Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ - దీపాదాస్ మున్షికి ఉద్వాసన
AICC: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ ను ఏఐసీసీ నియమించింది. ప్రస్తుత ఇంచార్జ్ దీపాదాస్ మున్షిని తప్పించారు.

AICC appointed Meenakshi Natarajan as Telangana Congress in-charge: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా దీపాదాస్ మున్షిని తప్పించి.. మీనాక్షి నటరాజన్ ను నియమించారు. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌కు చెందిన వారు. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పని చేస్తున్నారు. 1999–2002 వరకు NSUI అధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత 2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008లో AICC కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2009 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ నుండి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. అయితే తర్వాత రెండు సార్లు ఓడిపోయారు. మీనాక్షి నటరాజన్ .. రాహుల్ గాంధీ టీమ్ సభ్యురాలిగా గుర్తింపు పొందారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఇంచార్జ్ గా బెంగాల్ కు చెందిన దీపాదాస్ మున్షిని నియమించారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కాబట్టి ఆమె పార్టీ వ్యవహారాలకే పరిమితం కావాలి కానీ ఆమె పాలనలో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. మంత్రి వర్గ విస్తరణ జరగకపోవడానికి కూడా ఆమె అడ్డం పడటమే కారణమన్న అసంతృప్తి కొంత మంది నేతల్లో ఉంది. అవసరమైనప్పుడు రాష్ట్రానికి రావడం కన్నా.. వచ్చిన వెంటనే ఓ పెద్ద బంగళా రెంట్ కు తీసుకుని ఇక్కడే ఉండి వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు.
సాధారణంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంటి వద్ద లేదా గాంధీభవన్ వద్ద కన్నా.. దీపాదాస్ మున్షి ఇంటి వద్దే ఎక్కువ సందడి ఉంటుందన్న విమర్శలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పార్టీ నేతలు వచ్చి కలుస్తూనే ఉంటారని చెబుతారు. ఎవరెవరు కలవాలనేది దీపాదాస్ మున్షి వ్యక్తిగత టీం నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు చెబుతాయి. దీపాదాస్ మున్షి రాష్ట్రంలోకి వచ్చిన కొత్తలో అత్యంత లగ్జరీ కారును గిఫ్టుగా పొందారని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే వారిపై ఆమె కోర్టులో కేసు వేశారు.
ఎన్నికలకు కొన్ని నెలల ముందు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ, ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరిస్తూ పార్టీని విజయపథం వైపు నడిపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని పోలింగ్ కేంద్రాలకు పార్టీ ఏజెంట్లను నియమించడం, వారికి పోలింగ్ పై శిక్షణ ఇప్పించడం చేశారు. ఎన్నికల సమయంలో గాంధీ భవన్ లో వార్ రూంను సమర్థంగా నిర్వహించి పార్టీని విజయతీరాలకు చేర్చారు. అయితే గెలవగానే ఆయనను తప్పించి దీపాదాస్ మున్షిని నియమించారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కు చాన్సిచ్చారు.
రాహుల్ గాంధీ టీమ్ లో సభ్యురాలిగా ఉన్న మీనాక్షిని నియమించడం వల్ల పాలనపై నేరుగా రాహుల్ ముద్ర ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

