Preventing Kidney Diseases : కిడ్నీల వ్యాధులను నివారించే మార్గాలు ఇవే.. సమ్మర్లో మూత్రపిండాలను ఇలా కాపాడుకోవాలట
Kidney Health : సమ్మర్లో వివిధ ఆరోగ్య సమస్యలతో పాటు కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. మరికొందరికి కిడ్నీల్లో రాళ్లు వస్తాయి. ఇలా జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

Protect Your Kidney Health : శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి. రక్తం నుంచి శరీరంలోని అన్ని వ్యర్థాలను ఫిల్టర్ చేసి.. ఆరోగ్యంగా ఉండడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలా వచ్చిన వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి కిడ్నీలు. రక్తంలో లవణాలు, ఖనిజాలు, నీటి సమతుల్యతను కాపాడుకోవడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి సరిగ్గా పని చేయకుంటే.. నరాలు, కణజాలాలు, కండరాలు సమర్థవంతంగా పనిచేయవు. అందుకే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయకుంటే వివిధ సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే కిడ్నీలను హెల్తీగా ఉంచుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. మరి కిడ్నీలను హెల్తీగా ఉంచుతూ.. ఫిట్‌గా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
పెయిన్ కిల్లర్స్
వివిధ ఆరోగ్య సమస్యల దృష్ట్యా చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో పాటు.. మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా పెరుగుతాయి. కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గుతుంది. కాబట్టి వైద్యులను సంప్రదించి వాటిని కంట్రోల్ చేయాలంటున్నారు.
షుగర్ కంట్రోల్
మధుమేహం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. ఇవి కిడ్నీలపై నెగిటివ్ ప్రభావాలను చూపిస్తాయి. కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగుకుండా చూసుకోవాలి. ఎందుకంటే రక్తంలోని అధిక చక్కెర స్థాయిలు మూత్రపిండాల్లో రక్తనాళాలు అడ్డుపడేలా చేస్తాయి. దీనివల్ల రక్తనాళాలు, కిడ్నీలు రెండూ దెబ్బతింటాయి. కాబట్టి.. హెల్తీ ఫుడ్స్ తీసుకుంటూ.. మందులు ఉపయోగిస్తూ.. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయాలి.
బీపీ కూడా
కిడ్నీ వ్యాధులు నివారించడానికి రక్తపోటు కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. అధిక రక్తపోటు మూత్రపిండాలకు నష్టాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి జీవనశైలిలో మార్పులు చేయడం, బరువు కంట్రోల్ చేయడం చాలా అవసరం. అంతేకాకుండా రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తూ.. వైద్యులు సూచించిన మందులు వేసుకోవాల్సి ఉంటుంది.
హెల్తీ ఫుడ్
కిడ్నీ వ్యాధులను నివారించడంలో ఫుడ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. కిడ్నీ సమస్యలను దూరం చేయడంలో హెల్తీ ఫుడ్‌ని చేర్చుకోవచ్చు. సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఫుడ్ రక్తపోటుతో పాటు రక్తంలో షుగర్‌ను, కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. కిడ్నీల ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలు, బీన్స్, పప్పులు, బంగాళదుంపలు వంటి వాటిని డైట్లో చేర్చుకోవచ్చు.
నో ఆల్కహాల్
ఆల్కహాల్ మూత్రపిండాల వ్యాధులను పెంచుతాయి. మితిమీరిన ఆల్కహాల్ అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి.. వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి దీనిని లిమిట్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదా ఆరోగ్యం కోసం పూర్తిగా దానిని మానేయాలని అంటున్నారు.
ధూమపానం
స్మోకింగ్ వల్ల స్ట్రోక్, గుండెపోటు సమస్యలు పెరుగుతాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడంతో పాటు.. కిడ్నీ వ్యాధులను అధికం చేస్తాయి. కాబట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు స్మోకింగ్ మానేయాలని సూచిస్తున్నారు నిపుణులు. దీనివల్ల కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడడంపాటు.. పూర్తి ఆరోగ్యం చక్కబడుతుంది.
రెగ్యులర్ వ్యాయామం
రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తే.. మూత్రపిండాల వ్యాధులను నివారించవచ్చు. ఇది బీపిని తగ్గించి.. కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. కాబట్టి రోజూ వ్యాయామం చేయాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
ఆక్సలేట్ ఉన్న ఫుడ్‌కి దూరంగా ఉండడంతో పాటు.. అధికంగా ఉప్పు ఉండే ఫుడ్‌ని తినకూడదని చెప్తున్నారు నిపుణులు. ఇవి కిడ్నీల్లో రాళ్ల ఏర్పడేలా చేస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండాలని.. లేకుంటే సమ్మర్లో కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. రెగ్యులర్ చెకప్‌లకు వెళ్తే కిడ్నీల ప్రమాదాలను తగ్గించుకోవచ్చని చెప్తున్నారు.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న సంతానోత్పత్తి సమస్యలు.. కారణాలు ఇవే, అబ్బాయిలు ఆ విషయాల్లో జాగ్రత్త
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

