New districts in AP: ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
Andhra Pradesh: ఏపీలో కొత్త జిల్లాలపై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశం అయింది. ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు తుది ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

New districts in AP: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశం అయింది. ఇంతకు ముందు తమకు వచ్చిన ప్రతిపాదనలు, విజ్ఞప్తులతో ఓ నివేదికను రూపొందించి ముఖ్యమంత్రి ఎ చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. ఆ సమీక్ష సమావేశం తర్వాత, కేబినెట్ సబ్‌కమిటీ సభ్యులు ఇప్పుడు అధికారులతో చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల ఆధారంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ ప్రజల కోరికలు, పరిపాలనా సౌలభ్యం కోసం రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా విభజన ప్రక్రియ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. 13 జిల్లాలను 26కి పెంచినప్పటికీ ప్రాంతీయ అసమానతలు, పరిపాలనా సమస్యలు తలెత్తాయి. ప్రజల అభిప్రాయాలను పక్కనపెట్టి, రాజకీయ లాభాల కోసం జరిగిన ఈ మార్పులు రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారాయని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భావిస్తోంది. 2024 ఎన్నికల్లో జిల్లాల పునర్ వ్యవస్థీకరిస్తామని హామీ ఇచ్చింది. భవిష్యత్ లో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని, పోలవరం ముంపు గ్రామాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని నిర్ణయించారు.
అక్టోబర్ 28న అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సబ్‌కమిటీని జులై 22, 2025న ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో సంప్రదింపులు జరిపి ప్రాథమిక నివేదిక రూపొందించారు. ఈ నివేదికపై ముఖ్యమంత్రి వివరణాత్మకంగా చర్చించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు పి. నారాయణ , వంగలపూడి అనిత , నాదెండ్ల మనోహర్ , అనగాని సత్యప్రసాద్ , నిమ్మల రామానాయుడు , సత్యకుమార్ యాదవ్ , బీ.సీ. జనార్ధన్ రెడ్డిఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు.
మునుపటి ప్రభుత్వం చేసిన జిల్లా విభజనలో ఏర్పడిన లోపాలను సరిచేయాలి. ప్రజల కోరికలు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా జిల్లాలు రూపొందించాలన్న అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు వంటి దీర్ఘకాలిక డిమాండ్‌లను పరిగణించాలి. భవిష్యత్ డెలిమిటేషన్‌కు అనుగుణంగా రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. సబ్‌కమిటీ ఆరు కొత్త జిల్లాలు అమరావతి, మార్కాపురం, రంపచోడవరం, గూడూరు మొదలైనవి సృష్టించాలని ప్రాథమికంగా సిఫార్సు చేసింది. అయితే రెండు జిల్లాలను పెంచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
సబ్‌కమిటీ ఒక వారంలో మళ్లీ సమావేశమై, ప్రతిపాదనలను చర్చించనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేబినెట్ అనుమతి తీసుకుని, శాసనసభలో చట్టంగా ఆమోదించనున్నారు. ప్రజల అభిప్రాయాలు, పరిపాలనా సౌలభ్యం ద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పునర్వ్యవస్థీకరణ ప్రజలకు సంబంధించిన కీలక అంశం కావడంతో, ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తూ, మరిన్ని అభిప్రాయాలు సేకరించాలని భావిస్తోంది.




















