Kalki 2898 AD : కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!
Kalki 2898 AD : ప్రభాస్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ వచ్చేసింది. సినిమా విడుదలకు ముందే చాలా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి..వాటికి సమాధానమే ఈ కథనం...
Kalki 2898 AD : ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదలకు సిద్ధమవడంతో అందరి కాన్సన్ ట్రేషన్ కలియుగంపై పడింది. అసలు కలి ఎవరు? కల్కి ఎవరు?..ధర్మ సంస్థాపన ఏంటి? ఇంతకీ కలియుగం అంతమయ్యే సమయం ఆసన్నమైందా? అంతమయ్యే ముందు సంకేతాలేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు...ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం...
వేదాలను అనుసరించి యుగాలను 4....
1. సత్యయుగం - ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది.భగవంతుడే భూమిని పాలించాడు..అందుకే ఎలాంటి బాధలు, కష్టాలు లేకుండా ప్రజలంతా ధర్మపరులై సంతోషంగా జీవించారు
2. త్రేతాయుగం - శ్రీ మహావిష్ణువు శ్రీ రాముడిగా అవతరించిన ఈ యుగంలో ధర్మం మూడుపాదాలపై నడిచింది. స్త్రీ వ్యామోహం , రాక్షస ప్రవృత్తి కారణంగా ఈ యుగంలో ధర్మంలో ఓ భాగం దెబ్బతింది...
3. ద్వాపరయుగం - శ్రీ మహావిష్ణువు శ్రీ కృష్ణుడిగా అవతరించిన ఈ యుగంలో చెడువిద్యలు, దుర్మార్గాలు, స్త్రీలపై అఘాయిత్యాలు పెరిగి ధర్మంలో రెండు పాదాలు దెబ్బతిని..రెండు పాదాలపై నడిచింది
4. కలియుగం - శ్రీ కృష్ణుడు అవతారం చాలించిన మరుక్షణం కలియుగం ప్రారంభమైంది. ఈ యుగం కాలపరిమితి 4 లక్షల 32 వేల సంవత్సరాలు. ఇప్పటికి 5 వేల ఏళ్లు గడిచిపోయాయి.
కలి ఎవరు?
క్రుద్దుడు అనే యువకుడు హింస అనే తన చెల్లెలినే పెళ్లిచేసుకుంటాడు..వారికి కలిగిన సంతానమే కలి. అంటే కలి పుట్టుకే వేద విరుద్ధం...ఇక కలిపాలించే యుగం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ధర్మమా అంటే ఏంటి అనేంత అధర్మంగా ప్రజలు జీవిస్తారు. ఏ కర్మలు పాటించకూడదని పరమేశ్వరుడు చెప్పాడో..వాటినే ఆచరిస్తారు. అంతా కలి ప్రభావం అని అందుకే అంటారు..
కల్కి ఎవరు?
శ్రీ మహావిష్ణువు అవతారాల్లో పదవది అయిన కల్కి రాక గురించి శ్రీ భాగవత పురాణం - కల్కి పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. కలియుగం అంతమైన సత్యయుగం ప్రారంభమయ్యే సంధికాలంలో కల్కి భగవానుడు 'శంభల' అనే గ్రామంలో విష్ణుయశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు. చేతిలో ఖడ్గం, తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ధర్మసంస్థాపన చేస్తాడు. కలకి అంటే దోషాన్ని పోగోట్టేదని అర్థం...దోషాలను హరించే అవతారం కనుకే కల్కి అయ్యాడు.
యుగాంతానికి ముందు కనిపించే సంకేతాలివే!
కలియుగం అంతం అయిపోయేముందు కనిపించే సంకేతాల గురించి బ్రహ్మవైవర్త పురాణం, భాగవతం, విష్ణుపురాణంలో స్పష్టంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన సంకేతాలు 20...
1. రోగం లేని మనిషి కనిపించడు...అయితే శారీరక రోగం లేదంటే మానసిక రోగం ఏదో ఒకటి ఉంటుంది
2. తినే ఆహారం రుచి తగ్గిపోతుంది.. కల్తీ ఆహారం, ప్లాస్టిక్ మిక్స్ చేసిన ఆహారం ఇవన్నీ ఈకోవకే చెందుతాయి
3. అపరాథం చేసినవారిని శిక్షించకుండా క్షమించేస్తారు... ఘోరమైన తప్పదాలు చేసినవారు కూడా ప్రజల మధ్య స్వచ్ఛమానవుల్లా తిరిగేస్తుంటారు
4. బ్రాహ్మణులు పోషణ లేక మ్లేచ్ఛులను సేవిస్తారు - వేదవిద్యను వదిలేసి ఉద్యోగాలు, వ్యాపారులు చేస్తున్నవారంతా ఈ కోవకే చెందుతారు
5. సత్యం, ధర్మం అనే మాటే వినిపించదు...స్త్రీలను , చిన్నారులను, గోవులను దారుణంగా హింసింస్తారు. అత్యాచారాలు , అఘాయిత్యాలు, గోవధ ఇవన్నీ తరచూ చూస్తూనే ఉన్నాం...
