Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకి ప్రయాగ్ రాజ్ లో భారీ ఏర్పాట్లు.. తెలుగు రాష్ట్రాల నుంచి IRCTC స్పెషల్ ట్రైన్స్!
Maha Kumbh: జనవరి 13 నుంచి 45 రోజుల పాటు సాగనున్న మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్ సిద్ధమవుతోంది. భక్తుల అవసరాలు, భద్రత కోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రయాగ్‌రాజ్: జనవరి 13 భోగి రోజు నుంచి 45 రోజుల పాటు సాగనున్న మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్ సిద్ధమవుతోంది. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తుల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటూ వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.
12 ఏళ్ల క్రితం జరిగిన కుంభమేళాకు 20 కోట్లమంది భక్తులు హాజరయ్యారని...ఈ ఏడాది 30 నుంచి 50 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందనేది ప్రభుత్వాధికారుల అంచనా. ఈ మేరకు భక్తులకోసం ప్రైవేటు సంస్థలతో కలిసి 1.60 లక్షల టెంట్లు , 1.5 లక్షల మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ టెంట్లను ఆన్ లైన్లోనూ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది ఉత్తరప్రదేశ్ పర్యాటకశాఖ. సంక్రాంతి సమయం అంటే చలి విపరీతంగా ఉంటుంది..ఈ మేరకు భక్తులు తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు.
ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లే భక్తులు రాజస్నానం అనంతరం స్థానికంగా ఉండే హనుమాన్ ఆలయం, అలోప్ మందిరం, అలహాబాద్ కోట, ఆనంద్ భవన్, చంద్రశేఖర్ అజాద్ పార్కు సందర్శించుకోవచ్చు. ప్రయాగ్ రాజ్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో అయోద్య, 130 కిలోమీటర్ల దూరంలో వారణాసి ఉన్నాయి.
వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు 6,580 సాధారణ రైళ్లతో పాటూ 992 ప్రత్యేక రైళ్లు సిద్ధం చేస్తోంది రైల్వే శాఖ. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అయితే విశాఖ, విజయవాడ, తిరుపతి, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లున్నాయి.
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
తిరుపతి - వారణాసి
రైలు నెంబర్ 07107 తిరుపతి నుంచి వారణాసికి ప్రత్యేక రైలు . శనివారం రాత్రి 8:55కి తిరుపతిలో ప్రారంభమై సోమవారం మధ్యాహ్నం 3:45 గంటలకు వారణాసి రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. వారణాసిలో దిగి శివయ్యను దర్శించుకుని అక్కడి నుంచి ప్రయాగరాజ్ వెళ్లొచ్చు. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 07108 ..జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 4వ తేదీల్లో సాయంత్రం 5:30కు వారణాసిలో బయలుదేరి గూడురు, నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణస్తుంది.
విశాఖ, నర్సాపూర్ నుంచి
నర్సాపూర్-వారణాసి నడిచే రైలు నర్సాపూర్‌లో ఉదయం 6 గంటలకు ప్రారంభమై..మర్నాడు మధ్యాహ్నానానికి వారణాసి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 27, ఫిబ్రవరి 3వ తేదీల్లో కాశీలో సాయంత్రం ఐదున్నరకు బయలుదేరి మర్నాడు నర్సాపూర్ చేరుకుంటుంది.
విశాఖ-గోరఖ్‌పూర్
జనవరి 5, 19, ఫిబ్రవరి 16వ తేదీల్లో రైలు నెంబర్ 08562 విశాఖ-గోరఖ్‌పూర్ ఆదివారం రాత్రి 10:20 గంటలకు బయలుదేరి మంగళవారం రాత్రి 8:25 గంటలకు గోరఖ్‌పూర్... తిరిగి జనవరి 8, 22, ఫిబ్రవరి 19వ తేదీల్లో రైలు నెంబర్ 08561 గోరఖ్‌పూర్ స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం 2:20 కు బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది.
Also Read: రూ.5కే మహా కుంభమేళా చరిత్ర..ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు మొత్తం టెక్నాలజీ మయం!
విశాఖ-దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్పెషల్
జనవరి 9, 16, 23, ఫిబ్రవరి 6, 20, 26వ తేదీల్లో రైలు నెంబర్ 08530 విశాఖలో గురువారం సాయంత్రం 5:35 గంటలకు బయలుదేరి, శనివారం ఉదయం 4:30కు దీన్ దయాళ్ స్టేషన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో దీన్ దయాళ్ స్టేషన్ నుంచి రైలు నెంబర్ 08529 నుంచి శనివారం రాత్రి 8:10 గంటలకు బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 3:25 గంటలకు విశాఖకు వస్తుంది