Saripodhaa Sanivaaram Movie Review - సరిపోదా శనివారం రివ్యూ: నాని మాస్ హీరోయిజం వర్సెస్ ఎస్.జె. సూర్య విలనిజం - సినిమా ఎలా ఉందంటే?
Saripodhaa Sanivaaram Review In Telugu: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా 'సరిపోదా శనివారం'. ఎస్.జె. సూర్య విలన్‌గా చేశారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
వివేక్ ఆత్రేయ
నాని, ఎస్.జె. సూర్య, ప్రియాంక మోహన్, సాయి కుమార్ తదితరులు
2 Hours 50 Minutes
Nani and SJ Suryah's Saripodhaa Sanivaaram movie review: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే సుందరానికి' వచ్చింది. ఆ సినిమా అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో రెస్పెక్ట్ ఉంది. కానీ, కమర్షియల్ లెక్కల పరంగా కొంత వెనుకబడింది. అయితే... ఈసారి వాళ్లిద్దరూ కలిసి 'సరిపోదా శనివారం' చేశారు. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య విలన్ రోల్ చేశారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. మరి, ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూడండి.
కథ (Saripodhaa Sanivaaram Story): చిన్నతనంలో తల్లికి ఇచ్చిన మాట కోసం కేవలం శనివారం మాత్రమే సూర్య (నాని) తన కోపాన్ని చూపిస్తాడు. మిగతా ఆరు రోజులు ఎవరి మీద అయితే కోపం వస్తుందో వాళ్ల పేర్లు ఓ పుస్తకంలో రాసుకుని, శనివారం కూడా ఆ కోపం ఉంటే వాళ్లను కొడతాడు.
ఎటువంటి దయ, కరుణ, జాలి లేకుండా సోకులపాలెం ఏరియాలో ప్రజలను తనకు కోపం వచ్చినప్పుడు, తనకు ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టే దయా (ఎస్.జె. సూర్య) పేరును సూర్య తన పుస్తకంలో ఎందుకు రాసుకున్నాడు? ఆ సోకులపాలెం ప్రజల కోసం సూర్య ఎందుకు నిలబడ్డాడు? దయా దగ్గర కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్)తో సూర్యకు ఎలా పరిచయమైంది? ఆమెతో ప్రేమ కథ ఏమిటి? సూర్యకు ఉన్న కోపం ఆమెకు తెలిసిందా? లేదా? మధ్యలో దయానంద్, అతని అన్నయ్య కూర్మానంద్ (మురళీ శర్మ) మధ్య ఉన్న గొడవలు ఏంటి? దయాను సూర్య ఏం చేశాడు? తనను సూర్య టార్గెట్ చేశాడని దయాకు తెలిసిందా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Saripodhaa Sanivaaram Review Telugu): 'సరిపోదా శనివారం' టీమ్ చేసిన గొప్ప పని ఏమిటంటే... కాన్సెప్ట్ ముందు చెప్పేయడం! హీరోకి కోపం వస్తే శనివారం మాత్రమే కొడతాడు. మిగతా రోజుల్లో టచ్ చేయడు. ఈ విషయం ఆడియన్స్ అందరికీ తెలుసు. అందువల్ల, థియేటర్లకు వచ్చిన జనాలు కథ గురించి ఆలోచించడం మానేసి క్యారెక్టరైజేషన్లు ఎంజాయ్ చేయడం మొదలైంది.
కాన్సెప్ట్ కుదిరితే, అందులో కిక్ ఉంటే... సన్నివేశాలు ఎంత అద్భుతంగా వస్తాయి? అనేది చెప్పడానికి 'సరిపోదా శనివారం' ఒక చక్కటి ఉదాహరణ. వివేక్ ఆత్రేయ తీసుకున్న కాన్సెప్ట్‌లో విషయం ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా బావుంది. కథ విషయంలో ప్రేక్షకులకు ఎటువంటి డౌట్స్ క్రియేట్ చేయలేదు. మెదడుకు పని చెప్పే సన్నివేశాలు అసలే లేవు. స్ట్రెయిట్ నేరేషన్ కూడా ఈ కాన్సెప్ట్‌కు హెల్ప్ అయ్యింది. తెరపై క్యారెక్టర్లకు ఏం జరుగుతుందో తెలియదు. కానీ, ప్రేక్షకులకు తెలుసు కదా! అందుకే, చారులతతో '90 శాతం కేసును నువ్వే సాల్వ్ చేశావ్' అని సూర్య అంటే ఒక్కసారిగా నవ్వు వస్తుంది. అత్త కూతురుకు పెళ్లి అయ్యిందని హీరో బాధ పడే సన్నివేశాలు భలే నవ్విస్తాయి.
'సరిపోదా శనివారం'కు మేజర్ డ్రాబ్యాక్... రన్ టైమ్. ఆ నిడివి విషయంలో కేర్ తీసుకుంటే బావుండేది. కాన్సెప్ట్ ఏంటనేది ఆడియన్స్‌కు కూడా క్లారిటీ ఉంది. హీరో - విలన్ మధ్య కాన్‌ఫ్లిక్ట్ లేదా వివేక్ ఆత్రేయ భాషలో చెప్పాలంటే ఆ 'దాగుడు మూతలు' ఎక్కువ సేపు సాగింది. ఇంటర్వెల్ ముందు కూడా సన్నివేశాల్లో కాస్త నిడివి ఎక్కువ ఉన్నా వినోదం ప్లస్ కాన్సెప్ట్ వల్ల పెద్దగా తెలియలేదు. ఇంటర్వెల్ తర్వాత హీరో - విలన్ మధ్య ఫైట్ కోసం ఎదురు చూపులు ఎక్కువ కావడంతో అది నోటీస్ చేసేలా ఉంది.
