Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న 'మొంథా' తుఫాన్ తీరం దాటింది. మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 గంటల మధ్య మచిలీపట్నం-కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో తీరాన్ని దాటినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.
ఈ తుపాను క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొంథా తుపాను ప్రభావం కారణంగా ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. తుపాను ప్రభావం రాయలసీమ జిల్లాలపై కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. మరో 24 గంటలపాటు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిషా రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
‘మొంథా’ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కొత్తవలస-కిరండోల్ సింగిల్ రైల్వే ధ్వంసమైంది. అరకు రైల్వే టన్నెల్ నెంబర్ 32, చిమిడిపల్లి, బొర్రా గుహల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. ట్రాక్‌పై మట్టి, బండరాళ్లు భారీగా చేరాయి. దీంతో ఆ ట్రాక్‌పై రాకపోకలు ప్రస్తుతానికి నిలిపివేశారు అధికారులు.





















