International Safety Pin Day : అంతర్జాతీయ సేఫ్టీ పిన్ దినోత్సవం.. పిన్, సేఫ్టి పిన్, ఫైరింగ్ పిన్ మధ్య వ్యత్యాసాలు ఇవే
Safety Pin Day : సేఫ్టీ పిన్ ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన అంతర్జాతీయ సేఫ్టీ పిన్ దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు పిన్‌లలో రకాలు ఏంటో చూసేద్దాం.

International Safety Pin Day 2025 : ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న అంతర్జాతీయ సేఫ్టీ పిన్ దినోత్సవాన్ని జరుపుతున్నారు. మన దైనందిన జీవితంలో సేఫ్టీ పిన్‌ల ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఈ రోజును సెలబ్రేట్ చేస్తున్నారు. 1849లో వాల్టర్ హంట్ సేఫ్టీ పిన్‌ను కనుగొన్నందుకు గౌరవసూచకంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న అంతర్జాతీయ సేఫ్టీ పిన్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు సేఫ్టీ పిన్‌ల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటారు.
సేఫ్టీ పిన్ డే చరిత్ర..
అమెరికాకు చెందిన వాల్టర్ హంట్ మెకానిక్‌గా చేస్తున్నాడు. అతను సేఫ్టీ పిన్ని కనుగొన్నాడు. ఏప్రిల్ 10, 1849లో దానికి పేటెంట్ పొందాడు. దానిని అప్పట్లోనే $400కి విక్రయించాడు. అంతకుముందు గ్రీస్, రోమ్లలో ఇలాంటి వస్తువును ఎముక, దంతాలు, లోహంతో తయారు చేసిన వాటితో తయారు చేసేవారు.
సేఫ్టీ పిన్‌ల ప్రాముఖ్యత
దుస్తులకు, దుస్తులను టైట్ చేయడానికి సేఫ్టీ పిన్‌లను ఉపయోగిస్తారు. ఈ పిన్‌లను చెవిపోగులు, గొలుసులు, రిస్ట్‌బ్యాండ్‌లుగా కూడా వాడతారు. కేవలం వివిధ అవసరాలకే కాదు.. LGBTQ+ కమ్యూనిటీలో వేధింపులకు వ్యతిరేకంగా సంఘీభావం, మద్దతుకోసం కూడా సేఫ్టీ పిన్‌లను చిహ్నంగా ఉపయోగిస్తున్నారు. 1970లలో సేఫ్టీ పిన్‌లు పంక్ రాక్ ఉద్యమంలో ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారాయి. అప్పటి నుంచి వీటిని అలంకరణలు లేదా పియర్సింగ్‌లుగా ఉపయోగించారు.
పిన్, సేఫ్టీ పిన్, ఫైరింగ్ పిన్ మధ్య వ్యత్యాసం
పిన్ అనేది వస్తువులను బిగించడానికి లేదా కలిపి ఉంచడానికి ఉపయోగించే చిన్న, సన్నని లోహపు ముక్క. సేఫ్టీ పిన్ అనేది పిన్‌ను కవర్ చేస్తూ.. గాయాలను నివారించడానికి ఓ రక్షణతో వస్తుంది. దీనిని సాధారణంగా కుట్టుపని, క్రాఫ్టింగ్ లేదా తాత్కాలిక పరిష్కారంగా ఉపయోగిస్తారు. ఫైరింగ్ పిన్ అనేది తుపాకీలో ఒక భాగం. ఇది కార్ట్రిడ్జ్‌ను మండించడానికి ప్రైమర్‌ను తాకి ఉంటుంది. ఇది తుపాకీ యంత్రాంగంలో కీలకమైన భాగం.
సేఫ్టీ పిన్‌లు వేర్వేరు పరిమాణాలు, పదార్థాలు, ఆకారాలలో అందుబాటులో ఉంటాయి. ఫ్యాషన్, క్రాఫ్టింగ్, హెల్త్‌కేర్‌తో సహా వివిధ పరిశ్రమలలో సేఫ్టీ పిన్‌లను ఉపయోగిస్తారు. దైనందిన జీవితంలో పిన్‌ల ప్రాముఖ్యతను అందర గుర్తించాల్సిన అవసరముంది.






















