Bloody Mary Movie Review - 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?
OTT Review - Bloody Mary Movie: 'కార్తికేయ' వంటి థ్రిల్లర్‌తో దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటి తీసిన లేటెస్ట్ థ్రిల్లర్ 'బ్లడీ మేరీ'. ఆహా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
చందూ మొండేటి
నివేదా పేతురాజ్, అజయ్, బ్రహ్మాజీ, కిరీటి దామరాజు, రాజ్ కుమార్ కాశీరెడ్డి తదితరులు
సినిమా రివ్యూ: 'బ్లడీ మేరీ'
రేటింగ్: 2.5/5
నటీనటులు: నివేదా పేతురాజ్, అజయ్, బ్రహ్మాజీ, కిరీటి దామరాజు, రాజ్ కుమార్ కాశీరెడ్డి తదితరులు
రచన: ప్రశాంత్ కుమార్ దిమ్మల
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: కాల భైరవ
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం: చందూ మొండేటి
విడుదల తేదీ: ఏప్రిల్ 15, 2022 (ఆహా ఓటీటీలో)
నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'బ్లడీ మేరీ' (Bloody Mary). చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించారు. వీళ్ళిద్దరికీ తొలి ఓటీటీ చిత్రమిది. నేడు ఆహా ఓటీటీ (Aha Video OTT)లో విడుదలైంది. 'కార్తికేయ' వంటి థ్రిల్లర్‌తో దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటి, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఎలా తీశారు? ఈ సినిమా ఎలా ఉంది? (Bloody Mary Review)
కథ: మేరీ (నివేదా పేతురాజ్) ఓ అనాథ. మరో ఇద్దరు అనాథలు బాషా (కిరీటి దామరాజు), రాజు (రాజ్ కుమార్ కాశీరెడ్డి)తో కలిసి విశాఖలో ఉంటోంది. మేరీ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. బాషాకు మాటలు రావు (మూగవాడు). కానీ, యాక్టర్ కావాలనేది అతడి కల. అందుకని, ఆడిషన్స్‌కు అటెండ్ అవుతుంటాడు. రాజుకు వినపడదు (చెవిటివాడు). కెమెరామ్యాన్ అవ్వాలనేది లక్ష్యం. కెమెరా కొనుక్కోవడానికి అతడికి మేరీ డబ్బులు ఇస్తుంటుంది.
తమలోని లోపాలను పక్కనపెట్టి... ముగ్గురూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారని అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటనలు జరుగుతాయి. డాక్టర్‌ను మేరీ హత్య చేస్తుంది. మరో హత్యకు బాషా, రాజు సాక్షులు అవుతారు. డాక్టర్ హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి మేరీ దగ్గరకు వచ్చిన సిఐ ప్రభాకర్ (అజయ్)కు, మరో హత్యకు సంబంధం ఏమిటి? జాలరు పేటలో శేఖర్ బాబు (బ్రహ్మాజీ)కి, ఈ కథకు సంబంధం ఏమిటి? సిఐ ప్రభాకర్, శేఖర్ బాబు నుంచి మేరీకి ఎటువంటి ప్రమాదం ఎదురైంది? తప్పించుకోవడానికి ఆమె ఏం చేసింది? మేరీ గతం ఏమిటి? చివరకు, ఆమె ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: 'ఆడది ఆబల కాదు, సబల' అని నిరూపించిన చిత్రాలు తెలుగులో కొన్ని వచ్చాయి. మహిళా ప్రాధాన్య చిత్రాలు మనకి కొత్త కాదు. అలాగే, థ్రిల్లర్ సినిమాలు కూడా! గతంలో వచ్చిన చిత్రాలకు, 'బ్లడీ మేరీ'కి వ్యత్యాసం ఏంటి? ఇందులో కొత్తదనం ఏముంది? అని చూస్తే... రెగ్యులర్ ఫార్మాట్ / మూస ధోరణిని దాటి బయటకు రావడానికి దర్శక - రచయితలు ప్రయత్నించారు. కమర్షియల్ హంగుల పేరుతో రొటీన్‌గా కాకుండా, నిజాయితీగా క్రైమ్ థ్రిల్లర్ తీసే ప్రయత్నం చేశారు. ఆ అంశంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు.
