Andhra News: IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ - ఏపీ హైకోర్టు కీలక తీర్పు
IRR Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది.
AP High Court Reserves Verdict on IRR Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (Amaravathi Inner Ring Road case) కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు (AP Highcourt) రిజర్వ్ చేసింది. ఇటీవలే ఈ పిటిషన్ పై విచారణ ముగియగా, శుక్రవారం సీఐడీ, చంద్రబాబు తరఫు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. సీఐడీ దాఖలు చేసిన లిఖిత పూర్వక వాదనల్లో టీడీపీ నేత లోకేశ్ పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఖండించారు. వీటిని లిఖిత పూర్వకంగా హైకోర్టుకు అందించారు. వీటిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం తాజాగా తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలిచ్చింది.
సెప్టెంబర్ లో పిటిషన్
అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర రోడ్ల అలైన్ మెంట్ మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1గా చేర్చారు. దీంతో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది సెప్టెంబరులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
లోకేశ్ అరెస్టుకు అనుమతించాలని సీఐడీ పిటిషన్
కాగా, ఇదే కేసులో నారా లోకేశ్ కు సీఐడీ 41ఏ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన యువగళం సభలో లోకేశ్ నిబంధనలు ఉల్లంఘించారని సీఐడీ, ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆయన అరెస్టుకు అనుమతించాలని పిటిషన్ వేసింది. చంద్రబాబు కేసులకు సంబంధించి రెడ్ బుక్ పేరుతో దర్యాప్తు అధికారులను లోకేశ్ బెదిరించారని, ఆ ప్రకటనలను సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఇప్పటికే లోకేశ్ పేరును చేర్చగా, గతంలో విచారణ కూడా చేసింది. తాజాగా, హైకోర్టులో సైతం లోకేశ్ వ్యాఖ్యలకు సంబంధించి లిఖిత పూర్వకంగా వివరాలు అందించింది. దీనిపై టీడీపీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. లోకేశ్ వ్యాఖ్యలకు, చంద్రబాబు కేసులకు ఎక్కడా సంబంధం లేదన్నారు. లోకేశ్ మీడియాతో మాట్లాడిన సమయంలోనూ ఐఆర్ఆర్, హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. సీఐడీ మెమో తిరస్కరించాలని కోరారు.