BAN vs NED: టీ20 వరల్డ్‌కప్‌లో మరో థ్రిల్లింగ్ విక్టరీ- నెదర్లాండ్‌పై బంగ్లాదేశ్ విజయం
BAN vs NED: టీ20 వరల్డ్ కప్ 2022 సూపర్-12 రౌండ్లో బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. నెదర్లాండ్స్ ను 9 పరుగుల తేడాతో ఓడించింది.
Bangladesh beat Netherlands: టీ20 వరల్డ్ కప్ 2022 సూపర్ -12 రౌండ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. గ్రూప్-2లో తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను 9 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా నెదర్లాండ్స్ జట్టును 135 పరుగులకే కుదించారు. బంగ్లాదేశ్ విజయంలో తస్కిన్ అహ్మద్ కీలక పాత్ర పోషించాడు.
ఇక్కడ టాస్ గెలిచిన నెదర్లాండ్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బంగ్లాదేశ్ 5.1 ఓవర్లలో తొలి వికెట్ కు 43 పరుగులు జోడించింది. సౌమ్య సర్కార్ (14)ను ఔట్ చేసిన తర్వాత పెవిలియన్‌కు బ్యాటర్లు క్యూకట్టారు. నజ్ముల్ హుస్సేన్ (25), లిటన్ దాస్ (9), షకీబ్ అల్ హసన్ (7) త్వరగానే ఔట్ అయ్యారు. ఇక్కడి నుంచి అఫిఫ్ హుస్సేన్ ఒక వైపు స్టాండ్ అయినప్పటకీ మిగతా బ్యాటర్ల నుంచి ఆయనకు సహకారం లభించలేదు. అతను 27 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అవతలి ఎండ్ నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. లోయర్ డౌన్ ఆర్డర్‌లో మొసాడెక్ హుస్సేన్ 13 బంతుల్లో 18 పరుగులు చేసి బంగ్లాదేశ్ జట్టును 140 దాటించాడు.
145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి ఓవర్ వరకు సాగింది మ్యాచ్. ఈ పోరులో నెదర్లాండ్స్ తన ఇన్నింగ్‌ను చాలా పేలవంగా ప్రారభించింది. ఎలాంటి పరుగులు చేయకుండానే నెదర్లాండ్స్ రెండు వికెట్లు కోల్పోయింది. మూడో వికెట్ కూడా 13 పరుగులకే కుప్పకూలింది. కొలిన్ అకర్మాన్ 48 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అతను ఒక చివరి వరకు ఒంటరిపోరాటం చేశాడు. మరో ఎండ్ నుంచి స్కాట్ ఎడ్వర్డ్స్ (16) నుంచి మాత్రమే అతనికి మద్దతు లభించింది. కోలిన్ అకెర్మాన్ ను ఔట్ అయిన వెంటనే మ్యాచ్‌పై నెదర్లాండ్స్ ఆశలు వదిలేసుకుంది.
View this post on Instagram
నెదర్లాండ్స్ జట్టు 16.5 ఓవర్లలో 101 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అప్పుడు 19 బంతుల్లో 44 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ పాల్ వాన్ 14 బంతుల్లో 24 పరుగులు చేసి మ్యాచ్‌పై మరోసారి ఆశలు రేపాడు. చివరి ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకొచ్చాడు. మ్యాచ్ చివరి బంతికి అతను ఔటయ్యాడు. నెదర్లాండ్స్ 135 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4 వికెట్లు, హసన్ మహమూద్ 2 వికెట్లు తీశారు.