'ముందు నుయ్యి, వెనుక గొయ్యి' లాంటి పరిస్థితిలో ఓ అమ్మాయి చిక్కుకుంది. ఆమె తోడు ఉన్న ఇద్దరికీ లోపాలు ఉన్నాయి. ఆమెకూ ఓ లోపం ఉంది. సాధారణంగా ఇటువంటి సెటప్ కుదిరినప్పుడు అమ్మాయిపై సానుభూతి కలిగేలా సన్నివేశాలు రాసే - తీసే వీలు రచయిత - దర్శకుడికి ఉంది. చెవిటి, మూగ వ్యక్తులను అలుసుగా తీసుకుని కామెడీ చేయవచ్చు. గతంలో కొందరు చేశారు కూడా! అయితే... రచయిత ప్రశాంత్ కుమార్ దిమ్మల, దర్శకుడు చందూ మొండేటి ఆ రూటులో వెళ్ళలేదు. తన తెలివితేటలతో ప్రమాదం నుంచి మహిళ గట్టెక్కినట్టు చూపించారు. ఆమెతో పాటు మిగతా ఇద్దరికీ ఉన్నత లక్ష్యాలు ఉన్నట్టు చూపించారు. ఇటువంటి మంచి ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయాలి.
'బ్లడీ మేరీ' కథను చెప్పిన విధానం ఆసక్తికరంగా ఉంది. ప్రమాదం ఎదురైనప్పుడు షార్ప్‌గా ఆలోచించే గుణం ఉన్నట్టు హీరోయిన్ పాత్రను బలంగా రాసుకున్నారు. అయితే... 'సూపర్బ్' అని ఫీలయ్యేలా వావ్ ఫాక్టర్ లేదు. హీరోయిన్ చిన్నతనంలో ఒక ఘటన జరిగినట్టు చూపిస్తారు. మళ్ళీ చాలా సేపటి వరకూ ఆ ఘటన ప్రస్తావన ఉండదు. కథంతా ఒక హత్య చుట్టూ తిరుగుతుంది. మరో హత్య గురించి ఎవరూ పట్టించుకోరు. అదేంటో మరి!? స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా చూస్తే... సింపుల్ సెటప్, సింపుల్ ట్రీట్మెంట్! దర్శక - రచయితలు చాలా స్వేచ్ఛ తీసుకున్నారు.
దర్శకుడికి సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని నుంచి మంచి సపోర్ట్ లభించింది. కెమెరా వర్క్ నీట్‌గా, సినిమా మూడ్‌ను రిఫ్లెక్ట్ చేసేలా ఉంది. నేపథ్య సంగీతంలో ఇంగ్లీష్ గీతాన్ని వినిపిస్తూ... సంగీతానికి మోడ్రన్ టచ్ ఇచ్చారు కాలభైరవ. కథతో పాటు ఆయన నేపథ్య సంగీతం ప్రయాణించింది. కథలో ప్రేక్షకుడిని లీనం చేసేలా ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఓటీటీ సినిమా కాబట్టి... తక్కువ మంది ఆర్టిస్టులతో సింపుల్‌గా తీశారు.
నివేదా పేతురాజ్‌కు సెటిల్డ్, ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ చేసే రోల్ లభించింది. ఆమె అభినయం ఆకట్టుకుంటుంది. పాత్రకు న్యాయం చేశారు. చక్కటి క్యారెక్టరైజేషన్స్ కుదరడంతో కిరీటి దామరాజు, రాజ్ కుమార్ కాశిరెడ్డి బాగా చేశారు. సిట్యువేషనల్ కామెడీ సీన్స్‌లో రాజ్ కుమార్ నవ్వించారు. అజయ్, బ్రహ్మాజీకి ఇటువంటి పాత్రల్లో నటించడం కొట్టిన పిండి. అలవోకగా చేసుకుంటూ వెళ్లారు. 'మిర్చి' హేమంత్, పమ్మి సాయి పాత్రల నిడివి తక్కువైనా... ఉన్నంతలో బాగా చేశారు.
Also Read: 'కేజీయఫ్ 2' సినిమా రివ్యూ: నో డౌట్ - బొమ్మ బ్లాక్‌బస్టర్, యశ్ అదుర్స్ అంతే!
ఓవరాల్‌గా చెప్పాలంటే... టైమ్‌పాస్‌కు సినిమా చూడాలనుకునే వాళ్ళకు ఓటీటీలో మంచి ఆప్షన్ 'బ్లడీ మేరీ'. క్రైమ్ థ్రిల్లర్ నుంచి ఆశించే ట్విస్టులు ఉన్నాయి. మధ్య మధ్యలో సిట్యువేషనల్ కామెడీ కూడా పర్లేదు. ఆర్టిస్టులు అందరూ డీసెంట్ పెర్ఫార్మన్స్‌లు ఇచ్చారు. అన్నిటి కంటే ముఖ్యంగా సినిమా నిడివి గంటన్నరే. ఈజీగా టైమ్ పాస్ చేయొచ్చు. సీక్వెల్ మీద క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి ఎనిమిదేళ్ళల్లో మేరీ ఎంతో ఎత్తుకు ఎదిగినట్టు చూపించారు. సీక్వెల్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు.
Also Read: 'బీస్ట్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?