Tirumala News: తిరుమలలో భారీ రద్దీ , సొంత వాహనాల్లో వచ్చే భక్తులకు టీటీడీ విజ్ఞప్తి!
TTD Summer Arrangements: పరీక్షల హడావుడి అయిపోయింది... భక్తులంతా తిరుమలకు క్యూ కట్టేశారు. ఫలితంగా కొండపై భారీ రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు భక్తులకు కొన్ని సూచనలు చేస్తున్నారు..

Tirumala: వేసవి సెలవుల సందడి ప్రారంభమైంది. ఆ హడావుడి మొత్తం తిరుమల శ్రీవారి సన్నిధిలోనే కనిపిస్తోంది. వేసవి సెలవులు కావడంతో భారీగా భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి పోటెత్తుతున్నారు. తిరుమల కిక్కిరిసి కనిపిస్తోంది. ఏప్రిల్ 20 ఆదివారం రోజు శ్రీనివాసుడిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80 వేలు దాటింది. వారిలో 25 వేల 078 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఒక్క రోజే హుండీ ద్వారా 3.85 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 7 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా టీటీడీ సేవకులు అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీళ్లు, అల్పాహారం అందించారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్టుగా అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఎక్కడికక్కడ నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మంచినీళ్లు పంపిణీ చేస్తున్నారు. శ్రీవారి సేవకుల సేవలను భక్తులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీవారి దర్శన టోకెన్లు , టికెట్లు ఉన్న భక్తులు నిర్ధేశిత సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
భక్తుల రద్దీ భారీగా పెరగడంతో TTD అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సర్వదర్శన క్యూలైన్లు పరిశీలించారు. టీటీడీ ఏర్పాట్లు, భక్తుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసే మొబైల్ ఫుడ్ వెహికల్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు ఉన్న భక్తులు వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి వెళ్లేందుకు క్యూలైన్లలోకి ప్రవేశించాలని సూచించారు.
ఇక తిరుమలకు సొంత వాహనాల్లో వచ్చేవారు అప్రమత్తంగా వ్యవహరించాలని, వాహనాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని తిరుపతి పోలీసు అధికారులు తెలిపారు. వేసవికాలం కావడంతో తిరుమలకు వస్తున్న కార్లలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఈమేరకు భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. 500 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కార్లు వేడెక్కిపోతాయి..ఘాట్ రోడ్డులోకి ప్రవేశించిన తర్వాత ఇతరత్రా లోటుపాట్లు తోడై మంటలు వ్యాపిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ముందే వాహనన్ని సర్వీస్ చేయించుకోవాలని సూచించారు. ఇంజిన్, కూలెంట్, బ్రేకులు, ఏసీ, ఆయిల్ తనిఖీ చేయించాలని, రేడియేటర్ లీకేజీలు గుర్తించడం, ఫ్యాన్ బెల్ట్ చూసుకోవడం, బ్యాటరీ డిస్టిల్ వాటర్ తనిఖీ చేసుకోవడం, వైర్ల చుట్టూ చేరిన తుప్పును తొలగించడం లాంటి జాగ్రత్తలు చూసుకోవాలన్నారు. దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఘాట్ రోడ్ ఎక్కేముందు కనీసం 30 నిముషాల పాటు వాహనం ఆపేయాలని, కొండపైకి వెళ్లే దారిలో ఏసీ ఆఫ్ చేయడం మంచిదని సూచించారు. మొదటి ఘాట్ నుంచి కిందకు దిగే సమయంలో బ్రేకులు ఎక్కువగా వాడకుండా ఇంజిన్ బ్రేక్స్ వినియోగించడం మంచిదన్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చన్నారు..
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