వివేక్ ఆత్రేయ రాసుకున్న కథ, క్యారెక్టరైజేషన్లను నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళ్లిన ఘనత మాత్రం నాని, ఎస్.జె. సూర్యలతో పాటు సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ (Jakes Bejoy)కు దక్కుతుంది. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం అడ్రినల్ రష్ తీసుకు వచ్చింది. మురళీ జి సినిమాటోగ్రఫీ 'సరిపోదా శనివారం'కు కొత్త కలర్ తీసుకు వచ్చింది. సాధారణ సన్నివేశాల్లో లైటింగ్ బ్రీజీగా ఉంటుంది. యాక్షన్ సీన్స్ వచ్చేసరికి ఆ మూడ్ క్రియేట్ చేసేలా లైటింగ్ మారింది. మురళి జి ఫాలో అయిన కలర్ థీమ్ ప్యాట్రన్ బావుంది. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మాణ విలువలు బావున్నాయి.
ప్రతి పాత్ర తన కోసమే రాశారని అన్నట్టు... ఆ పాత్రలో ఒదిగిపోవడం నానీకి ఉన్న అలవాటు. సూర్య పాత్రలోనూ చక్కగా ఒదిగిపోయారు. సగటు సన్నివేశాల్లో మనం ఇంతకు ముందు చూసిన నాని కనిపించారు. కానీ, కోపం ప్రదర్శించేటప్పుడు - యాక్షన్ సన్నివేశాల్లో కొత్తగా ఉన్నారు. చారులతగా ప్రియాంక మోహన్ నటన ఓకే. క్యూట్ లుక్స్, ఇన్నోసెంట్ యాక్టింగ్... పాత్రకు తగ్గట్టు నటించారు. నాని, ప్రియాంక మోహన్ మధ్య 'ఈగ'ను గుర్తు చేసే సన్నివేశాలు బావున్నాయి.
విలనిజం అంటే ఏమిటి? తెరపై విలన్ చేసే పనులకు అతడిని కొట్టినా సరే తప్పు లేదని ప్రేక్షకుడు ఫీలయ్యేలా నటించడం! ఎస్.జె. సూర్య స్పెషాలిటీ ఏమిటంటే... దయా పాత్రలో అతని నటన చూసి ప్రేమలో పడేలా చేశారు. తల పైకెత్తుకుని ఓ విధంగా నడవడం నుంచి, 'సుధా' అని డైలాగ్ చెప్పే తీరు వరకు ప్రతి విషయంలో పెర్ఫెక్షన్ చూపించారు. దయా పాత్రలో ఎస్.జె. సూర్యను తప్ప మరొకరిని అసలు ఊహించుకోలేం. అంత గొప్పగా నటించారు. ప్రతి సన్నివేశంలో మిగతా ఆర్టిస్టులను డామినేట్ చేశారు. నో డౌట్... ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ క్యారెక్టర్లలో 'సరిపోదా శనివారం'లో దయా కూడా చేరుతుంది. విలనిజం మాత్రమే కాదు... తన డైలాగ్ డెలివరీతో నవ్వులు కూడా పూయించారు. ఎస్.జె. సూర్య - మురళీ శర్మ మధ్య సన్నివేశాలు బావున్నాయి.
హీరో తండ్రిగా సాయి కుమార్ చక్కని నటన కనబరిచారు. హీరోకి ఆయన ఇచ్చే కౌంటర్లు వర్కవుట్ అయ్యాయి. శుభలేఖ సుధాకర్, అజయ్ ఘోష్, శివాజీ రాజా, 'సురభి' ప్రభావతి, హర్షవర్ధన్, అజయ్ తదితరులు తమకు వచ్చిన అవకాశాన్ని వృథా చేయలేదు. తమకు లభించిన స్పేస్‌లో మంచి నటన కనబరిచారు.
కమర్షియల్ సినిమాలకు ఈ తరహా కాన్సెప్ట్ సరిపోదా? యాక్షన్ సన్నివేశాల్లో తన నటనలో నాని చూపించిన కొత్తదనం సరిపోదా? ఆ వినోదం సరిపోదా? అంటే... సరిపోతుంది అని కాదు, బావుందని చెప్పాలి. విలన్‌గా ఎస్.జె. సూర్య నటన సరిపోదా? అంటే... సరిపోతుంది అని కాకుండా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. విడుదలకు ముందు ఇంటర్వ్యూల్లో నాని చెప్పినట్టు... ఆయన బ్యాక్ సీటు తీసుకోవడంతో ఎస్.జె. సూర్య ఫ్రంట్ సీటులో కూర్చుని అదరగొట్టేశాడు. లాస్ట్ పంచ్ మనది అయితే ఆ కిక్కే వేరప్పా అన్నట్టు... చివరిలో సూర్యగా నాని చెప్పే డైలాగ్ ఆయనలో నటుడిని బాగా చూపించింది. కామర్హ్సియల్ ఫార్మటులో కొత్తగా ఎంటర్టైనర్ చేసే సినిమా 'సరిపోదా శనివారం'