Be Happy Movie Review - బీ హ్యాపీ రివ్యూ: Prime Videoలో అభిషేక్ బచ్చన్ సినిమా... డ్యాన్స్ బేస్డ్ డ్రామా బావుందా?
OTT Review - Be Happy Streaming On Prime Video: అభిషేక్ బచ్చన్, నోరా ఫతేహి, నాజర్, ఇనాయత్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'బీ హ్యాపీ' అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

రెమో డిసౌజా
అభిషేక్ బచ్చన్, ఇనాయత్ వర్మ, నాజర్, నోరా ఫతేహి, జానీ లివర్ తదితరులు
Amazon Prime Video
Abhishek Bachchan's Be Happy Review In Telugu: అభిషేక్ బచ్చన్ హీరోగా నటించిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సినిమా 'బీ హ్యాపీ'. ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా దర్శకత్వం వహించారు. అభిషేక్ కుమార్తెగా ఇనాయత్ వర్మ, ప్రధాన పాత్రల్లో నాజర్, నోరా ఫతేహి నటించారు. హిందీలో తీసిన ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి, 'బీ హ్యాపీ' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ (Be Happy Movie Story): శివ్ రస్తోగి (అభిషేక్ బచ్చన్) బ్యాంకు ఉద్యోగి. భార్య రోహిణి (హర్లీన్ సేథీ) మరణించడంతో కుమార్తె ధారా (ఇనాయత్ వర్మ), రోహిణి తండ్రి నాడార్ (నాజర్)తో కలిసి ఊటీలో ఉంటాడు.ధారాకు డ్యాన్స్ రియాలిటీ షో 'ఇండియా సూపర్ స్టార్'లో పార్టిసిపేట్ చేయాలని, విజేతగా నిలవాలని కోరిక.
ఊటీలోని ధారా చదివే స్కూల్‌లో డ్యాన్స్ పోటీలు జరుగుతాయి. దానికి మ్యాగీ (నోరా ఫతేహి) వస్తుంది. ఆమెకు ధారా ఫ్యాన్. ధారా డ్యాన్స్ చూసి మ్యాగీ ముచ్చటపడి ముంబైలోని తన డ్యాన్స్ అకాడెమీకి రమ్మని ఆహ్వానిస్తుంది. అయితే శివ్ 'నో' చెబుతాడు. అటువంటి వ్యక్తి మళ్లీ 'ఎస్' ఎందుకు చెప్పాడు? ముంబై వెళ్లిన తర్వాత ఏం జరిగింది? 'ఇండియా సూపర్ స్టార్' డ్యాన్స్ షోలో ధారా రస్తోగి విజేతగా నిలిచిందా? లేదా? మధ్యలో చిన్నారిని ఆస్పత్రికి ఎందుకు తీసుకు వెళ్లారు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Be Happy Review In Telugu): డ్యాన్స్ బేస్డ్ సినిమాల్లో రాఘవా లారెన్స్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'స్టైల్' ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. హిందీలో 'ఏబీసీడీ' వంటి సినిమాలు వచ్చినప్పటికీ... 'స్టైల్' లాంటి కమర్షియల్ ఫార్మాట్ డ్యాన్స్ బేస్డ్ ఫిల్మ్ ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు ఆ సినిమా ప్రస్తావన ఎందుకంటే... 'బీ హ్యాపీ' క్లైమాక్స్ చూస్తుంటే 'స్టైల్' గుర్తుకు వచ్చింది.
తల్లి లేని అమ్మాయి కలను తండ్రి ఎలా నెరవేర్చాడు? అనేది క్లుప్తంగా కథ. డ్యాన్స్ బేస్డ్ సినిమాగా తీశారు. 'హాయ్ నాన్న'తో పాటు తెలుగులోనూ ఇటీవల కొన్ని సింగిల్ పేరెంట్ కాన్సెప్ట్ సీన్స్ (ఫిలిమ్స్) వచ్చాయి. తల్లి లేని ఇంట్లో పిల్లను తండ్రి, తాతయ్య కలిసి పెంచడం వంటివి కొత్త కాదు. కాన్సెప్ట్ సేమ్ అయినప్పటికీ... కొత్తగా తీసే అవకాశం ఉంది. అయితే... దర్శకుడు రెమో డిసౌజా సినిమా ప్రారంభమైన గంట వరకు సేఫ్ గేమ్ ఆడారు. డ్యాన్స్ రియాలిటీ షో ఎపిసోడ్, ఇంకా చిన్నారి హెల్త్ ఇష్యూ మీద ఎక్కువ నమ్మకం ఉంచారు.
