AP CM Chandrababu: వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
Andhra Pradesh News | రాష్ట్రంలో కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి ఆదాయం పెంచే మార్గాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. వారికి టెక్నాలజీ తోడైతే మెరుగైన ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు.

Chandrababu reviews BC and EWS departments | అమరావతి: ఏపీలో కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బీసీల అభివృద్ధిపై ఫోకస్ చేస్తోంది. వెనకబడిన తరగతుల (BC) కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆదరణ-3 అమలుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖలపై శుక్రవారం నాడు సమీక్షించారు. కులవృత్తులను బతికిస్తున్న వారికి టెక్నాలజీ తోడైతే వారి చేసే పని సులభతరం అవుతుందన్నారు. వారి ఆదాయాన్ని పెంచుకునేందుకు పనికొచ్చే కొత్త పనిముట్లు, పరికరాలను అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇందుకుగానూ లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి కొత్త పరికరాలు అందించి, వారి ఆదాయం పెరిగేలా చూడాలన్నారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. బీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) కార్పొరేషన్ల ద్వారా అమలవుతున్న పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలి. బీసీల్లోని అన్ని సామాజికవర్గాల వారికి పథకాలతో లబ్ధి చేకూరాలి. ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేసేలా బీసీలను మంత్రులు, సంబంధిత అధికారులు ప్రోత్సహించాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన వారి జాబితా సిద్ధం చేయాలి. కులవృత్తులపై రుణాలు తీసుకున్న వారి వివరాలు ఆడిట్ చేయాలి. బీసీల తలసరి ఆదాయాన్ని లెక్కించేందుకు అవసరమైతే సర్వే చేయాలి. 2014-19 మధ్య నిర్వహించిన పల్స్ సర్వే, గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఉన్న బీసీ కులగణన (BC Caste Census) సమాచారాన్ని పరిశీలించి సమగ్ర నివేదిక తయారుచేయాలని’ అని స్పష్టం చేశారు.
బీసీలపై దాడులపై విచారణకు ప్రత్యేక కమిషన్
‘గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో బీసీలను ఊచకోత కోశారు. వారిపై జరిగిన దాడులు, హత్యలపై విచారణను వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తాం. ఇందుకోసం బీసీలపై జరిగిన దారుణాల విచారణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తాం. సబ్‌కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టాన్ని అమలుచేస్తాం. వసతి గృహాల్లోని బీసీ విద్యార్థులకు అవసరమైన వస్తువులు, పరికరాలు ఇవ్వాలి. ఇప్పటికే రూ.13.10 కోట్లతో చేపట్టిన మరమ్మతులను 6 వారాల్లో పూర్తి చేయాలి. వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిల మొత్తం రూ.4.33 కోట్లను విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న రూ.185.27 కోట్ల డైట్‌ఛార్జీలలో తక్షణమే రూ.110.52 కోట్లు విడుదల చేయాలి. వీటితో పాటు కాస్మొటిక్ బిల్లులను, విద్యుత్తు బకాయిలను చెల్లించాలి. కుప్పంలో బీసీ బాలికల గురుకుల స్కూల్ ఏర్పాటు చేయాలి. గుడిమల్ల, గోనబావి, గుండుమల, రొద్దంలలోని రెసిడెన్షియల్ స్కూల్ పనుల పూర్తికి రూ.119కోట్లు విడుదల చేయాలని’ సీఎం చంద్రబాబు అన్నారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలిపామని చంద్రబాబు అన్నారు. అవసరమైతే ఇందుకోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. రజకుల కోసం 2014-19 మధ్య నిర్మించిన ధోబీఘాట్లకు మరమ్మతు చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయాలి. చేనేత వస్త్రాలపై జీఎస్టీ (GST) రద్దు విషయంపై విధివిధానాలు రూపొందించినట్లు చంద్రబాబు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

