Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Andhra News: ఐఎఫ్ఎస్ అధికారి, తెలుగు తేజం పందిళ్లపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలవనున్నారు. అటవీ వీరుల సంస్మరణ దినోత్సవంలో పవన్ ఆదివారం పాల్గొననున్నారు.
Pawan Kalyan To Meet IFS Offiecr Pandillapally Srinivas Family: గంధపు చెక్కల వీరప్పన్‌ను ముప్పుతిప్పలు పెట్టి అరెస్టు చేసిన తెలుగు తేజం రాజమండ్రికి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ (Pandillapally Srinivas) వీరోచిత త్యాగం 90ల్లో తెలుగు వారందరికీ తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అటవీ వీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా ఆదివారం గుంటూరులో కలవబోతున్నారు. పందిళ్లపల్లి శ్రీనివాస్ ధాటికి తట్టుకోలేక లొంగిపోతానంటూ కబురు పంపి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పాశవికంగా హత్య చేశాడు వీరప్పన్. తరువాతి కాలంలో శ్రీనివాస్ ఆవలంబించిన పద్ధతులను ఫాలో అయ్యి స్పెషల్ టాస్క్ ఫోర్స్ వీరప్పన్‌ను మట్టు పెట్టగలిగింది. శ్రీనివాస్‌కు కీర్తి చక్ర బిరుదుతో పాటు ఆయన త్యాగాన్ని గుర్తు పెట్టుకుని ఆయన చనిపోయిన రోజు 10 నవంబర్ 1991ను అటవీ వీరుల సంస్మరణ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
జనం గుండెల్లో దేవుడు
రాజమండ్రిలో 12 సెప్టెంబర్ 1954లో పుట్టిన శ్రీనివాస్ సివిల్ సర్వీస్‌లో ర్యాంక్ సాధించి ఫారెస్ట్ అధికారిగా కర్ణాటకలోని చామరాజ్‌నగర్ అడవులకు వెళ్లారు. అది తమిళనాడు బోర్డర్‌లో ఉంది. అప్పటికే అక్కడ వీరప్పన్ స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అయితే అతని గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువ. వీరప్పన్ చేస్తున్న చట్ట వ్యతిరేక పనులను గమనించిన శ్రీనివాస్ వాటి గురించి పై అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేశారు. వీరప్పన్‌కు సహకరిస్తున్న గ్రామ ప్రజల్లో అవగాహన తేవడం కోసం వారికి చదువును పరిచయం చేశారు. సొంత డబ్బుతో స్కూలు, హాస్పిటల్ కట్టించారు. స్మగ్లింగ్‌కు వెళ్లే వీరప్పన్ అనుచరులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పించారు. శ్రీనివాస్ చొరవతో వీరప్పన్ సొంత ఊళ్లో 40 ఇళ్లు కట్టించారు. ఇలా తన వద్దకు వచ్చే వాళ్లు ఆగిపోవడంతో ఒంటరివాడైన వీరప్పన్ 1986లో ఒకరోజు శ్రీనివాస్‌కు దొరికిపోయాడు. అతన్ని చంపే అవకాశం ఉన్నా శ్రీనివాస్ మాత్రం వీరప్పన్ మారాలనుకున్నారు. వీరప్పన్ ఇచ్చిన సమాచారంతో ఆ స్థావరాలపై దాడులు చేసి అతను దాచిన గంధపు చెక్కలు, ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు.
