India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
India Trade Deal With New Zealand : న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని "స్వేచ్ఛాయుతం కాదు, న్యాయమైనది కాదు" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఖరారైన భారత్ -న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) పై న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఒప్పందం దేశ ఆర్థిక ప్రాధాన్యతలను దెబ్బతీసే లోపభూయిష్టమైన విధానంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం నిజంగా "స్వేచ్ఛాయుతమైనది కాదు, న్యాయమైనది కాదు" అని పీటర్స్ అన్నారు. న్యూజిలాండ్‌కు ఈ ఒప్పందం ఒక చెడ్డ బేరం అని, తాము చాలా ఎక్కువ ఇచ్చి తక్కువ తీసుకుంటున్నామని పీటర్స్ ఆరోపించారు.
తన పార్టీ న్యూజిలాండ్ ఫస్ట్ భారత్‌తో జరిగిన ట్రేడ్ ఒప్పందానికి వ్యతిరేకంగా ఉందని విన్‌స్టన్ పీటర్స్ స్పష్టం చేశారు. FTA వలసలు, పెట్టుబడులపై గణనీయమైన రాజీలను కలిగి ఉందన్నారు. అయితే న్యూజిలాండ్ అత్యంత కీలకమైన ఎగుమతి పరిశ్రమలకు అర్థవంతమైన ప్రయోజనాలను పొందడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. ఇండియా టుడే నివేదిక ఈ విషయాలను ప్రస్తావించింది.
పాల ఉత్పత్తులు మినహాయింపుతో రైతుల ఆగ్రహం
FTA నుంచి న్యూజిలాండ్ శక్తివంతమైన పాల ఉత్పత్తుల రంగాన్ని మినహాయించడమే పీటర్స్ విమర్శలకు ప్రధాన కారణం. న్యూజిలాండ్ భారత వస్తువులకు తన మార్కెట్లను విస్తృతంగా తెరిచినప్పటికీ, భారతదేశం పాలు, జున్ను, వెన్న వంటి కీలకమైన పాల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించలేదని ఎత్తి చూపారు.
పాల ఉత్పత్తులు న్యూజిలాండ్ ఎగుమతి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి. నవంబర్ 2025 నాటికి $24 బిలియన్ల విలువైనది. దేశం మొత్తం వస్తువుల ఎగుమతులలో దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ఒప్పందం న్యూజిలాండ్ సంతకం చేసిన మొదటి వాణిజ్య ఒప్పందం అని పీటర్స్ పేర్కొన్నారు. ఇది పాల ఉత్పత్తులను పూర్తిగా దాని పరిధి నుండి మినహాయించిందని, రైతులు ఈ నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.
మిత్రపక్షాల్లో బయటపడిన విభేదాలు
న్యూజిలాండ్ సంకీర్ణ ప్రభుత్వంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను కూడా మంత్రి పీటర్స్ వెల్లడించారు. ఆయన ప్రకారం, న్యూజిలాండ్ ఫస్ట్ తన సంకీర్ణ భాగస్వామిని నెమ్మదిగా వెళ్లాలని, మరింత సమతుల్యమైన, బలమైన ఒప్పందం కోసం పూర్తి మూడేళ్ల పార్లమెంటరీ పదవీకాలాన్ని ఉపయోగించుకోవాలని కోరింది.
"దురదృష్టవశాత్తు, మా హెచ్చరికలను కొందరు ప్రభుత్వ పెద్దలు విస్మరించారు. నేషనల్ పార్టీ న్యాయమైన ఒప్పందం కోసం చేయాల్సిన పనికి బదులుగా, త్వరితగతిన నిర్ణయాలతో తక్కువ-నాణ్యత ఒప్పందానికి మొగ్గుచూపింది" అని ప్రస్తావించారు. తీవ్ర అభ్యంతరాలు ఉన్నప్పటికీ, తన విమర్శలు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంపై కాదని పీటర్స్ నొక్కి చెప్పారు. భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌పై తనకు గౌరవం ఉందన్నారు. న్యూజిలాండ్ ఫస్ట్ న్యూఢిల్లీతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందన్నారు.
ఒప్పందాన్ని చారిత్రాత్మక పురోగతిగా పేర్కొన్న ప్రధాని మోదీ
న్యూజిలాండ్‌తో జరిగిన FTA ను ఒక ప్రధాన దౌత్యపరమైన, ఆర్థిక విజయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. దీనిని "చారిత్రాత్మక మైలురాయి" అన్నారు. ఈ ఒప్పందం కేవలం 9 నెలల్లోనే పూర్తయిందని, రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి వేదికను ఏర్పాటు చేస్తుందన్నారు.
ఈ ఒప్పందం అనేక రంగాలలో న్యూజిలాండ్ నుండి $20 బిలియన్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని మోదీ ప్రకటించారు. వ్యాపారవేత్తలు, రైతులు, MSMEలు, విద్యార్థులు, యువతకు విస్తరించిన అవకాశాలను మోదీ హైలైట్ చేశారు. అదే సమయంలో క్రీడలు, విద్య, సాంస్కృతిక మార్పిడిలలో పెరుగుతున్న సహకారాన్ని భారత ప్రధాని ప్రస్తావించారు.






















