(Source: ECI/ABP News/ABP Majha)
JNTU News: మారని జేఎన్టీయూ తీరు! క్యాంటిన్‌లో ఫుడ్ తింటున్న పిల్లి - వీడియో వైరల్
Hyderabad News: జేఎన్టీయూ హాస్టల్‌లోని క్యాంటిన్‌లో వంట పాత్రల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను పిల్లి తింటోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
JNTU Food Virl Video: కేపీహెచ్‌బీలో ఉన్న జేఎన్టీయూ కూకట్ పల్లి హాస్టల్ లో విద్యార్థులకు వడ్డించాల్సిన ఆహారంపై ఆందోళన నెలకొంది. ఎందుకంటే.. ఆ హాస్టల్‌లోని క్యాంటిన్‌లో ఉన్న వంట పాత్రల వద్ద పిల్లి తిరుగుతూ వాటిలోని ఆహార పదార్థాలు తింటోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల జేఎన్టీయూ హాస్టల్‌లో తనిఖీలు చేయగా.. క్యాంటీన్ నిర్వహణ చాలా దారుణంగా ఉందని గుర్తించారు. వంట గదిలో ఎక్కడిపడితే అక్కడ కూరగాయల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు.
అయితే, వారం రోజులు గడవకముందే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో వారం రోజుల క్రితం ఓ జుగుప్సాకరమైన వీడియో ఒకటి వెలుగు చూసిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు వడ్డించే అల్పాహారంలోని చట్నీలో ఓ ఎలుక ఈత కొడుతున్న వీడియో సంచలనం అయింది. ఈ వ్యవహారాన్ని కొందరు విద్యార్థులు ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.
ఈ ఘటన చాలావరకూ వెళ్లింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి.. ఏకంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురితో ఫోన్లో మాట్లాడారు. ఆర్డీవో పాండు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు తదితర అధికారులను అప్రమత్తం చేసి కాలేజీని పరిశీలించారు. క్యాంటిన్ లోని వంట గది, చుట్టుపక్కల పరిసరాలు, డైనింగ్ హాల్, వంటగది సామగ్రి తదితర అన్నింటని తనిఖీలు చేశారు. కాలేజీలోని ఉద్యోగులతో మాట్లాడి.. వివరాలు తెలుసుకున్నారు. పైగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు చేయించాలని మంత్రి ఆదేశించారు.
అయినప్పటికీ ప్రధాన కేంద్రం అయిన కూకట్ పల్లి జేఎన్టీయూ హస్టల్‌లో పిల్లి వంటపాత్రల్లోని భోజనం తింటున్న తీరు నివ్వెరపరుస్తోంది. జేఎన్టీయూ ప్రధాన కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.