Singer Mangli: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ
Mangli Open Letter: తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని సింగర్ మంగ్లీ స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో దేవుని కార్యక్రమానికి వెళ్తే.. తనపై రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయడం సరికాదంటూ బహిరంగ లేఖ రాశారు.

Singer Mangli Open Letter On Arasavilli Controversy: ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) అరసవిల్లి ఆలయం వివాదంపై తాజాగా స్పందించారు. దేవుని కార్యక్రమానికి వెళ్తే తనపై రాజకీయ పార్టీ ముద్ర వేసి అనవసర ఆరోపణలు చేయడం అన్యాయమని అన్నారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాశారు. శ్రీకాకుళంలో (Srikakulam) ఏటా జరిగే రథసప్తమి వేడుకల్లో లైవ్ కాన్సెర్ట్‌కు తనను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సిక్కోలు ప్రజలు చూపించిన అభిమానాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని.. ఈవెంట్ పెద్ద సక్సెస్ అయ్యిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్, ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని తమ బృందాన్ని అభినందించి సత్కరించారని అన్నారు.
'వ్యక్తిగత పరిచయంతోనే ప్రచారం'
View this post on Instagram
'2019 ఎన్నికలకు ముందు కొందరు నాయకులు నన్ను సంప్రదిస్తే పాట పాడాను. దాని తర్వాత 2 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశాను. అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగా ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చింది. నేను ఇతర పార్టీలకు చెందిన ఎవరినీ ఒక్క మాట అనలేదు. వైసీపీ ఒక్కటే కాదు, అన్ని పార్టీల లీడర్లకు నేను పాటలు పాడాను. ఆ పార్టీకి పాట పాడడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. నా పాట ప్రతీ ఇంట్లో పండుగ కావాలి కానీ, పార్టీల పాట పాడకూడదన్నది నా అభిప్రాయం. ఈ కారణంగానే 2024 ఎన్నికలకు ముందు వైసీపీతో పాటు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పాటలు పాడాలని కోరినా సున్నితంగా తిరస్కరించాను.' అని మంగ్లీ పేర్కొన్నారు.
'అది పూర్తిగా ఫేక్ ప్రచారం'
టీడీపీ అధినేత చంద్రబాబుకి నేను పాట పాడను అన్నది పూర్తిగా అవాస్తవమని మంగ్లీ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'సీఎం చంద్రబాబు దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి. 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో నాపై విష ప్రచారం చేస్తున్నారు. నాకు ఎలాంటి రాజకీయ పక్షపాతాలు లేవు. నేను ఏ పార్టీ ప్రచారకర్తను కాను. ఓ కళాకారిణిగా నాకు పాటే ముఖ్యం. నా పాటకు రాజకీయ రంగులు పులమొద్దు. ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదు. రాజకీయాలకు అతీతంగా నన్ను అందరూ ఆదరించాలని.. అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని తెలిపారు.
అసలేం జరిగిందంటే.?
శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లిలో రథసప్తమి సందర్భంగా ఈ నెల 4న మంగ్లీ బృందం లైవ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వెళ్తూ.. మంగ్లీని కూడా వెంట తీసుకెళ్లారు. అయితే, దీనిపై టీడీపీ క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమైంది. మంగ్లీ వీరాభిమానానికి మెచ్చి గత ప్రభుత్వ హయాంలో జగన్ ఆమెను టీటీడీ నిర్వహణలోని ఎస్వీబీసీ ఛానల్‌కు సలహాదారు పదవిని కూడా కట్టబెట్టారని టీడీపీ కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు.
దీనిపై స్పందించిన మంగ్లీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదంటూ స్పష్టత ఇచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ కుటుంబం ఓ కళాకారిణిగా నన్ను వారితో పాటు ఆహ్వానించారని.. మంత్రి, ఎమ్మెల్యే స్థానంలో ఎవరున్నా దైవ దర్శనం కల్పిస్తారని లేఖలో పేర్కొన్నారు. కళాకారిణిని గౌరవించడం తప్పవుతుందా.? అని ప్రశ్నించారు.
Also Read: బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన 'ఛావా' - ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్, ఎప్పటి నుంచో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