చిన్నారికి ఆరోగ్య సమస్య ఉందని తెలిసిన తర్వాత సినిమాలో ఆసక్తి మొదలైంది. ఆ ఎపిసోడ్ వచ్చే వరకు రొటీన్ అండ్ నార్మల్ సీన్లతో సాగదీత వ్యవహారమే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... హాస్పిటల్ సీన్స్ అన్నీ మనసులను టచ్ చేసేలా, కాస్త కళ్లు చెమ్మగిలేలా తీశారు. అమ్మవారి నేపథ్యంలో వచ్చే పాటలో అభిషేక్ బచ్చన్ గెటప్ నుంచి డ్యాన్స్ వరకు బాగా కంపోజ్ చేశారు. సాంగ్స్ గానీ, మ్యూజిక్ గానీ ఎట్రాక్టివ్‌గా లేవు. సినిమాకూ అదీ ఒక మైనస్. సీన్స్, స్క్రీన్ ప్లే... ప్రతిదీ ప్రెడిక్టబుల్.
డ్యాన్స్ అంటే హ్యాపీ అని, హ్యాపీగా ఉన్నప్పుడు డ్యాన్స్ చేయగలమని 'బీ హ్యాపీ'లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అయితే... కుమార్తె కల కోసం, పాపను హ్యాపీగా ఉంచడం కోసం ఎప్పుడూ రిజర్వ్డ్‌గా ఉండే తండ్రి డ్యాన్స్ చేయడమనే పాయింట్ బావుంది. కానీ, రెమో డిసౌజాతో పాటు రైటింగ్ టీమ్ ఎంగేజింగ్‌గా కథను చెప్పడంలో ఫెయిల్ అయ్యింది. మొదటి గంట సేపు రొటీన్ సీన్స్ అయితే... అసలు కథ మొదలైన తర్వాత ఆ డ్యాన్స్ షో సీన్స్ కూడా అలాగే తీశారు. కొత్తగా ప్రయత్నించలేదు. కొత్త సినిమా అందించాలని చూడలేదు. అభిషేక్, నోరా ఫతేహి మధ్య ట్రాక్ కుదరలేదు.
తల్లి లేని అమ్మాయిని బాధ్యతగా పెంచి పెద్ద చేయాలని ప్లాన్ చేసుకునే తండ్రిగా అభిషేక్ బచ్చన్ ఒదిగిపోయారు. పైన చెప్పినట్టు డ్యాన్స్ స్టేజి మీద కొరడా పట్టి తనను తాను కొట్టకునే సాంగ్ చాలా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ కూడా! ఆయన కుమార్తెగా నటించిన ఇనాయత్ వర్మ ముద్దు ముద్దుగా ఉంది. మొదట ఎంత సింపుల్‌గా కనిపించిందో... చివరకు వచ్చేసరికి అంత ఏడిపించింది. నటనతో పాటు డ్యాన్స్ కూడా బాగా చేసింది. ఈ సినిమాకు నోరా ఫతేహి గ్లామర్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. నాజర్‌తో వినోదం చేయించాలని చూశారు. కానీ, కుదరలేదు. జానీ లివర్ సీన్ అయితే స్పేస్ ఫిల్లర్ కింద తప్ప అస్సలు నవ్వించలేదు.
ఆడియన్స్ రెండు గంటల పాటు హ్యాపీగా చూసే కథ, కథనాలు 'బీ హ్యాపీ'లో లేవు. ఆ కథను పక్కన పెట్టి డ్యాన్స్ చూసినా సరే... హై ఇచ్చే మూమెంట్స్ లేవు. ఇదొక రెగ్యులర్ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఎమోషనల్ ఫిల్మ్. తండ్రి కుమార్తె మధ్య ఎమోషనల్ బాండింగ్, ముఖ్యంగా అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత కాస్త కంటతడి పెట్టిస్తుందీ సినిమా. డ్యాన్స్ అంటే విపరీతమైన ఇష్టం లేదా కుమార్తెను ప్రాణంగా ప్రేమించే తండ్రులకు తప్ప సాధారణ తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చడం కష్టం. ఓటీటీలో ఫార్వర్డ్ ఆప్షన్ ఉంది కనుక చూడాలని అనుకుంటే ఓసారి ట్రై చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

