India New Zealand Trade Agreement: భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్.. ఫోన్లో మాట్లాడి సెట్ చేసిన ప్రధాని మోదీ
Indian PM Modi | భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య FTA చర్చలు విజయవంతమయ్యాయి. మార్చి 2025లో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి.

India Trade Deal with New Zealand | న్యూఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్‌పై సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలో ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ మరో కీలక దౌత్యం విషయంలో విజయాన్ని సాధించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో భారత్- న్యూజిలాండ్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) పై ఉమ్మడి ప్రకటన వెలువడింది. ఈ ఒప్పందం ఇరు దేశాల మద్య ఆర్థిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడమే కాకుండా, అమెరికా సంరక్షణాత్మక వాణిజ్య విధానాల సమయంలో భారత్ ప్రత్యామ్నాయ ప్రపంచ భాగస్వామ్యాలను కూడా బలపరుస్తుంది.
9 నెలల్లో చారిత్రాత్మక ఒప్పందం పూర్తి
భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య FTA చర్చలు మార్చి 2025లో ప్రారంభమయ్యాయి. అప్పుడు ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత్ పర్యటనకు వచ్చారు. కేవలం 9 నెలల సమయంలో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తి కావడం ఇరు దేశాల రాజకీయ సంకల్పాన్ని, వ్యూహాత్మక అవగాహనను స్పష్టం చేస్తుంది.
ఐదేళ్లలో రెట్టింపు వాణిజ్యమే లక్ష్యం
FTA అమలులోకి వచ్చిన తర్వాత రాబోయే ఐదేళ్లలో ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాల నాయకులు అంగీకరించారు. ఇది భారత్, న్యూజిలాండ్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సరికొత్త ఆవిష్కరణలు, సప్లై చైన్ సిస్టమ్ సహకారానికి కొత్త ఊపునిస్తుంది.
15 ఏళ్లలో భారత్‌లో 20 మిలియన్ డాలర్ల పెట్టుబడి
ఈ ఒప్పందం ప్రకారం, న్యూజిలాండ్ రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో 20 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడి విద్య, సాంకేతికత, స్టార్టప్స్, వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఆహార శుద్ధి, వంటి రంగాలలో అవకాశాలను సృష్టిస్తుంది.
భారత్‌కు ఏడో అతిపెద్ద FTA, ప్రపంచ నెట్‌వర్క్ బలోపేతం
న్యూజిలాండ్‌తో ఈ ఒప్పందం గత కొన్నేళ్లుగా భారత్ చేసుకున్న ఏడో అతిపెద్ద FTAగా నిలిచింది. అంతకుముందు భారత్.. యూకే, ఒమన్, యూఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్, EFTA దేశాలతో (యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ బ్లాక్) ఇలాంటి ఒప్పందాలు చేసుకుంది. ఈ క్రమంలో భారత్ వేగంగా విశ్వసనీయమైన ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఎదుగుతోంది. అదే సమయంలో అమెరికా విధించే టారిఫ్ లను ఎదుర్కొని మరింత దృఢంగా అడుగులు వేస్తోంది.






















