Jyeshta Purnima 2024 : జ్యేష్ట పౌర్ణమి విశిష్టత - ఈ రోజుని ఏరువాక పున్నమి అని ఎందుకంటారు..ఈ రోజు ఏం చేస్తారు!
Jyeshta Purnima 2024 : ఏడాదికి 12 పౌర్ణమిలు వస్తాయి..వాటిలో కార్తీక పౌర్ణమి తర్వాత అత్యంత విశిష్టమైనది జ్యేష్ఠపౌర్ణమి. ఈ రోజు విశిష్టత ఏంటి? ఈ రోజునే ఏరువాక పున్నమి అంటారెందుకు? పూర్తివివరాలివే.
ప్రతి తిథికి ఓ విశిష్టత ఉంటుంది.. ఏకాదశి, పౌర్ణమి మరింత ప్రత్యేకం. ఏకాదశి రోజు ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తారు. పౌర్ణమి రోజు సముద్రం, నదీ స్నానాలు ఆచరిస్తారు. చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నెలకి ఆ పేరు నిర్ణయించారు. ఆధ్యాత్మక పరంగా జ్యేష్ఠ పౌర్ణమిని విశిష్టమైనదిగా భావిస్తారు. భర్త సత్యవంతుడు ప్రాణాల కోసం యముడిని అనుసరించిన సావిత్రిదేవి వ్రతం ఫలించినరోజు ఇదే అని పండితులు చెబుతారు. ఈ ఏడాది జ్యేష్ఠ పౌర్ణమి జూన్ 21 శుక్రవారం వచ్చింది..
Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!
జ్యేష్ఠ పౌర్ణమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు
జూన్ 21 శుక్రవారం ఉదయం 6 గంటల 37 నిముషాలకు ప్రారంభమైంది..సూర్యోదయం అయిన వెంటనే మొదలైన పౌర్ణమి ఘడియలు జూన్ 22 శనివారం ఉదయం 6 గంటల 9 నిముషాల వరకే ఉన్నాయి. పౌర్ణమి తిథి రాత్రికి ఉన్న సమయం ప్రధానం..అందుకే జూన్ 21 శుక్రవారం జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది.
జ్యేష్ఠ పౌర్ణమి రోజు నదుల్లో కానీ, సముద్రంలో కానీ స్నానమాచరించడం వల్ల నిండు చంద్రుడి కళలు ఆ నీటిలో నిక్షిప్తమై అనారోగ్యాన్ని తొలగిస్తాయంటారు. పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణులను, రావిచెట్టును పూజిస్తారు. ఈ రోజు చేసే పూజలు, దాన ధర్మాల వల్ల శని దోష నివారణ జరుగుతుంది. రోజంతా ఉపవాసం ఉంది సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత గంగాజలంలో పాలను కలపి చంద్రుడికి సమర్పించడం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జాతకంలో ఉన్న చంద్రదోషం తొలగిపోతుంది.
ఏరువాక పౌర్ణమి, వటసావిత్రి వ్రతం, సత్యనారాయణ వ్రతం. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం, పూరీ జగన్నాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఈ విశేషాలన్నీ జ్యేష్ఠ పౌర్ణమి రోజే.. వీటిలో ఏరువాక పౌర్ణమి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి
Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!
ఏరువాక పౌర్ణమి
వ్యవసాయం అంటేనే ఓ యజ్ఞం. ఆ యజ్ఞం సంపూర్ణంగా జరిగినప్పుడే సకల ప్రాణులు ఆయురారోగ్యాలతో ఉంటారు. అందుకే ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించేందుకు జ్యేష్ఠ పౌర్ణమిని ప్రత్యేక ముహూర్తంగా భావిస్తారు రైతులు. వ్యవసాయ పనులు ప్రారంభించేముందు అన్నంపెట్టే భూమాతకి పూజచేస్తారు. అనంతరం దుక్కి దున్ని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఎరువాక అంటే ఎద్దులను పూన్చి భూమిని దున్నేందుకు సిద్ధం చేసిన నాగలి. ఈ పనిని శాస్త్రోక్తంగా ప్రారంభించడాన్నే ఏరువాక అని పిలుస్తారు. అంటే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే రోజు అని అర్థం.
ఏడాదికి 12 పౌర్ణమిలు ఉంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజే ఎందుకు?
చంద్రుడు సస్యానికి అధిపతి. శాస్త్రం ప్రకారం నాగలి సారించి పనులు ప్రారంభించేందుకు జ్యేష్ఠ నక్షత్రం అత్తుత్తమం. ఆ నక్షత్రంలో చంద్రుడు ఉన్న సమయంలో వ్యవసాయ పనులు ప్రారంభిస్తే భూమిపై అమృతం లాంటి పంట పండుతుందంటారు. అందుతే జ్యేష్ఠ పౌర్ణమి రోజు నాగలిలో పొలంలోకి దిగుతారు రైతులు.
ప్రకృతి పంచభూతాత్మకం!
పంచభూతాత్మకమైన ప్రకృతిని భగవంతుడిగా ఆరాధించడం హిందువుల సంప్రదాయం. వ్యవసాయం మనుగడకు జీవనాధారం అయిన భూమిని పూజించడాన్ని యజ్ఞంలా భావిస్తారు. అందుకే పొలాల్లో అడుగుపెట్టేవారు చెప్పులు వేసుకోరు..ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రత అలాంటిది. అక్కడ అణువణువూ దైవభూమిగానే చూస్తారు. ఇక జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎద్దులను అందంగా అలంకరించి వాటికి భక్ష్యాలు సమర్పించి మేళతాళాలతో ఊరేగించి భూమాతకి పూజ చేస్తారు.
ఏరువాక పూర్ణిమను సంస్కృతంలో సీతాయజ్ఞం అని, కన్నడంలో కారణి పబ్సం అని అంటారు. ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది అధర్వణవేదం . ఇంకా..'వప్ప మంగళ దివసం', 'బీజవాపన మంగళ దివసం', 'వాహణ పుణ్ణాహ మంగళమ్', 'కర్షణ పుణ్యాహ మంగళమ్' అనే పేర్లతోనూ ఏరువాక పౌర్ణమిని జరుపుకుంటారు...
Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!