KGF 2 Movie Review - 'కేజీయఫ్ 2' సినిమా రివ్యూ: నో డౌట్ - బొమ్మ బ్లాక్‌బస్టర్, యశ్ అదుర్స్ అంతే!
KGF 2 Telugu Movie Review: యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కె.జి.యఫ్ 2' సినిమా నేడు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?
ప్రశాంత్ నీల్
యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి తదితరులు
సినిమా రివ్యూ: 'కేజీయఫ్ 2'
రేటింగ్: 3.25/5
నటీనటులు: యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనిధి శెట్టి, ఈశ్వరీ రావు తదితరులు
సినిమాటోగ్రఫీ: భువన గౌడ
సంగీతం: రవి బస్రూర్
నిర్మాత: విజయ్ కిరగందూర్
రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2022
KGF 2 Movie Review In Telugu: 'కె.జి.యఫ్' విడుదలకు ముందు యశ్ (Hero Yash) కన్నడ స్టార్ మాత్రమే. ఒక్క సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) అతడిని పాన్ ఇండియా స్టార్ చేశారు. 'కె.జి.యఫ్'కు కొనసాగింపుగా వస్తున్న 'కె.జి.యఫ్ 2'కు దేశవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ వచ్చాయంటే... ఆ సినిమా ఇంపాక్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి, 'కేజీయఫ్ 2' (KGF Chapter 2 Review) సినిమా సైతం అదే స్థాయిలో ప్రభావం చూపిస్తుందా? సినిమా (KGF 2 Review Telugu) ఎలా ఉంది?
కథ: 'కె.జి.యఫ్' కథ ఎక్కడ ముగిసిందో, 'కె.జి.యఫ్ 2' కథ అక్కడ మొదలు అవుతుంది. మొదటి అధ్యాయం కథను ఆనంద్ వాసిరాజు చెబితే, ఈ రెండో అధ్యాయం కథను ఆయన కుమారుడు విజయేంద్ర వాసిరాజు (ప్రకాశ్ రాజ్) చెబుతారు. ఇక, కథ విషయానికి వస్తే...
గరుడను చంపిన తర్వాత నారాచిని హస్తగతం చేసుకుంటాడు రాకీ భాయ్ (యశ్). అతడికి ఎదురు లేదని అనుకుంటున్న తరుణంలో అధీరా (సంజయ్ దత్) రూపంలో ప్రమాదం వచ్చి పడుతుంది. అందరూ మరణించాడని అనుకుంటున్న అధీరా బతికి ఉండటానికి కారణం ఎవరు? అతడు మళ్ళీ వెనక్కి రావడానికి కారణం ఎవరు? రాకీ భాయ్, అతడి సామ్రాజ్యం గురించి తెలిసిన నూతన ప్రధాన మంత్రి రమికా సేన్ (రవీనా టాండన్) ఏం చేశారు? ఒకవైపు అధీరా... మరోవైపు రమికా సేన్... మధ్యలో ఎదురయ్యే అడ్డంకులను రాకీ భాయ్ ఏ విధంగా ఎదుర్కొన్నాడు? చివరికి, ఏం చేశాడు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: 'కె.జి.యఫ్' చూసిన వాళ్ళకు దర్శకుడు ప్రశాంత్ నీల్ శైలి ఏంటో అర్థమై ఉంటుంది. రెగ్యులర్‌గా ప్రేక్షకులు చూసే కమర్షియల్ సినిమాలకు డిఫరెంట్ కమర్షియల్ టోన్‌లో సినిమా చూపించి విజయం అందుకున్నారు. 'కె.జి.యఫ్ 2'లోనూ ఆ టోన్ కంటిన్యూ అయ్యింది. యాక్షన్ సీక్వెన్సులు, హీరో ఎలివేషన్స్, హీరోయిజం చూపించే సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ అన్నట్టు రాసుకున్నారు. అలాగే తెరపైకి తీసుకొచ్చారు ప్రశాంత్ నీల్. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఓవర్ ద బోర్డ్ యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్‌కు తప్ప... ఫ్యామిలీ ఆడియన్స్‌కు అవి నచ్చే అవకాశాలు లేవు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి... 'కె.జి.యఫ్' విడుదలైన తర్వాత వచ్చిన విమర్శల్లో యాక్షన్, ఎలివేషన్ ఎక్కువైందనేది ప్రధానమైనది. ఈ సినిమా విషయంలో ఆ విమర్శ మరింత బలంగా వినిపించవచ్చు. ఎందుకంటే... యాక్షన్ సీన్స్‌లో వయలెన్స్ ఎక్కువే ఉంది. 