Union Budget 2025 : రైతులకు గుడ్ న్యూస్ - ఈ సారి బడ్జెట్ లో పెరగనున్న కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ - పెరగనున్న గ్రామీణ డిమాండ్..!
Union Budget 2025 : రాబోయే బడ్జెట్ లో కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద రుణ పరిమితిని త్వరలో పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రైతులు ఈ కార్డు ద్వారా రూ.3 లక్షల వరకు రుణం పొందుతున్నారు.

Union Budget 2025 : పార్లమెంట్ లో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు ఈ సారి వారి ఆదాయాన్ని పెంచడంతో పాటు అనేక కీలకాంశాలను చేర్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితికి సంబంధించి ఓ శుభవార్త కూడా రానున్నట్టు సమాచారం. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా అందించే రుణ పరిమితిని రూ.5లక్షలకు పెంచే అవకాశాలనున్నట్టు పలు వర్గాల సమాచారం.
కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపుపై ఆలోచనలు
రైతులకు ఆపన్న హస్తంగా నిలిచే కిసాన్ క్రెడిట్ కార్డ్ - కేసీసీ ((KCC) పరిమితిని కేంద్రం పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కార్డు ద్వారా రైతులకు రుణాన్ని పలు దఫాలుగా ఇస్తారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.3 లక్షలుగా ఉంది. అయితే రాబోయే బడ్జెట్ లో ఈ లిమిట్ ను మరో 2 లక్షలు పెంచి మొత్తం రూ.5 లక్షలుగా నిర్ణయించే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇది రైతులకు చాలా ఉపయోగపడనుంది. మరీ ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఎంతో సహాయపడుతుంది. దీని ద్వారా గ్రామాల ఆర్థిక వ్యవస్థలోనూ అభివృద్ధి పెరుగుతుంది.
ఎలాంటి గ్యారెంటీ లేకుండా ఈ కార్డు ద్వారా రైతులకు ఇచ్చే నగదు రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని గత కొంత కాలంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణ డిమాండ్ పెంచేందుకు రైతులకు మద్దతుగా ఆర్థిక భరోసా ఇచ్చే ఈ పథకం పరిమితిని పెంచాలని వ్యవసాయ రంగ నిపుణులు సైతం చెబుతున్నాయి. ఈ సూచనలు, డిమాండ్లను పరిగణలోకి తీసుకుని 2025-26కు సంబంధించిన వార్షిక బడ్జెట్ లో కేసీసీ లిమిట్ ను రూ.5 లక్షలకు పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇకపోతే వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రభుత్వం గతేడాది కంటే ఈ సారి 15 శాతం అధికంగా రూ.1.75 లక్షల కోట్లు కేటాయించవచ్చని అంచనా వేస్తున్నారు.
కిసాన్ క్రిడెట్ కార్డ్ స్కీమ్
కిసాన్ క్రిడెట్ కార్డ్ స్కీమ్ ను కేంద్రం 1998లో ప్రారంభించింది. పంట పండించేందుకు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు అవసరమైన నిధులను తక్కువ వడ్డీకే అందించాలనే ఉద్దేశంతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కార్డుల ద్వారా తీసుకునే రుణాలకు బ్యాంకులు 9శాతం వడ్డీని వసూలు చేస్తుండగా, అందులో ప్రభుత్వం 2శాతం వడ్డీని సబ్సిడీగా ఇస్తోంది. దీంతో పాటు ఏ రైతులైతే సమయానికి రుణం చెల్లిస్తారో వారికి వడ్డీలో 3శాతం డిస్కౌంట్ గా కూడా లభిస్తుంది. అంటే మొత్తంగా రైతులు కేవలం 4శాతం వడ్డీకే ఈ లోన్ ను పొందవచ్చు. ఇదిలా ఉంటే అక్టోబర్ 2024 నాటికి కోఆపరేటివ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 167.53 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేయగా.. వాటి మొత్తం క్రెడిట్ లిమిట్ రూ.1.73 లక్షల కోట్లు. అందులో డెయిరీ రైతులకు రూ.10,453 కోట్లు, చేపల పెంపకందారులకు రూ.341.70 కోట్లు రుణాలు ఇచ్చారు.
Also Read : Budget 2025: ఫిబ్రవరి 01లోపు ఈ పదాలు తెలుసుకోండి, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం సులభంగా అర్ధమవుతుంది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

