Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్- రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Sankranti Rush: సంక్రాంతికి ఊరు వెళ్లే వాహనాలతో జంక్షన్‌లు జామ్ అయ్యాయి. వాహనాలు కిటకిటలాడుతున్నాయి. రైల్వేస్టేషన్, బస్టాండ్ ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు.

Sankranti Rush: తెలుగు వారికి పెద్ద పండగ సంక్రాంతి. ఎంత దూరంలో ఉన్నాసరే సంక్రాంతికి ఊరు వెళ్లాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే సొంతూళ్లకు బయల్దేరే వారితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్లు జామ్ అయ్యాయి. బతుకుదెరువు కోసం వచ్చి వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఏదో వాహనం పట్టుకొని ఊరికి వెళ్దామని బయల్దేరడంతో ఆర్టీసీ బస్‌లు, ట్రైన్స్, ప్రైవేటు వాహనాలు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇలా పట్టణాల నుంచి పల్లెలకు వెళ్తున్న జనంతో రోడ్లు కిక్కిరిసి పోగా, రైల్వేస్టేషన్లు, బస్టాండ్, విమానాశ్రయాలు కూడా రద్దీగా మారాయి.
ఏటా కనిపించిన దృశ్యాలే సీన్లే రిపీట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతికి వెళ్లే వాహనాలతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్లు కొద్ది వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా రద్దీని నియంత్రించడం అధికారుల వల్ల కాలేదు. టోల్ ప్లాజాల వద్దే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, బెంగళూరు శివార్లలో ట్రాఫిక్ జామ్ జనాలకు చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెగ్యులర్‌గా నడిచే రైళ్లకు అదనంగా ట్రైన్స్ కలిపి మొత్తంగా 800లకుపైగా ట్రైన్స్‌ను నడుపుతోంది. వీటిలో కేవలం సంక్రాంతికి వెళ్లే వారి కోసమే 150కిపైగా ట్రైన్స్ రన్ చేస్తోంది. ఎన్ని ట్రైన్స్ నడుపుతున్నా ఊరికి వెళ్లే ప్రయాణికులకు మాత్రమే సీట్లు లభించడం లేదు. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు పెట్టిన క్షణాల్లోనే ఫుల్ అవుతన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, కర్ణాటక వెళ్లే ట్రైన్స్ కిటకిటలాడుతున్నాయి. ట్రైన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి తోడు ఆన్‌లైన్‌లో కూడా సాధారణ టికెట్ తీసుకునే ఫెసిలిటీ తీసుకొచ్చింది రైల్వే శాఖ. వీటిపై రాయితీ కూడా ఇస్తోంది.
ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్‌లు
ట్రైన్స్‌లో టికెట్ దొరకని వారు బస్‌లవైపు చూస్తున్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రోడ్ రవాణా సంస్థలు ప్రత్యేక బస్‌లను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణ ఎక్కువ స్పెషల్ బస్‌లను వేసింది. వాటికి స్పెషల్ ప్రైస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీస్‌లు నడుపుతోంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ప్రత్యేక సర్వీస్‌లు ఎక్కువగా లేకపోవడంతో జనాలకు ప్రైవేటు ఆపరేటర్లు దిక్కు అయ్యారు.
అమాంతం రేట్లు పెంచిన ప్రైవేటు ఆపరేటర్లు
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ప్రైవేటు ఆపరేటర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే ప్రైవేటు ఆపరేటర్లు మాత్రం ఇష్టం వచ్చిన ధరలకు టికెట్లు అమ్ముతున్నారు. రద్దీకి తగ్గట్టుగా అప్పటికప్పుడు రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో రేటు తక్కువగా కనిపిస్తున్నా ఖాళీలు లేవన్నట్టు చూపిస్తున్నారు. సరే నేరుగా ఏదైనా బస్ దొరుకుతుందేమో అని చూస్తే అక్కడ కూడా భారీగా టికెట్ రేట్లు పెంచి అమ్ముతున్నారు.
కార్లకు భారీ డిమాండ్
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రయత్నించి విఫలమైన మరికొందరు లాంగ్ డ్రైవ్ లాంటి యాప్ సహాయాన్ని తీసుకుంటున్నారు. అందులో వారం రోజులకు కార్లను బుక్ చేసుకుంటున్నారు. మరికొందరు షేరింగ్ ఫెసిలిటీ ఉందమో అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా ఏదో రకంగా ఊరుకు చేరిపోవాలని పండగను ఆనందంగా జరుపుకోవాలని చూస్తున్నారు.





















