Sourav Ganguly Accident: సౌరవ్ గంగూలీకి తప్పిన ముప్పు- కారును ఢీ కొట్టిన లారీ - వెస్ట్‌బెంగాల్‌లో దుర్ఘటన
Sourav Ganguly Accident: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీ కొట్టింది.

Sourav Ganguly Accident: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి భారీ ప్రమాదం తప్పింది. ఆయన కారును వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. సౌరవ్ గంగూలీ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే కార్యక్రమానికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది.
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న వాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. గంగూలీ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఆయన వెళ్తున్న కాన్వాయ్‌లో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.
ప్రమాదం తర్వాత పది నిమిషాలు రోడ్డుపై ఉన్న గంగూలీ వేరే కారులో బుర్ద్వాన్ విశ్వవిద్యాలయ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు.
"నేను చాలా ఆనందంగా ఉన్నాను. బుర్ద్వాన్‌కు రావడం సంతోషంగా ఉంది. మీరు నన్ను ఆహ్వానించినందుకు చాలా మరింత సంతోషంగా ఉన్నాను. BDS (బుర్ద్వాన్ స్పోర్ట్స్ అసోసియేషన్) చాలా కాలంగా నన్ను ఆహ్వానిస్తోంది. ఈ రోజు ఇక్కడ ఉండటం చాలా బాగుంది. 50 సంవత్సరాలుగా బుర్ద్వాన్ క్రీడా సంస్థతో కలిసి CAB పనిచేస్తోంది. జిల్లా నుంచి చాలా మంది ఆటగాళ్ళు వెలుగులోకి వచ్చారు. భవిష్యత్తులో కూడా ఆటగాళ్లు రావాలని కోరుకుంటున్నాను" అని ఆయన అన్నారు.




















