Tirupati Crime News:రాత్రికి రాత్రే గోవుల మాయం - గూడూరులో సంచలనం
Tirupati Crime News:తిరుపతి జిల్లా గూడూరులో పశువులు రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి. ఎవరు అపహరిస్తున్నారో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

Tirupati Crime News: తిరుపతి జిల్లా గూడూరులో పశువులు మాయం అవుతున్నాయి. దీనిపై కొద్దిరోజులుగా పోలీసులకు వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. 20 రోజుల వ్యవధిలో 150కిపైగా పశువులు తస్కరించారు. ఇది స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
ఇంటి వద్ద కట్టి ఉంచిన పశువులు రాత్రికిరాత్రే దండగులు అపహరించుకుపోతున్నారు. తెల్లారేసరికల్లా దొడ్లో కట్టిన గోవులు, ఎద్దులు ఇతర పశువులు కనిపించకపోవడంతో యజమానులు లబోదిబోమంటున్నారు. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన
సీసీటీవీ ఫుటేజ్ చూసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. కట్టి ఉంచిన ఆవులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అవి స్పృహతప్పిపోయేలా చేస్తున్నారు. వెంటనే వాటిని వాహనాల్లోకి ఎక్కించేస్తున్నారు. అవి బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆవులను తరిలించే వాహనాలకు నెంబర్‌ప్లేట్‌లు ఉండకపోవడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు.
150కిపైగా పశువులు అపహరణ
ఒకట్రెండు కాదు ఇరవై రోజుల నుంచి ఈ తతంగం సాగుతోంది. దాదాపు కోటి రూపాయలకుపైగా విలువైన 150కిపైగా ఆవులు, దూడలు, ఎద్దులు ఇతర పశువులు గూడూరులో మాయమయ్యాయి. ఒక్క గూడూరులోనే ఇది జరిగిందా ఇంకా ఎక్కడైనా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. ఇంత వరకు వేరే ప్రాంతాల్లో ఫిర్యాదులు రాలేదని అంటున్నారు.
వివిధ కోణాల్లో దర్యాప్తు
ఇలా రాత్రికిరాత్రే పశువులను చోరీ చేసిన దుండగులు ఏం చేస్తున్నారనేది పెద్ద ప్రశ్న. విదేశాలకు తరలిస్తున్నారా లేకా స్థానికంగా ఎక్కడైనా కబేళా ఏర్పాటు చేశారా అన్నది తెలియడం లేదు. ఈ కోణంలో కూడా పోలీసు టీమ్‌లు విచారణ చేస్తున్నాయి.
గుంపులుగా ఊరిమీద పడి పశువుల అపహరణ...
ఇది ఒకరిద్దరి పని మాత్రం కాదని రెండు మూడు ముఠాలు కలిసి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఇందులో స్థానికులు కూడా భాగమై ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికుల భాగస్వామ్యం లేకుంటే అంత ధైర్యంగా వచ్చి ఆవులను ఎత్తుకెళ్లే సాహసం చేయబోరని అంటున్నారు. మొదట గూడూరు నిమ్మ మార్కెట్‌లో ఈ చోరీ మొదలు పెట్టారు. అక్కడ బండ్లు వద్ద కట్టి ఉంచిన ఎద్దులను ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి గుడూరులో చాలా పశువులు మాయమయ్యాయి. ఇందులో ఎక్కువగా గోవులు ఉండటం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతు ఫిర్యాదుతో వెలుగులోకి పశువుల అపహరణ ఇష్యూ
గూడూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో సుబ్బారెడ్డి అనే రైతు ఫిర్యాదుతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇష్యూ తీవ్రతను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిసి పుటేజీ, ఇతర మార్గాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలా గోవులు మాయమవుతున్నాయనే విషయంలో స్థానికంగా వైరల్ అయింది. దీంతో విశ్వహిందూ పరిషత్, బ్లూ-క్రాస్ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. వాళ్లు కూడా వివిధ ప్రాంతాల్లో తిరిగి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఆయన పాయింట్‌మెంట్ సోమవారం ఇచ్చినందున కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు.





















