Chicken Pickle Recipe : చికెన్ నిల్వ పచ్చడిని ఇలా చేసేయండి.. టేస్టీ రెసిపీ ఇదే, పికిల్ కోసం కెరీర్‌పైనే ఫోకస్ చేయాలా ఏంటి?
Chicken Recipe : చికెన్ నిల్వ పచ్చడిని ఈజీగా ఇంట్లో చేసుకోగలిగే రెసిపీ ఇక్కడుంది. తక్కువ ఖర్చుతో టేస్టీగా ఇంట్లోనే దీనిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Chicken Pachadi Recipe : అలేఖ్య చిట్టి పికిల్స్ కాస్ట్ గురించి ఆలోచించే బదులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో టేస్టీగా చికెన్ నిల్వ పచ్చడిని పట్టుకోవచ్చు తెలుసా? పైగా ఈ రెసిపీ ఫాలో అయితే రుచి కూడా అద్భుతంగా వస్తుంది. మరి చికెన్ నిల్వ పచ్చడిని ఎలా పట్టాలి.. ముక్క పైన గట్టిగా లోపల మెత్తగా ఉండేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి.. కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బ్రెస్ట్ చికెన్ - 1 కేజీ
పల్లీ నూనె - 300 గ్రాములు
కారం - అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండున్నర టేబుల్ స్పూన్లు
ఆవాలు - రెండున్నర టేబుల్ స్పూన్లు
జీలకర్ర - టేబుల్ స్పూన్
మిరియాలు - టేబుల్ స్పూన్
మెంతులు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
వెల్లుల్లి రెబ్బలు - 25
లవంగాలు - 15
యాలకులు - 10
దాల్చిన చెక్క - 6 ఇంచులు
కరివేపాకు - గుప్పెడు
తయారీ విధానం
ముందుగా చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బోన్స్ లేకుంటే మరీ మంచిది. వీటిని బాగా కడాగాలి. అనంతరం అరగంట సేపు ఉప్పు నీళ్లలో నానబెట్టాలి. మిగిలిన మసాలా దినుసులు అన్ని సిద్ధం చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్‌గా చేసుకునేది అయితే రుచి మరింత బాగుంటుంది. చికెన్‌ను మరుగుతున్న నీటిలో వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
ముక్క చిన్నగా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడుకుతుంది. అనంతరం వాటిని తీసి తడి ఆరేవిధంగా జల్లెడలో లేదా క్లాత్‌లో వేసి ఆరబెట్టాలి.
ఇప్పుడు ఓ మిక్సీ జార్లో ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకుని స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టాలి. దానిలో పల్లీ నూనె వేసుకోవాలి. పచ్చళ్లకు పల్లీ నూనె మంచి రుచిని ఇస్తుంది. ఇప్పుడు దానిలో తడి ఆరిన చికెన్ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. మీడియం మంట మీద చికెన్ ముక్కలను నూనెలో దోరగా వేగనివ్వాలి.
చికెన్ ముక్కలు కాస్త రంగు మారితే సరిపోతుంది. దానిలో ఇప్పుడు దాల్చిన చెక్కలు, యాలకులు, లవంగాలు వేసుకోవాలి. వాటితో కలిపి చికెన్‌ను మరో మూడు, నాలుగు నిమిషాలు వేయించుకోవాలి. అనంతరం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి. చికెన్‌తో పాటు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కరివేపాకు వేయాలి.
చికెన్‌ను మరీ కరకరలాడేట్టు కాకుండా మంచి రంగు వచ్చేవరకు వేయించుకుంటే పచ్చడి రుచి బాగుంటుంది. పైగా ఇలా చేయడం వల్ల ముక్క పైన గట్టిగానే ఉన్నా.. లోపల మెత్తగా తినడానికి మరింత రుచిగా ఉంటుంది. ఇలా వేయించుకున్న చికెన్‌లో ముందుగా పొడిచేసి పెట్టుకున్న ఆవాల పొడి వేయాలి. ఒకసారి బాగా కలిపితే ఈ పొడి కూడా వేగిపోతుంది. ఇప్పుడు స్టౌవ్ ఆపేయాలి.
స్టౌవ్ ఆపేసిన తర్వాత కారం, గరం మసాలా, ఉప్పు వేసి మొత్తం కలిపేయాలి. మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టాలి. మిశ్రమం చల్లారిన తర్వాత చివర్లో నిమ్మరసం గింజలు లేకుండా ఉన్నది తీసుకుని పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేప్పుడు సాల్ట్, కారం ఏదైనా తక్కువైతే మీ రుచికి తగ్గట్లు వేసి కలుపుకోవచ్చు. అంతే టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి తినేందుకు రెడీ.






















