Adani News : ఒక్క నెలలో తారుమారైన జాతకం - ఆదానీ ఎంత నష్టపోయారో తెలుసా ?
నెల రోజుల్లో తారుమారైంది అదానీ నెట్ వర్త్. సగం కంటే ఎక్కువే ఆస్తి కోల్పోయారు. కుబేరుల జాబితాలో దిగువకు వెళ్లిపోయారు.
Adani News : భారత పారిశ్రామికవేత్త.. ప్రపంచంలోనే నెంబర్ 3 కుబేరునిగా ఎదిగిన గౌతమ్ అదానీ ఎంత వేగంగా ఆ స్థాయికి చేరుకున్నారో అంతే వేగంగా పడిపోయారు. నెల రోజుల్లో మారిపోయిన పరిణామాలతో ఆయన సంపద సగానికిపైగానే పడిపోయింది. నెల క్రితం 120 బిలియన్ల డాలర్లు ఉన్న ఆయన నెట్ వర్త్ .. ఇప్పుడు 50 బిలియన్ల డాలర్ల లోపు పడిపోయింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసర్చ్ ఇచ్చిన నివేదికతో అదానీ ఆస్తులన్నీ కుదేలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ కేవలం 49.1 బిలియన్ల డాలర్లు అని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా వెల్లడిస్తోంది.
ముంచేసిన హిండెన్ బెర్గ్ రిపోర్ట్
హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్టుతో స్టాక్ మార్కెట్లలో అదానీ కంపెనీలు నష్టాల్ని చవిచూశాయి. దీంతో నెల క్రితం ప్రపంచంలోనే మూడవ సంపన్న వ్యక్తిగా ఉన్న అదానీ.. ఇప్పుడు ఆ జాబితాలో చాలా కిందకు పడిపోయారు. అదానీ గ్రూపులోని ఏడు ప్రధాన కంపెనీలు మార్కెట్లో దాదాపు 120 బిలియన్ల డాలర్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. వలం నెలలోనే అదానీ సుమారు 71 బిలియన్ల డాలర్ల సంపదను కోల్పోయారు. టాప్ 500 మంది సంపన్న వ్యక్తుల జాబితాలో.. అతి త్వరగా సంపదను కోల్పోయిన వారిలో అదానీ నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితా ప్రకారం అదానీ అత్యంత వేగంగా తన సంపదను కోల్పోయారు.
రెండు లక్షల కోట్లకుపైగానే అదానీ అప్పులు
అదానీ గ్రూప్ గ్రాస్ అప్పులు 2021–22 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.2,20,584 కోట్లకు పెరిగినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. ఇందులో సుమారు రూ. 81 వేల కోట్లు దేశ బ్యాంకులు ఇచ్చాయి. బ్రోకరేజి కంపెనీ జెఫ్రీస్ రిపోర్ట్ ప్రకారం, ఈ అప్పుల్లో 70 శాతం వాటా ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఉండగా, ప్రైవేట్ బ్యాంకుల నుంచి 30 శాతం ఉంది. ఈ అప్పులకు సెక్యూరిటీగా అదానీ గ్రూప్‌కు చెందిన ఆస్తులు, షేర్లు, క్యాష్ ఫ్లోస్, బాండ్లు ఉన్నాయి. అందువలన అదానీ గ్రూప్ అప్పులను చెల్లించడంలో డీఫాల్ట్ అయినా, బ్యాంకులు ఈ గ్రూప్ ఆస్తులను టేకోవర్ చేసే అవకాశం ఉంది. మరోవైపు అదానీ గ్రూప్ అప్పుల్లో మెజార్టీ భాగం ఫారిన్ బ్యాంకులు, బాండ్లు ద్వారా వచ్చినవే ఉన్నాయి.
అదానీ ఎప్పటికి కోలుకుంటారు?
ఫారిన్ బ్యాంకులు అదానీ గ్రూప్‌కు రూ.54 వేల కోట్ల అప్పులిచ్చాయని, మరో రూ.లక్ష కోట్లకు పైగా అప్పును బాండ్ల ద్వారా సేకరించిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. కాగా, అదానీ గ్రూప్ ఇష్యూ చేసిన బాండ్లలో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎన్‌పీఎస్ వంటి సంస్థలే ఎక్కువగా ఇన్వెస్ట్ చేశాయి. మరోవైపు ఎల్‌ఐసీ లాంటి డీఐఐలు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో భారీగా ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ మార్కెట్లలో అదానీ కంపెనీల షేర్లు పడిపోతూనే ఉన్నాయి.ఇంకా పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో అదానీ ఎప్పుడు కోలుకుంటారా అన్నదానిపై మార్కెట్ వర్గాలకూ స్పష్టత లేకుండా పోయింది.