The Diplomat Movie Review - 'ది డిప్లొమాట్' రివ్యూ: ఇండో - పాక్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఉజ్మా అహ్మద్ మీద తీసిన సినిమా
The Diplomat Review In Telugu: జాన్ అబ్రహం హీరోగా నటించిన హిందీ సినిమా 'ది డిప్లొమాట్'. ఇండియా, పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన ఉజ్మా అహ్మద్ కేసు మీద తీసిన చిత్రమిది. ఇదెలా ఉందో రివ్యూలో చూడండి.

శివమ్ నాయర్
జాన్ అబ్రహం, సాదియా ఖతీబ్, రేవతి, జగ్జీత్ సందు, కుముద్ మిశ్రా, షరీబ్ హష్మీ తదితరులు
John Abraham's The Diplomat Review In Telugu: 'పఠాన్'తో జాన్ అబ్రహం భారీ హిట్ అందుకున్నారు. అయితే, అందులో ఆయన విలన్. దానికి ముందు, తర్వాత హీరోగా నటించిన సినిమాలు ఏవీ సరైన విజయాలు అందించలేదు. యాక్షన్ హీరో ఇమేజ్ పక్కనపెట్టి... ఇండియా, పాకిస్థాన్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఉజ్మా అహ్మద్ కేసు ఆధారంగా 'ది డిప్లొమాట్' చేశారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (The Diplomat Movie Story): పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో గల ఇండియన్ హై కమీషన్ (ఎంబసీ) ఆఫీసుకు ఉజ్మా అహ్మద్ (సాదియా ఖతీబ్) వస్తుంది. తాను ఇండియన్ అని, వాఘా బోర్డర్ మీదుగా పాకిస్థాన్ వచ్చానని, తనకు మాయ మాటలు చెప్పి ఇక్కడకు వచ్చేలా చేసిన తాహిర్ (జగ్జీత్ సందు) తనను బలవంతంగా పెళ్లి చేసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, తనను కాపాడమని ప్రాథేయపడుతుంది. ఇండియా వెళ్లిపోతానని అంటుంది.
ఉజ్మా అహ్మద్ చెప్పేది నిజమేనా? ఆవిడ భారతీయురాలేనా? ఒకవేళ ఇండియన్ అయితే తాహిర్ వలలో ఎలా పడింది? ఉజ్మా అహ్మద్ చెప్పిన మాటల్ని భాతర్ హై కమిషనర్ జేపీ సింగ్ (జాన్ అబ్రహం) నమ్మారా? లేదా? ఆమెను ఇండియా పంపే క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారు? ఎటాక్స్ జరిగినా భయపడకుండా ఉజ్మాను మళ్లీ వాఘా బోర్డర్ ఎలా దాటించారు? అనేది సినిమా.
విశ్లేషణ (The Diplomat Telugu Review): ఇండియా, పాకిస్థాన్ నేపథ్యంలో ఆలియా భట్ 'రాజీ' వంటి స్పై థ్రిల్లర్, సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో 'ఉరి' వంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. వాటితో కంపేర్ చేస్తే... 'ది డిప్లొమాట్' డిఫరెంట్ ఫిల్మ్. ఇదొక సిట్యువేషనల్ బేస్డ్ ఫిల్మ్, ఇంకా చెప్పాలంటే మానవతా కోణంలో చూడాల్సిన ఎమోషనల్ ఫిల్మ్.
ఇండో - పాక్ యాంగిల్ తీసుకున్నప్పటికీ... తాహిర్ ఇంట్లో తనకు ఎదురైన చేదు ఘటనల గురించి ఉజ్మా అహ్మద్ చెబుతుంటే థియేటర్లలో ప్రేక్షకులలో కొందరికి అయినా సరే తెలియకుండా కన్నీరు వచ్చేస్తుంది. ఎటువంటి అసభ్యతకు తావు లేకుండా ఉజ్మా అహ్మద్ మీద తాహిర్ లైంగిక దాడికి పాల్పడిన చూపించిన తీరు దర్శకుడు శివమ్ నాయర్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆ సన్నివేశంలో సాదియా ఖతీబ్ నటన, ఆవిడ కంటి నుంచి కారిన కన్నీటి బొట్టు ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేస్తుంది. పాకిస్థానీ మహిళా? ఇండియన్ అమ్మాయా? అనే సందేహం ఒకవైపు కలుగుతున్నా... అటువంటి పరిస్థితుల్లో నుంచి ఆ మహిళను బయట పడేయాలని కోరుకుంటాం.
మలేషియాలో తాహిర్, ఉజ్మా అహ్మద్ ఒకరికొకరు పరిచయం అవుతారు. అయితే, అతనితో ఆమె ప్రేమలో పడటానికి బలమైన కారణం ఏదీ కనిపించదు. పాకిస్థాన్ ఐఎస్ఐ అధికారుల తీరు కొత్తగా లేదు. పాకిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకు రావడానికి అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ (Sushma Swaraj) చేసిన కృషిని వార్తల్లోనూ, ఇటీవల 'తండేల్'లో చూశాం. అందువల్ల, అదీ కొత్త కాదు. కానీ, జేపీ సింగ్ చేసిన కృషి - ఆయన చూపిన తెలివితేటలు కొత్త. పాక్ అధికారుల్ని కంట్రోల్ చేయడానికి జేపీ సింగ్ ఎత్తుకు పైఎత్తు వేసే సీన్స్, ఆ ఫోన్ కాల్స్ బావుంటాయి.
ఇండో పాక్ నేపథ్యంలో సినిమా అనగానే దేశభక్తి ప్రధాన అంశం అవుతుంది. కానీ, 'ది డిప్లొమాట్'లో దేశభక్తిని మించి మానవతా కోణం, దృక్పథం ప్రేక్షకుల మనసుల్ని స్పృశిస్తుంది. సినిమా నిడివి మరికొంత తగ్గించి స్క్రీన్ ప్లేలో వేగం పెంచితే బావుండేది. పలు సన్నివేశాలు నిదానంగా సాగుతాయి. కెమెరా వర్క్, మ్యూజిక్, ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్టు ఉన్నాయి.
సాదియా ఖతీబ్ నటన ఆశ్చర్యపరుస్తుంది. సాలిడ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. కేవలం అందంగా కనిపించడం కాదు... అంతకు మించి నటన కనబరిచింది. పాత్ర పరిధి దాటకుండా జాన్ అబ్రహం సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సుష్మా స్వరాజ్ పాత్రలో నటి రేవతి హుందాగా కనిపించారు. లాయర్ పాత్రలో కుముద్ మిశ్రా మధ్యలో నవ్వించే ప్రయత్నం చేశారు. జగ్జీత్ సందు, షరీబ్ హష్మీ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఇండియా, పాకిస్థాన్... రెండు దేశాల్లో సంచలనం సృష్టించిన ఉజ్మా అహ్మద్ కేసు, అప్పట్లో తెర వెనుక ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. కామన్ ఆడియన్ వరకు ఇదొక డీసెంట్ డ్రామా థ్రిల్లర్. ఏ అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఒకసారి చూసి రావచ్చు. జాన్ అబ్రహం వంటి యాక్షన్ హీరోతో సహజత్వానికి దగ్గరగా తీసిన చిత్రమిది. సాదియా ఖతీబ్ సాలిడ్ యాక్టింగ్‌కు క్లాప్స్ కొట్టాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

