Pawan Kalyan: 'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Vijayawada News: తలసేమియా బాధితుల చికిత్స కోసం ఎన్టీఆర్ ట్రస్టుకు తన వంతుగా రూ.50 లక్షల విరాళం అందిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.

Deputy CM Pawan Has Donates 50 Lakhs To NTR Trust In Euphoria Musical Night: సహాయ కార్యక్రమంలోనూ వినోదాన్ని చూడొచ్చని 'యుఫోరియా మ్యూజికల్ నైట్' (Euphoria Musical Night) నిరూపించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'యుఫోరియా మ్యూజికల్ నైట్'కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'ఈ ఈవెంట్‌కు టికెట్ కొనమని మా వాళ్లకు చెబితే.. విషయం తెలిసి భువనేశ్వరి గారు 'మీరు టికెట్ కొనక్కర్లేదు. కార్యక్రమానికి రండి' అన్నారు. మీరంతా టికెట్ కొని నేను ఉత్తిగా రావడం తప్పుగా అనిపించింది. అందుకని, నా వంతుగా తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలోనే ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం ఇస్తా.' అని పవన్ పేర్కొన్నారు.
'అదే ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రత్యేకత'
ఎలాంటి ప్రచార ఆర్భాటాలు, హంగామా లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లడం ఎన్టీఆర్ ట్రస్టుకు ఉన్న ప్రత్యేకత అని.. మరో వందేళ్లు ఇది కొనసాగాలని పవన్ అన్నారు. 'నారా భువనేశ్వరి గారంటే నాకు అపారమైన గౌరవం. కష్టాల్లోనూ చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమెను దగ్గరి నుంచి చూశాను. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో తలసేమియా బాధితుల కోసం ఈవెంట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. తాను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి బాలకృష్ణ. ఎన్ని తరాలు వచ్చినా ప్రేక్షకులను ఆకర్షించే నటన ఆయన సొంతం.
అటు సినిమాల్లోనే కాకుండా ఇటు సేవల్లోనూ ముందుంటారు. ఇవన్నీ గుర్తించే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్‌తో గుర్తించింది. ప్రచార హంగామా లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ చేసుకుంటూ వెళ్తుంది. విదేశాల నుంచి వైద్యులు వచ్చి చికిత్స చేసి వెళ్లిపోతారు. ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఉన్నారు. ట్రస్టును నిర్వీర్యం చేయాలనుకునే వాళ్లు ఉంటారు. దాన్ని కాపాడుకుంటూ చంద్రబాబు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ నా అభినందనలు. ఈ కార్యక్రమానికి సంగీతం అందిస్తున్న తమన్ గారికి ప్రత్యేక అభినందనలు. మ్యూజికల్ నైట్ ద్వారా విజయవాడకు వన్నె తీసుకొచ్చారు.' అని పవన్ పేర్కొన్నారు.
Also Read: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

