Farmers Protest: ముల్తానీ మట్టి, పతంగులు, జనపనార సంచులు- ఢిల్లీ పోలీసులకు రైతుల కౌంటర్ మాములుగా లేదు
Farmers March: రైతుల ఆందోళనలతో హరియాణా, ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రైతులను హర్యానా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
Farmers Protest In Punjab-Haryana Boarder: రైతుల ఆందోళనల (Farmers Protest)తో హరియాణా, పంజాబ్ సరిహద్దుల్లో (Punjab-Haryana)ఉద్రిక్తత కొనసాగుతోంది. రైతులను హర్యానా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దేశ రాజధానిలో రైతులు అడుగు పెట్టకుండా కట్టడి చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వెళ్లేందుకు వేలాది మంది రైతులు వస్తుండడంతో డ్రోన్స్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించి వాళ్లను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే.. వారికి రైతులు తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. పోలీసుల డ్రోన్‌లను అడ్డుకునేందుకు పతంగులు ఎగరేస్తున్నారు. శంభు సరిహద్దు ప్రాంతం వద్ద రైతులు పెద్ద ఎత్తున పతంగులు ఎగరేస్తూ డ్రోన్స్‌ని అడ్డుకున్నారు. అలాగే టియర్ గ్యాస్‌ను ఎదుర్కోవడానికి వివిధ మార్గాలను కనుగొన్నారు. టియర్ గ్యాస్‌తో కలిగే మంటను తగ్గించడానికి రైతులు తమ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన 'ముల్తానీ మిట్టి'ని ముఖాలకు పూసుకున్నారు.
అలాగే టియర్ గ్యాస్ షెల్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు సరికొత్తగా ఆలోచించారు. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ విసిరినప్పుడు తడి జనపనార సంచులను వాటిపై వేసి నిర్వీర్యం చేస్తున్నారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల వద్ద మంగళవారం, బుధవారం పోలీసు సిబ్బందితో రైతులు ఘర్షణ పడ్డారు. రైతులు నిరసనను కొనసాగిస్తూ ఢిల్లీ వైపు వెళ్లేందుకు శతవిధాల ప్రయత్నించారు. బారికేడ్లను దాటడానికి ప్రయత్నించారు.
అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎక్కడిక్కడ డ్రోన్‌ల సాయంతో టియర్ గ్యాస్, వాటర్ కానాన్స్‌ను ప్రయోగించారు. రైతులు వాటన్నింటిని భరించి నిరసనను కొనసాగించారు. మరోవైపు, శంభు సరిహద్దులో హరియాణా పోలీసులు డ్రోన్‌ల వినియోగంపై పంజాబ్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పంజాబ్ భూభాగంలో ఉన్నప్పుడు డ్రోన్‌లు తమపై అనేక టియర్ గ్యాస్ క్యానిస్టర్‌లను ప్రయోగించాయని రైతులు ఆరోపించారు.
పంజాబ్ నుంచే భారీ మొత్తంలో రైతులు ఈ మార్చ్‌లో పాల్గొంటున్నారు. తమ పంటలకు కనీస మద్దతు ధరని చట్టబద్ధం చేయడంతో పాటు మరి కొన్ని సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. అంబాలాకి సమీపంలోని శంభు సరిహద్దు వద్ద రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాళ్లను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించారు.
ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి అర్జున్ ముండా రైతులు ఆందోళనలు విరమించారని సూచించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఇలా నిరసనల్లో పాల్గొనద్దని విజ్ఞప్తి చేశారు. అటు కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరుగుతుండగానే ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం తీరుపై రైతు సంఘాల నాయకులు మండి పడుతున్నారు. సానుకూల వాతావరణంలో సమస్యలు పరిష్కరించాలని, చర్చలకు ఎప్పటికైనా తాము సిద్ధమే అని వెల్లడించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడాన్ని చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని అడిగారు. ఆ సమయంలో రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులు కనీసం 6 నెలల పాటు ఆందోళనలు చేయాలన్న ప్లాన్‌తో వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆరు నెలలకు సరిపడా సరుకులు సిద్ధం చేసుకున్నారు. ట్రాక్టర్‌లకు అవసరమైన డీజిల్ కూడా తెచ్చుకున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సింగూ సరిహద్దు ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా ప్రభుత్వం అన్ని ఆసుపత్రులనూ అప్రమత్తం చేసింది.