WPL 2025 MI Vs DC Result Update: మళ్లీ టాప్ లేపిన ఢిల్లీ, టోర్నీలో నాలుగో విజయం- ల్యానింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. 9 వికెట్లతో ముంబై చిత్తు
షెఫాలీ.. బ్యాట్ ఝళిపించి ముంబై ఎడాపెడా బౌండరీలు బాదింది. ల్యానింగ్ కూడా వీలు చిక్కినప్పుడల్లా వేగంగా పరుగులు చేయడంతో పవర్ ప్లేలోనే 57 పరుగులు వచ్చాయి.

WPL Table Topper DC: టేబుల్ టాపర్ల మధ్య జరిగిన పోరులో చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టే పైచేయి సాధించింది. బెంగళూరులో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. హేమాహేమీలున్నప్పటికీ, దాదాపు బంతికో పరుగు చొప్పున స్కోరు సాధించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 123 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ హీలీ మథ్యూస్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెరో 22 పరుగులతో టాప్ స్కోరర్స్ గా నిలిచారు. జెస్ జొనాసెన్, మిన్ను మణి మూడేసి వికెట్లతో రాణించారు. అనంతరం ఛేదనను కేవలం 14.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 124 పరుగులు చేసి ఢిల్లీ పూర్తి చేసింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ మెగ్ ల్యానింగ్ మెరుపు ఫిఫ్టీ (49 బంతుల్లో 60 నాటౌట్, 9 ఫోర్లు) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. అమెలియా కెర్ కు ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో నాలుగు విజయాలతో గ్రూపులో మళ్లీ అగ్రస్థానానికి ఢిల్లీ దూసుకుపోయింది. జొనాసెన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. లీగ్ లో తర్వాతి మ్యాచ్ ఆర్సబీతో ఢిల్లీ జట్ల మధ్య జరుగుతుంది. ఢీల్లీ వరుసగా రెండోరోజు కూడా లీగ్ మ్యాచ్ ఆడుతుండటం విశేషం..
Delhi Capitals Women beat Mumbai Indians Women by 9 wickets with 33 balls remaining in WPL! 🔥
— wicketbuzz (@wicketbuzz) February 28, 2025
A dominant performance! 💥
📸: [WPL] #DCWomen #MIWomen #WPL #Cricket #WicketBuzz pic.twitter.com/aP1sAilxwb
తేలిపోయిన ముంబై..
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై.. ఏ దశలోనూ బారీ స్కోరు దిశగా సాగలేదు. ఆరంభంలోనే ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ యస్తిక భాటియా (11) వికెట్ కోల్పోయింది. మధ్యలో హీలీ, హర్మన్ ప్రీత్ కౌర్ కాస్త పోరాటం చేసినా, ఢిల్లీ బౌలర్ల ముందు తలవంచక తప్పలేదు. మిగతా బ్యాటర్లు కూడా విఫలం కావడంతో ఓ మాదిరి స్కోరు తోనే ముంబై సరిపెట్టుకుంది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఢిల్లీ బౌలర్లు.. ముంబై భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. మిగతా బౌలర్లలో శిఖా పాండే, అన్నాబెల్ సదర్లాండ్ లకు తలో వికెట్ దక్కింది.
తుఫాన్ ఛేజింగ్..
బంతికో పరుగు సాధిస్తే, సునాయసంగా గెలిచే స్థితిలో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి ఓపెనర్లు ల్యానింగ్, షెఫాలీ వర్మ (28 బంతుల్లో 43, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తుఫాన్ ఆరంభాన్ని అందించారు. షెఫాలీ.. బ్యాట్ ఝళిపించి ముంబై ఎడాపెడా బౌండరీలు బాదింది. ల్యానింగ్ కూడా వీలు చిక్కినప్పుడల్లా వేగంగా పరుగులు చేయడంతో పవర్ ప్లేలోనే 57 పరుగులు వచ్చాయి. అప్పటికే ఫలితం దాదాపు తేలిపోవడంతో మరింత స్వేచ్ఛగా ఆడిన బ్యాటర్లు జోరు ప్రదర్శించారు. తొలి వికెట్ కు 85 పరుగులు జోడించాక షెఫాలీ ఔటయ్యింది. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్ (15 నాటౌట్) తో కలిసి ల్యానింగ్ జట్టును విజయ తీరాలకు చేర్చింది. వీరిద్దరూ అబేధ్యమైన రెండో వికెట్ కు 28 బంతుల్లోనే 39 పరుగులు జోడించారు. ఈ విజయంతో టోర్నీలో నాలుగో విజయాన్ని ఢిల్లీ సాధించగా, ముంబై రెండో ప్లేస్ కు పడిపోయింది.




















