నా వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టించారు, ఏ మతానికీ మేం వ్యతిరేకం కాదు - ఉదయనిధి స్టాలిన్
Sanatan Dharma Row: తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఉదయనిధి స్టాలిన్ తేల్చి చెప్పారు.
Sanatan Dharma Row:
ఉదయ నిధి లేఖ..
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలోనే కాదు. దేశవ్యాప్తంగానూ సంచలనం సృష్టించాయి. రాజకీయంగా నిప్పు రాజేసిన ఈ కామెంట్స్‌ని ఇప్పటికే సమర్థించుకున్నారు ఉదయనిధి. లీగల్‌గా ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇప్పుడు డీఎమ్‌కే నేతలందరినీ ఉద్దేశించి ఓ నోట్ విడుదల చేశారు. అనవసరంగా ఈ వివాదాన్ని పట్టించుకుని టైమ్ వేస్ట్ చేసుకోవద్దని సూచించారు. తనపై విమర్శలు చేసిన వాళ్లపై కేసులు పెట్టడం, వాళ్ల దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం లాంటివి చేయొద్దని వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీ, పళనిస్వామి సహా అయోధ్యకు చెందిన సాధువు మహంత్ పరమహన్స్‌పైనా విమర్శలు చేశారు. తన తలను తీసుకొచ్చిన వారికి నజరానా ఇస్తారనని మహంత్ పరమహన్స్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. పెరియార్, అన్నా, కలైజ్ఞర్, పెరసిరియార్ చూపిన బాటలోనే అందరూ నడుద్దాం అంటూ పిలుపునిచ్చారు. సామాజిక న్యాయంపై తనకు నమ్మకముందని తేల్చి చెప్పారు. మణిపూర్ లాంటి అతి పెద్ద సమస్యని వదిలేసి తన వ్యాఖ్యలతో రాజకీయం చేస్తోందని బీజేపీపై మండి పడ్డారు. కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టించారని, తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 9 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.
Let us resolve to work for the victory of the ideologies of Periyar, Anna, Kalaignar and Perasiriyar. Let Social Justice flourish forever. pic.twitter.com/Eyc9pBcdaL
— Udhay (@Udhaystalin) September 7, 2023
తండ్రి మద్దతు..
సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల విషయంలో తన కొడుకునే సమర్థించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్. ఉదయనిధి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, వాటిని తప్పుదోవ పట్టించారని తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రధాని సహా మంత్రులందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడిన సమయంలో "నరమేధం" అనే పదమే అనలేదని వివరించారు. ఇంగ్లీష్‌లో కానీ, తమిళ్లో కానీ ఆ పదాన్ని పలకలేదని అన్నారు. ఉదయనిధిపై కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.
"కొందరు బీజేపీ మద్దతుదారులు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని వేరే విధంగా అర్థం చేసుకున్నారు. కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నరమేధం సృష్టించాలని చూస్తున్నారంటూ విద్వేషాలు పెంచుతున్నారు. బీజేపీ చేతుల్లోని సోషల్ మీడియా ఈ ప్రచారం చేస్తోంది. కానీ...ఉదయనిధి తన స్పీచ్‌లో ఎక్కడా నరమేధం అనే పదమే వాడలేదు. అయినా...అదే పదేపదే ప్రచారం చేస్తున్నారు"
- ఎమ్కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి
Also Read: అప్పటి వరకూ రిజర్వేషన్లు ఉండాల్సిందే, అది వాళ్లకిచ్చే గౌరవం - RSS చీఫ్ మోహన్ భగవత్