Andhra Pradesh Weather: ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన- భిన్న వాతావరణంతో ఇబ్బందులు
AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజలు పాటు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటి వరకు వేడి వాతావరణంలో ఇబ్బంది పడ్డ ప్రజలు ఉపశమనం పొందనున్నారు.
Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌పై కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే... దక్షిణ కోస్తా, సీమలో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
గత కొన్ని రోజులులగా చాలా ప్రాంతాల్లో ఉక్కతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అడపాదడపా వర్షాలు పడుతున్నా వాతావరణం మాత్రం చల్లబడటం లేదు. వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగానే ఇలాంటి పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలో నైరుతి రుతపవనాల కాలంలో ముసురు పట్టి కొన్ని రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వానలు పడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఆదివారం వర్షాలు కురిసిన జిల్లాలు
శ్రీకాకుళంజిల్లా, విజయనగరంజిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా , ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
ఈ జిల్లాలకే వర్ష సూచన
శ్రీకాకుళం జిల్లా, విజయనగరంజిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతిపురం మన్యం జిల్లా, కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉభయగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలో వర్షాలు పడనున్నాయి.
విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, సత్యసాయి జిల్లా, వైఎస్‌ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
కావాల్సినంత వర్షం అయినా తగ్గని వేడి
ముఖ్యంగా ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో ఏకధాటికి కొన్ని గంటల పాటు వర్షాలు పడుతున్నా తర్వాత ఉక్కపోత మొదలవుతోంది. దీనంతటికీ వాతవరణంలో ఉన్న అసమతౌల్యమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో జల్లులు , మోస్తరు వర్షాలు పడుతున్నాయి. సిక్కోలు నుంచి కోస్తా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. అదే టైంలో ఆగస్టులో ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంపై వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే దాదాపు 2 నుంచి ఐదు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అవుతున్నాయి.
వ్యవసాయానికి ఇబ్బందులు
ప్రస్తుతం ఉన్న వాతావరణంలో రైతులు వ్యవసాయ పనులు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కూలీలు దొరక్కపోవడం ఒక ఎత్తు అయితే.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం మరో సమస్యగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఒకేసారి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు, పంటల పొలాలు నీట మునుగుతున్నాయి. ఇలా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అవుతున్నా అది ప్రజలకు ఉపయోగపడటం లేదు. ఇలా కురిసి అలా ఇంకిపోతోంది. లేదా నదులు, చెరువుల్లో కలిసిపోతోంది. సరే ఆ టైంలో వ్యవసాయ పనులకు సిద్ధమవుదామా అనేసరికి వేడి వాతావరణానికి ఉన్న నీరు ఆవిరైపోతోంది. ఇలాంటి వాతావరణంలో పనులు చేయడం చాలా ఇబ్బందిగా ఉంటోందని రైతులు వాపోతున్నారు.
Also Read: శ్రీసిటీలో ఒకేరోజు 15 పరిశ్రమలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు