Powerful Mantras: నిత్యం తప్పనిసరిగా చదవాల్సిన 6 శ్లోకాలు.. వేసవి సెలవుల్లో మీ పిల్లలకి నేర్పించండి!
Daily Must chant Slokas: సమ్మర్ హాలిడేస్ ప్రారంభమయ్యాయి. పిల్లలంతా రోజంతా ఇంట్లోనే. మరి ఈ సమయంలో పుస్తకాలు ఎలాగూ తీయరు. బుద్ధిగా రోజు ప్రారంభం కావాలంటే ఈ శ్లోకాలు నేర్పించండి

నిద్రలేచినప్పటి నుంచి నిద్రపోయేవరకూ టీవీ, ఫోన్లకు అతుక్కుపోయే పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్లకు టీవీ, ఫోన్ కాలక్షేపంగా మారిపోయింది. అందుకే ఈ వేసవి సెలవుల్లో చిన్నారులు ప్రశాంతంగా రోజు ప్రారంభించి హాయిగా నిద్రపోయేందుకు ఈ 6 శ్లోకాలు నేర్పించండి. వాటికి అర్థం కూడా వివరిస్తే శ్రద్ధగా నేర్చుకునే అవకాశం ఉంటుంది.
నిద్రలేచిన వెంటనే
కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||
నిద్రలేచిన వెంటనే అరచేతులు చూసుకుని చదువుకోవాల్సిన శ్లోకం ఇది. మూడు శక్తులను తలుచుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని అర్థం. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే.. మానవ శరీరం ఓ విద్యుత్ కేంద్రం. శరీరంలో ప్రతి అవయంలోనూ విద్యుత్ ప్రవహిస్తుంది. నిద్రపోయేటప్పుడు ఆ విద్యుత్ మొత్తం శరీరంలోనే కేంద్రీకృతం అయి ఉంటుంది. కళ్లు తెరిచిన వెంటనే అరచేతులు చూసుకోవడం వల్ల ఆ విద్యుత్ శక్తి తిరిగి శరీరంలో చేరి కొత్త శక్తి జనరేట్ అవుతుందని చెబుతారు. పూర్వకాలం రుషులు ఏళ్ల తరబడి తపస్సు ఆచరించేవారు.. ఎవరైనా తపోభంగం చేస్తే ఒక్కసారిగా కళ్లు తెరవగానే ఎదురుగా ఉన్న వ్యక్తి భస్మం అయిపోయేవారని పురాణ కథల్లో చదువుకున్నాం కదా.. అదంతా విద్యుత్ తరంగాల ప్రభావమే అంటారు.
మంచంపై నుంచి కిందకు దిగుతూ..
సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే
విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||
జీవితంలో అందరికన్నా రుణపడి ఉండాల్సింది అమ్మకు..ఆ తర్వాత భూమాతకు. భూమాతను అనుక్షణం అకౌగరవ పరుస్తూనే ఉంటాం కానీ ఆ తల్లి ఎంత సహనంగా మనల్ని భరిస్తోంది. అంత సహనవంతురాలైన భూమాత అమ్మలా మనకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటూ కృతజ్ఞతగా ఈ శ్లోకం చెప్పిన తర్వాత నేలపై అడుగుపెడతారు.
స్నానానికి వెళ్లినప్పుడు
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు||
శాస్త్ర ప్రకారం ప్రవహిస్తున్న నీటిలో స్నానం ఆచరించాలి. కానీ నిత్యం నదీస్నానం చేసే అవకాశం ఉండదు కదా..అందుకే ఆయా నదులను మనం స్నానం ఆచరించే నీటిలోకి ఆవాహనం చేసుకునేందుకు ఈ శ్లోకం పఠిస్తారు. ఈ శ్లోకం పఠిస్తూ స్నానమాచరిస్తే ఆయా నదుల్లో స్నానం చేసినట్టే అని భావిస్తారు.
స్నానం అనంతరం తల్లిదండ్రులకు నమస్కరించండి. మీ కళ్లముందు ఉంటే కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి..లేదంటే ఫొటోలకు నమస్కరించండి
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ ||
తినేటప్పుడు చదవాల్సిన శ్లోకం
భోజనం ముందు కూర్చోగానే తినేయకూడదు..భోజనమే ఆలోచనగా మారుతుంది. తినే అన్నానికి ఉండే దోషాలు తొలగిపోయి ఆ ప్రభావం మనసుపై పడకుండా ఉండాలంటే ఈ శ్లోకాలు చదువుతారు.
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన:||
అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత:
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ ||
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ||
నిద్రపోయే ముందు చదవాల్సిన శ్లోకం
కర చరణ కృతం వాక్ కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహిత మవిహితం వా సర్వమే తత్ క్షమస్వా
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో ||
ఉదయం నిద్రలేచినప్పటి నుంచి ఈ క్షణం వరకూ నేను తెలిసో తెలియక చేసిన తప్పులను క్షమించు అని భగవంతుడిని వేడుకోవడమే ఈ శ్లోకం అర్థం
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!
పిల్లలు భయపడే కలలు రాకుండా ప్రశాంతమైన నిద్రకోసం ఈ శ్లోకం నేర్పించండి..






















