Tariff War: చైనాపై 145 శాతం, అమెరికాపై 125 శాతం - సునామీలా మారిన సుంకాల యుద్ధం
China America Trade War: అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై సుంకాలను ఏకంగా 125%కు పెంచింది, వైట్‌హౌస్‌పై ప్రతీకారం తీర్చుకుంది.

America - China Reciprocal Tariff War: అమెరికా - చైనా మధ్య ప్రతీకార సుంకాల యుద్ధం నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. రెండు అగ్రరాజ్యాల మధ్య ఎగసిపడుతున్న వాణిజ్య ప్రతీకార జ్వాలలు ఏ విపరిణామాలకు దారి తీస్తాయోనని మిగతా ప్రపంచం భయపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump), గురువారం (10 ఏప్రిల్ 2025) నాడు డ్రాగన్ నెత్తిన కొత్త బాంబ్ వేశారు. చైనా నుంచి అమెరికాలోకి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 145 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా చర్యతో ఆగ్రహించిన డ్రాగన్ శుక్రవారం నాడు అతి పెద్ద ఎదురుదాడి చేసింది. అమెరికా నుంచి చైనాలోకి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని ఇప్పుడున్న 84 శాతం నుంచి 125 శాతానికి పెంచి ప్రతీకారం తీర్చుకుంది. చైనా నిర్ణయంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ప్రమాదకరంగా మారింది.
"చైనాపై అమెరికా ఇంత అసాధారణంగా అధిక సుంకాలను విధించడం అంతర్జాతీయ & ఆర్థిక వాణిజ్య నియమాలు, ప్రాథమిక ఆర్థిక చట్టాలను ఉల్లంఘించడమే. ఇది ఏకపక్ష బెదిరింపు & బలవంతం" అని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. చైనా నుంచి పంపే వస్తువులు లేదా ఉత్పత్తులపై అమెరికా అదనపు సుంకాలను విధిస్తూనే ఉంటే, చైనా దానిని విస్మరిస్తుందని స్పష్టం చేసింది.
భయంకరమైన దుష్పరిణామాలు ప్రభావం
పరస్పర సుంకాలు & ప్రతీకార చర్యల ప్రభావం వినాశకరమైనదని ఐక్యరాజ్యసమితి వాణిజ్య సంస్థ డైరెక్టర్ శుక్రవారం రాయిటర్స్‌తో అన్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే విదేశీ సహాయం కంటే దారుణమైన విషయంగా అభివర్ణించారు. దీనివల్ల ప్రపంచ వాణిజ్యం 3 శాతం నుంచి 7 శాతం, ప్రపంచ జీడీపీ 0.7 శాతం తగ్గవచ్చని ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ అంచనా వేసింది. ఈ ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. అధిక సుంకాలకు సంబంధించి, చైనా కొన్ని రోజుల క్రితం అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసింది.
ప్రపంచ మార్కెట్లో సుంకాల యుద్ధం ప్రభావం
చైనా - అమెరికా మధ్య రగులుతున్న వాణిజ్య యుద్ధం జ్వాలల ధాటికి ప్రపంచ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ఝడుస్తున్నారు. మాటకు-మాట, దెబ్బకు-దెబ్బ అన్నట్లు.. ట్రంప్ ప్రతి చర్యకు జిన్‌పింగ్ ప్రతి చర్య చేపట్టడం ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
వాణిజ్య యుద్ధం కారణంగా, కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల నుంచి 10 ట్రిలియన్ డాలర్లకు పైగా తుడిచి పెట్టుకుపోయాయి. సెల్ఫ్ గోల్ తరహాలో, అమెరికన్ స్టాక్ మార్కెట్ అత్యధిక నష్టాలను చవి చూసింది. 'మాగ్నిఫిసెంట్ సెవెన్'గా పేరు గడించిన ఆపిల్, గూగుల్, ఎన్విడియా, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ & టెస్లా షేర్లు గత గురువారం నుంచి ఇప్పటి వరకు 1.6 ట్రిలియన్ డాలర్ల విలువను కోల్పోయాయి.





