6. వివాహానికి కుటుంబాలతో పెద్దలతో సంబంధం లేకుండా తమ నిర్ణయమే అంతిమం అన్నట్టు స్త్రీ-పురుషులు వ్యవహరిస్తారు...
7. కన్నవారిని రోడ్డుపాలు చేసి కళ్లముందే వారు కష్టాలుపడుతున్నా కిమ్మనకుండా సంతోషంగా జీవించేస్తారు పిల్లలు...
8. కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నం అయిపోతుంది. ఒకే ఒక జీవితం అంటూ మత్తు, శారీరక సుఖాలపై ఆసక్తి పెంచుకుంటారు.
9. కంటికి కనిపించినదే ప్రామాణికం అంటారు...కనిపించని దేవుడి గురించి వితండవాదన చేస్తారు...సైన్స్ ఎన్ని విషయాలు కనిపెట్టినా అది కేవలం ఓ వంతు మాత్రమే...మిగిలిన మూడొంతుల శక్తి భగవంతుడే అని గుర్తించలేరు...
10. తినకూడని పదార్థాలు తింటారు...చూడకూడని విషయాలవైపు కళ్లు ఆకర్షితమవుతాయి...వినకూడని విషయాలపై వ్యామోహం పెరుగుతుంది.. కోరికలు పెరిగి వ్యాధులబారిన పడతారు..
11. గురువులకు తలొంచి నమస్కరించే విద్యార్థులు కనిపించరు..పైగా విద్యార్థులను చూసి గురువులు భయపడే పరిస్థితులు ఎదురవుతాయి..
12. పదవి కోసం , డబ్బు కోసం... మూర్ఖులను, భగవంతుడిని నమ్మనివారిని ప్రజలు బలపరుస్తారు
13. దొంగలే పాలకులుగా మారుతారు...తమ స్వార్థం కోసం ఉపద్రవాలు సృష్టించి ప్రజల్ని క్షోభ పెడతారు
14. పాలకులే ప్రజా భక్షకులుగా మారుతారు...అనవసర వస్తువులపై పన్నులు విధించి ప్రజల్ని పీడిస్తారు
15. యజ్ఞయాగాదులు జరగక ప్రకృతి క్షోభిస్తుంది.. చెట్లు బలహీనం అవుతాయి..జలాశయాలు ఎండిపోతాయి...
16. సన్యాసులకు స్త్రీలపై వ్యామోహం పెరుగుతుంది..వితంతువులతో కలసి సంతానం పొందుతారు
17. గంగమ్మను గౌరవించరు..తులసిని అవమానపరుస్తాలు..అందుకే ఆకలిదప్పులు పెరుగుతాయి
18. బ్రాహ్మణులు దైవారాధన వదిలిపెట్టేస్తారు..సంధ్యావందనం చేయాల్సింది పోయి మద్యమాంసాలు విక్రయిస్తారు
19. రాక్షసులకు శరీరం ఉండదు..ప్రతి మనిషిలోనూ గుణాల రూపంలో రాక్షసులు ఉంటారు..జనాలు కిరాతకుల్లా ప్రవర్తిస్తారు
20 . ఈ జీవితం ఎందుకులే అని భారంగా అనిపిస్తుంది...
ఈ 20 లక్షణాలు కలియుగం మొదటిపాదం పూర్తయ్యేసరికి మరింత ముదురుతాయి..
Also Read: కల్కి ఎంట్రీతో కలియుగం అంతమైపోతుందా - కల్కి ఎప్పుడు వస్తాడు!
కలియుగం రెండో పాదంలో అసలు భగవంతుడి నామస్మరణే వినిపించదు
కలియుగం మూడు పాదంలో దేవుడున్నాడు అనే విషయమే గుర్తుకురాదు.. ఇప్పుడు పదేళ్లు, పదకొండేళ్లకే రజస్వల అవుతున్న ఆడపిల్లలు కలియుగం మూడోపాదంలో ఏడేళ్లకే పిల్లల్ని కంటారు..మరుగుజ్జులుగా జన్మించే ఆ సంతానం కేవలం 20 ఏళ్లు మాత్రమే బతుకుతారు. వానలు లేక పంటలు పండక మాంసం తిని బతుకుతారు
కలియుగం నాలుగో పాదంలో అరాచకానికి అంతుండదు...ఓ మనిషిని తింటే కానీ మరో మనిషి బతకలేని దుస్థితికి చేరుకుంటారు. ఆఖరి వందేళ్లలో కరవు విలయతాండవం చేస్తుంది....
అప్పుడు వస్తాడు కల్కి... ఆ తర్వాత నుంచి మళ్లీ సత్యయుగం ప్రారంభమై నారాయణుడే భూమిని పాలిస్తాడు....