అయితే శ్రీనివాస్ ఈ దాడుల కోసం కర్ణాటక, కేరళ, తమిళనాడు అడవుల్లో తిరుగుతున్న సమయంలో ఒక రాత్రి పోలీసుల వద్ద నుంచి వీరప్పన్ తప్పించుకుపోయాడు. దీనిపై అక్కడి పోలీసులపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈలోపు శ్రీనివాస్‌ను ట్రైనింగ్ కోసం అమెరికా పంపింది ప్రభుత్వం. ఈ క్రమంలో వీరప్పన్ మరింత రెచ్చిపోయాడు. తమిళనాడుకు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ చిదంబరంను కిడ్నాప్ చేసి చంపేశాడు. దాంతో మొదటిసారి భారత ప్రభుత్వం వీరప్పన్ కేసును సీరియస్‌గా తీసుకుంది. ప్రత్యేకంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి శ్రీనివాస్‌ను అమెరికా ట్రైనింగ్ నుంచి వెనక్కి పిలిపించింది. వీరప్పన్ గురించి అన్ని వివరాలు తెలిసిన శ్రీనివాస్ ఉంటే ఆ స్మగ్లర్ ఆట కట్టవచ్చని ప్రభుత్వం భావించింది. 1990 జూన్‌లో టాస్క్‌ఫోర్స్‌లో చేరిన శ్రీనివాస్, స్మగ్లర్ వీరప్పన్ చుట్టూ ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. పైగా శ్రీనివాస్ వీరప్పన్ సొంత ఊరు గోపీనాథంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అక్కడి ప్రజలు జేజేలు పలకడం మొదలెట్టారు. మా ఊర్లో శ్రీనివాస్ మరియమ్మన్ గుడి కట్టించారు. దానితో శ్రీనివాస్ పలుకుబడి మరింత పెరిగింది. శ్రీనివాస్ బతికి ఉంటే తన ఉనికికే ప్రమాదం అని భావించిన వీరప్పన్ ఆయన్ని చంపడానికి పథకం వేశాడు.
మోసంతో రప్పించి..
శ్రీనివాస్ ఒంటరిగా వస్తే తాను లొంగిపోతానని వీరప్పన్ కబురు పంపించాడు. ఇందులో ఏదో కుట్ర ఉందని సహచరులు చెబుతున్నా వీరప్పన్‌ను పట్టుకోవడానికి ఉన్న ఏ అవకాశమూ వదులుకోనంటూ అడవిలోకి వెళ్లారు. ఆయుధాలు లేకుండా ఒంటరిగా వస్తున్న శ్రీనివాస్‌ను చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు వీరప్పన్. అడవుల్లో ఉన్న ఒక కాలువ దాటే ముందు కాళ్లు, చేతులూ కడుగుకోవడానికి వంగిన శ్రీనివాస్‌ను వీరప్పన్ అనుచరుడు ఒకరు వెనక నుంచి కాల్చాడు. వెంటనే చాటు నుంచి వచ్చిన వీరప్పన్ ఎదురు నుంచి రెండు బుల్లెట్లు కాల్చాడు. అప్పటికే స్పృహ తప్పిన శ్రీనివాస్ తల నరికిన వీరప్పన్ ఆ తలతో అడవుల్లోకి వెళ్లిపోయాడు. వెళ్లే ముందు శ్రీనివాస్ శరీరాన్ని పెట్రోల్‌తో కాల్చారు. శ్రీనివాస్ వెంట వెళ్లిన గ్రామస్థులు పారిపోయారు. అడవిలో ఏం జరిగిందో ప్రపంచానికి చెప్పింది ఆ గ్రామస్థులే.
రాజమండ్రిలో ఒక వీధికి శ్రీనివాస్ పేరు
శ్రీనివాస్ హత్యతో పూర్తిగా అలర్ట్ అయిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆయన నిర్మించిన నెట్వర్క్ సహాయంతో తర్వాత కాలంలో వీరప్పన్‌ను ట్రాప్ చేసి చంపగలిగారు. శ్రీనివాస్‌కు కేంద్రం కీర్తి చక్ర అవార్డు ఇచ్చి సత్కరించింది. రాజమహేంద్రవరంలో ఒక వీధి మొత్తానికి పందిళ్ళపల్లి శ్రీనివాస్ పేరు పెట్టారు. కర్ణాటకలో అయితే ఆయనకు గుడికట్టారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం ఆయన పేరు మీద ఏర్పడ్డ అటవీ వీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. పందిళ్ళపల్లి శ్రీనివాస్ కుటుంబీకులను ఆయన ప్రత్యేకంగా కలుస్తున్నారని శ్రీనివాస్ బావ రూప్ కుమార్ తెలిపారు.