'కె.జి.యఫ్'తో మదర్ సెంటిమెంట్ పండింది. రెండో అధ్యాయంలో సెంటిమెంట్ పరంగా కొంత తగ్గిందని చెప్పాలి. స్టోరీలో డెప్త్ కొంచెం తక్కువ అయ్యింది. హీరో ఎలివేషన్స్ మీద విపరీతమైన ప్రేమ కనబరిచిన ప్రశాంత్ నీల్... అందుకు తగ్గట్టు కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్స్ నుంచి మంచి అవుట్‌పుట్ తీసుకున్నారు. ఆ మూడు సినిమాటోగ్రఫీ హాలీవుడ్ శైలిలో ఉన్నాయి. కార్ ఛేజింగ్ సీక్వెన్సులో ఎడిటింగ్ బావుంది. రవి బస్రూర్ సంగీతం లేకుండా సినిమాను ఊహించలేం. హీరో ఎలివేషన్ షాట్స్‌కు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
రాకీ భాయ్ పాత్రలో యశ్ జీవించాడు. అతడిని తప్ప మరొకరిని ఆ పాత్రలో అసలు ఊహించుకోలేం. శత్రువుల పాలిట సింహస్వప్నంగా రౌద్రం పలికించిన యశ్... మదర్ సెంటిమెంట్ సీన్స్, లవ్ సీన్స్ కూడా బాగా చేశారు. యశ్ తర్వాత మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన నటీనటులు ఇద్దరు ఉన్నారు. ఒకరు... రవీనా టాండన్. మరొకరు... సంజయ్ దత్!
ప్రధాన మంత్రిగా రవీనా టాండన్ ఎంతసేపు కనిపించారనేది పక్కన పెడితే... కనిపించిన ప్రతిసారీ, ఫ్రేమ్‌లోనూ ఆమెను తప్ప మరొకరిని చూడలేం. ట్రైలర్‌లో 'ఘుస్ కె మారెంగే' డైలాగ్ చెప్పారు కదా! ఆ సన్నివేశంలో ఆమె నటన మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ సీన్ ఇంపాక్ట్ సినిమాలో ఒక రేంజ్‌లో ఉంది. సంజయ్ దత్ గెటప్ బావుంది. ఆయన ఎంట్రీ సీన్ సూపర్. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ ఆర్క్ ఆశించిన రీతిలో సాగలేదు. ఉన్నంతలో బాగా చేశారు. విజయేంద్ర వాసిరాజు పాత్రలో ప్రకాశ్ రాజ్ వాయిస్, ఆ మాడ్యులేషన్ కథను వివరించడానికి తోడ్పడ్డాయి. హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్రకు 'కె.జి.యఫ్'తో పోలిస్తే... 'కె.జి.యఫ్ 2'లో ఇంపార్టెన్స్ పెరిగింది. ఈశ్వరీ రావు, రావు రమేష్, అచ్యుత్ కుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు తన ప్రతిభ కనబరిచారు.
Also Read: 'బీస్ట్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
'Powerful people make places Powerful' - 'కేజీయఫ్ 2'లో ఒక డైలాగ్. అందులో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే... 'పవర్‌ఫుల్ పెర్ఫార్మన్స్‌లు, కెమెరా వర్క్, మ్యూజిక్ సినిమాను మరింత పవర్‌ఫుల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాయి' అనేది మాత్రం 100 శాతం నిజం. కథ, కథనం, పాత్రల చిత్రణ పరంగా 'కేజీయఫ్ 2'లో కొన్ని లోపాలు ఉన్నాయి. సినిమా ప్రారంభమైన ఒక అరగంట బావుంటుంది. ఆ తర్వాత హీరో ఎలివేషన్స్ తప్ప కథ ముందుకు సాగదు. మళ్ళీ ఇంటర్వల్ దగ్గర స్పీడ్ అందుకుంటుంది. ఆ తర్వాత సెకండాఫ్‌లో ఎక్కడా జోరు తగ్గలేదు. మన ఊహలకు అతీతంగా, సర్‌ప్రైజ్ చేస్తూ సినిమా ముందుకు సాగింది. ముందుగా చెప్పినట్టు అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకోవడం కష్టం. కమర్షియల్, మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంకో విషయం... టైటిల్స్ పడిన తర్వాత థియేటర్ నుంచి బయటకు రావొద్దు. ఎండ్ కార్డ్స్ తర్వాత ఇంకో సీన్ ఉంది. అది మిస్ అవ్వొద్దు.