SLBC Tunnel Rescue Operation: టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులపై ఆ వార్తలు నమ్మొద్దు: కలెక్టర్ బడావత్ సంతోష్
SLBC టన్నెల్ లో రెస్య్కూ ఆపరేషన్ వేగవంతమైంది. టన్నెల్ లోపల తాజాగా మృతదేహాలు గుర్తించారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆ వదంతులపై జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ క్లారిటీ ఇచ్చారు.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో ఎస్ ఎల్ బిసి టన్నెల్ (SLBC Tunnel Collapse) ప్రమాదం జరిగి నేటికి ఏడు రోజులు గడిచింది. ఈరోజు రెస్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి కనిపించింది. టన్నెల్ లోపలికి వెళ్లేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవ్వడంతో ఈరోజు జీపీఆర్ స్కానింగ్ పరికరాన్ని పంపారు. ఈ పరికరం ద్వారా బురద లోపల దాగున్న శకలాలను సైతం గుర్తించవచ్చు. జిపిఆర్ పరికరం ద్వారా టన్నెల్ ప్రమాద ప్రాంతాకు అత్యంత చేరువలో బురదలోపల మూడుమీటర్ల లోతులో ఐదు ప్రాంతాల్లో కొన్ని శకలాలు గుర్తించినట్లు సమాచారం. అయితే ఆ శకలాలు కార్మికుల మృతదేహాలుగా మొదట ప్రచారం జరిగింది.
టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల మృతదేహాలు దొరికాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన కలెక్టర్ బడావత్ సంతోష్ అవన్నీ నమ్మొద్దని అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎస్ ఎల్ బిసి ప్రమాదంపై వైరల్ అవుతున్న ప్రచారం తప్పుడు ప్రచారం మాత్రమేనని, ఎవరూ నమ్మొద్దని కలెక్టర్ తెలిపారు.
టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై కలెక్టర్ ఇంకా ఏమన్నారంటే..
SLBC టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. సహాయ చర్యలను మరింత వేగవంతం చేసేందుకు ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదంలో 12 బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. వాటిలో ఆర్మీ, నేవి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఫైర్ సర్వీసెస్, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైడ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలు నిరంతరం సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేశాయి.
ప్రమాద ప్రదేశంలో కొనసాగుతున్న సహాయక చర్యలను వేగవంతం చేసేలా సహాయక బృందాలను నిరంతరం పనిచేసేలా పక్కా ప్రణాళికతో వర్క్ చేస్తున్నారు. సహాయక చర్యలకు కావలసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ ప్రమాద ప్రదేశంలోని నీటిని పంపుల ద్వారా బయటికి తోడుతూ, ప్లాస్మా గ్యాస్ కట్టల ద్వారా శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నామన్నారు కలెక్టర్.
టెన్నెల్ లోపల చిక్కుకున్న 8మంది కార్మికులను బయటకు తెచ్చేందుకు సహాయక చర్యల కోసం కావలసిన సామాగ్రిని అందుబాటులో ఉంచుకుంటూ వీలైనంత త్వరగా కన్వేయర్ బెల్ట్ ను ఉపయోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. బురదను బయటకు తీసి వేసేందుకు కావలసిన ఎస్కావేటర్లను సిద్ధం చేసినట్లు కలెక్టర్ బడావత్ సంతోష్ వివరించారు. ప్రత్యేక కెమేరాలు, సెన్సార్ల ద్వారా లోపలి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వివరించారు. శుక్రవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కార్మికుల మృతి వార్తలపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ స్పందించారు. టన్నెల్ వద్ద ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలలో పురోగతిని వివరించారు.
కాగా, SLBC టన్నెల్ లోపల బురద దాదాపు 8 మీటర్లు పేరుకుపోవడంతో లోపల ఉన్న శకలాలు గుర్తించేందుకు ఉపయోగించిన జిపిఆర్ స్కానర్ ద్వారా ఐదు స్పాట్ లను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ఐదు స్పాట్ లలో ఏముందనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అవి కార్మికుల ఆనవాళ్లా లేక మరేఇతర టెన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలా అనేది తెలియాల్సి ఉంది.





















