింది. ప్రైవేటు రిఫైనరీలు విదేశాలకు ఎగుమతి చేసేందుకే ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ సహా చాలా రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ డిమాండ్ మేరకు దొరకడం లేదు. అందుకే ప్రభుత్వం ఎగుమతి పన్నులు విధించింది. ఈ నిర్ణయంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, మంగళూరు రిఫైనరీ, చెన్నై పెట్రోలియం కంపెనీల షేర్లు నేడు నష్టాల బాట పట్టాయి.
Also Read: గుడ్ న్యూస్-కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది, ఎంతంటే?