Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
మైనర్ల ప్రైవేట్ భాగాలను తాకడం అత్యాచారం కిందకి రాదని అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. అభ్యంతరాలు రావడంతో సుప్రీంకోర్టు సమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

Grabbing Minors Breasts Not Rape: Allahabad High court | న్యూఢిల్లీ: దుస్తులు పట్టుకుని లాగడం, మైనర్ల వక్షోజాలను అసభ్యకరంగా తాకడం అత్యాచార ప్రయత్నం కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి కావడంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటా తీసుకుని విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
అలహాబాద్ హైకోర్టు జడ్జి సంచలన తీర్పు
మైనర్ బాలిక వక్షోజాలను తాకడం, ఆమె పైజామాని పట్టుకుని లాగడం అత్యాచారం కిందకి రాదని అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా మార్చి 17న ఇచ్చిన తీర్పు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. సాధారణంగా న్యాయస్థానాల తీర్పులను స్వాగతించాల్సి ఉంటుంది. కానీ సున్నితమైన అంశంపై అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలపై లాయర్లు, జడ్జిల నుంచి సైతం అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది.
ఆ కోర్టు తీర్పు బాధాకరం..
అలహాబాద్ హైకోర్టు సున్నితమైన అంశంపై అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. తీర్పు ఇచ్చే సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలి. తీర్పు రిజర్వ్ చేసిన నాలుగు నెలల తరువాత జడ్జి తీర్పు వెలువరించినా.. సున్నితత్వం లేకుండా వ్యవహరించడం బాధాకరం అన్నారు. ఏదైనా కేసులో ఇలాంటి సమయంలో తీర్పులపై స్టే ఇవ్వడానికి సంకోచిస్తాం. కానీ పేరాగ్రాఫ్‌లు 21, 24, 26 లోని అంశాలు పరిశీలించిన తరువాత యూపీ కోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నాం. అమానవీయమైన నిర్ణయం వెలువడినందున ఈ నిర్ణయం తీసుకున్నామని ధర్మాసనం పేర్కొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

